గుంటూరు, జూన్ 15,
వైఎస్ఆర్‌సీపీ పార్లమెంట్ పార్టీ నాయకుడిగా వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి, లోక్‌సభలో పార్టీ పక్ష నాయకుడిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి వైసీపీ అధినేత జగన్ నియమించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఎంపీలతో సమావేశం అయిన తర్వాత జగన్ చేసిన ఈ ప్రకటన చాలా మందిని ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే మూడు పదవులు ఒకే వర్గానికి నిర్మోహమాటంగా కేటాయించారు. సీనియర్ ఎంపీలు ఉన్నప్పటికీ వారిని పరిగణనలోకి తీసుకోలేదు.వైసీపీకి లోక్ సభలో నలుగురు మాత్రమే ఎంపీలు ఉన్నారు. అందులో ఇద్దరు రెడ్డి సామాజికవర్గం వారు, ఒకరు ఎస్సీ, మరొకర ఎస్టీ. అదే రాజ్యసభలో మాత్రం పదకొండు మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఐదుగురు రెడ్డి సామాజికవర్గం వారు. మరో ఆరుగురు నలుగురు బీసీ, ఒకరు ఎస్సీ, మరొకరు గుజరాత్ కు చెందిన పరిమళ్ నత్వానీ. నలుగురు బీసీ నేతల్లో ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, బీద మస్తాన్ రావు వంటి సీనియర్లు ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇతర సామాజికవర్గాల వారి పేర్లను అసలు పరిగణనలోకి తీసుకోలేదు. ముగ్గురు తమకు సన్నిహితులైన రెడ్డి సామాజికవర్గం వారికే పదవుల కట్టబెట్టారు.అందులోనూ విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గించడం మరింత ఆసక్తికరంగా మారింది. గతంలో విజయసాయిరెడ్డి పార్లమెంటరీ పార్టీ నేతగా ఉంటూనే రాజ్యసభ పక్ష నేతగా ఉండేవారు. మిధన్ రెడ్డి లోక్ సభ పక్ష నేతగా ఉండేవారు. ఈ సారి విజయసాయిరెడ్డి ప్రాధాన్యాన్ని తగ్గించి వైవీ సుబ్బారెడ్డికి పార్లమెంటరీ పార్టీ నేత పదవి ఇచ్చారు. నిజానికి విజయసాయిరెడ్డినే ఢిల్లీలో విస్తృత పరిచయాలు కలిగి ఉన్నారు. వైసీపీ తరపున అవసరమైన లాబీయింగ్‌లను ఆయన ఢిల్లీలో చేస్తూంటారు. అయితే ఈ సారి మాత్రం వైవీ సుబ్బారెడ్డికి జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం చేశామని ఎక్కువగా చెబుతూ ఉంటారు. అయితే పార్టీ పరమైన నిర్ణయాలు, పదవుల విషయంలో మాత్రం ఆయన కే వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పార్టీ పదవుల్లో ఇతర కులాల వారిని ఎందుకు కూర్చోబెట్టరన్న ప్రశ్నలు వస్తున్నాయి.అయినా జగన్ ఈ సారి కూడా మూడు పార్లమెంటరీ పార్టీ పదవుల్ని ఒకే వర్గానికి కేటాయించారు. దీనిపై వైసీపీలో ఎవరూ నోరు మెదిపే పరిస్థితి ఉండదు కానీ.. జగన్ చెప్పే సామాజిక న్యాయం అంతా మాటల్లోనేనని విపక్షాలు విమర్శించడానికి అవకాశం దొరుకుతుంది.