YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విజయనగరంలో సగం మంది మహిళా నేతలే

విజయనగరంలో సగం మంది మహిళా నేతలే

విజయనగరం, జూన్ 15,
చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలంటూ దశాబ్దాలుగా మహిళలు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రత్యేక రిజర్వేషన్లు లేకపోయినా ఆ జిల్లాలో మాత్రం 55% శాతం మహిళలే చట్టసభలకు వెళ్తుండటం అందరిని ఆశ్చర్యానికి గుర్తు చేస్తుంది. అంతే కాకుండా ఆ జిల్లాను నడుపుతున్న అధికారులు సైతం మహిళలే కావటం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇంతకీ 50 శాతం దాటి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ జిల్లా ఏది? అక్కడ మహిళలు ఎవరు? అనుకుంటున్నారా? అదే ఒకప్పుడు గజపతిరాజులు ఏలిన విజయనగరం. కానీ ఇప్పుడు మాత్రం ఆ జిల్లాను మహిళలు సమర్థవంతంగా పాలిస్తున్నారు. ఈ జిల్లాకు జిల్లా కలెక్టర్ గా జి.నాగలక్ష్మి ఉండగా, జిల్లా ఎస్పీగా ఎమ్. దీపిక పాటిల్ ఉన్నారు. వీరిద్దరి సమర్ధవంతమైన పాలనలో జిల్లా ఎన్నికలను ఒంటి చేత్తో నడిపించారు. అయితే అలా జరిగిన ఎన్నికల్లో ఈసారి అత్యధిక మంది మహిళలే అసెంబ్లీకి వెళ్ళటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులైన ఐదుగురు మహిళలు గెలుపొందారు. జిల్లా మొత్తం కూటమి క్లీన్ స్వీప్ చేస్తే వారిలో ఈ ఐదుగురు కూడా ఉన్నారు. అలా గెలిచిన వారిలో విజయనగరం నుండి గజపతి రాజుల వారసురాలైన అతిథి గజపతిరాజు ఉన్నారు.ఈమె మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె గత ఎన్నికల్లో మొదటి సారి పోటీ చేసి ఓటమిపాలైన అదితి గజపతిరాజు ప్రస్తుత ఎన్నికల్లో మాజీ డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పై 62 వేల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక ఎస్ కోట నుండి కోళ్ల లలితకుమారి మూడో సారి గెలుపొందారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన లలితకుమారి నలభై వేల భారీ మెజారిటీతో వైసిపి అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావుపై గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఇక సాలూరు నుండి గుమ్మిడి సంధ్యారాణి వరుసగా నాలుగు సార్లు గెలిచారు. ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డిప్యూటి సీఎం పీడిక రాజన్నదొరపై గెలిచి సంచలనం సృష్టించారు. సంధ్యారాణి గతంలో ఎమ్మెల్సీగా పనిచేయగా, ప్రస్తుతం టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులుగా కూడా ఉన్నారు. ఇక మరో అడవిబిడ్డ తోయక జగదీశ్వరి. ఈమె మాజీ డిప్యూటి సిఎం పాముల పుష్ప శ్రీవాణిపై గెలుపొందారు. అలాగే నెల్లిమర్ల నుండి జనసేన తరుపున పోటీచేసిన లోకం నాగ మాధవి నలభై వేల భారీ మెజారిటీతో గెలిచారు. ఇలా విజయనగరం నుండి పూసపాటి అదితి గజపతి రాజు, కురుపాం నుండి తోయక జగదీశ్వరి, సాలూరు నుండి టిడిపి పోలిట్ గుమ్మిడి సంధ్యారాణి, ఎస్ కోట నియోజకవర్గం నుండి కోళ్ల లలిత కుమారి, నెల్లిమర్ల నియోజకవర్గం నుండి లోకం నాగమాధవి గెలుపొందారు. జిల్లా నుండి గెలుపొందిన ఐదుగురు మహిళా ఎమ్మెల్యేల్లో నలుగురు మహిళలు మొదటి సారి అసెంబ్లీలోకి అడుగుపెడుతుండటం ఆసక్తిగా మారింది. అయితే గెలిచిన వారిలో సంధ్యారాణికి మంత్రిపదవి వరించింది. ఈ జిల్లాలో అత్యధికంగా గెలుపొందిన మహిళ ఎమ్మెల్యేలు ఉండటంతో వాళ్లకు పెద్దపీట వేసిన ఘనత తమదే అంటున్నారు కూటమి నేతలు.

Related Posts