YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టీ బీజేపీలో నూతనోత్సాహం

టీ బీజేపీలో నూతనోత్సాహం
భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖలో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఆ పార్టీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు వరుసగా రాష్ట్రంలో పర్యటించడంతో స్థానిక నేతలు, కార్యకర్తలు చురుకుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో మరికొంతమంది జాతీయ నాయకులు పర్యటించనున్నట్లు తెలుస్తోంది. జూన్ 11 లేదా 12 తేదీల్లో జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా భారీ సభ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, బిహార్ మంత్రి మంగళ్‌పాండే తదితరులు రాష్ట్ర పర్యటనకు రానున్నారు. కాగా 2019 పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని 4 పార్లమెంటు క్లస్టర్‌లుగా విభజించారు. వీటి కి సీనియర్ నేతలను ఇన్‌చార్జిలుగా నియమించారు. వారు ఆయా ప్రాంత్లాల్లో తరచూ పర్యటనలు చేస్తుంటారు. స్వరాజ్ అభియాన్ లో భాగంగా బీజేపీ వివిధ కార్యక్రమాలు నిర్వహించింది. దళిత వాడల్లో పల్లెనిద్ర, మోదీ నాలుగేళ్ల పాలన పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా మేధావులు, డాక్టర్లు, లాయర్లు, వివిధ రంగాల ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తోంది. ఇందులో బీజేపీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చిస్తున్నారు. తద్వారా మేధావులు ప్రజల్లోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలకు తెలియజేయాలనేది పార్టీ లక్ష్యం. ఇందులో భాగంగా ఇటీవల నిర్వహించిన పలు భేటీల్లో రామ్‌మాధవ్, రవిశంకర్‌ప్రసాద్‌లు పాల్గొన్నారు. రవిశంకర్ ప్రసాద్ సమావేశానికి మేధావులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో కనీసం నిల్చోడానికి స్థలం కూడా లేకుండా పోయింది. అదేవిధంగా ప్రత్యేకంగా 400మంది బీజేపీ నేతలు విస్తృత చర్చల పేరుతో ఒక్కొక్కరు కనీసం 25 మంది వివిధ రంగాలకు చెందిన మేధావులు, విద్యావంతులను కలిసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇటీవల రాష్ట్ర కమిటీ సమావేశాలు, జాతీయ ప్రధాన కార్యదర్శులు రామ్‌మాధవ్, మురళీధర్‌రావు, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పర్యటనలతో కార్యకర్తల్లో సమరోత్సాహం వచ్చింది. గతానికి భిన్నంగా టీఆర్‌ఎస్‌పై మాటల దాడి పెంచారు. మేధావులతో ప్రత్యేక భేటీలు నిర్వస్తూ మోదీ పాలన గొప్పదనాన్ని ప్రచారం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. బీజేపీ నేతలు ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌పై విమర్శలకు పదునుపెడుతున్నారు. తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చినప్పుడలా టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరు ప్రశంసించి, తెలంగాణ బీజేపీ నేతలను ఆత్మరక్షణలో పడేసేవారు. కానీ ప్రస్తుతం సీన్ రివర్సయింది. ఇటీవల రామ్‌మాధవ్.. హైదరాబాద్‌నే అభివృద్ధి చేయలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా ప్రగతిపథంలో నడిపిస్తారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ ఏం అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు. కాగా, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి చేర్చడంలో మరింత దూకుడు పెంచాలంటూ రాష్ట్ర నేతలకు అధినాయకత్వం సూచించినట్లు తెలుస్తోంది.

Related Posts