YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జూలై 7 నుంచి బోనాలు...

జూలై 7 నుంచి బోనాలు...

హైదరాబాద్, జూన్ 15,
జ్యేష్ఠమాసం అమావాస్య తర్వాత ప్రారంభమయ్యే ఆషాడమాసంలో వచ్చే మొదటి గురువారం లేదా మొదటి ఆదివారం గోల్కొండ కోటపై జగదాంబిక ఆలయంలో బోనాల ఉత్సవాలు మొదలవుతాయి. ఈ ఏడాది జ్యేష్ఠమాస అమావాస్య జూలై 5 శుక్రవారం వచ్చింది...అంటే జూలై 6 శనివారం నుంచి ఆషాడమాసం ప్రారంభమవుతుంది.  జూలై 7  ఆషాడంలో వచ్చే మొదటి ఆదివారం రోజు భాగ్యనగరంలో బోనాల సంబరం ప్రారంభమవుతుంది. గోల్గొండ శ్రీ ఎల్లమ్మ ఆలయంలో తొలిపూజ నిర్వహించిన తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, లాల్ దర్వాజ మహంకాళి ఆలయంలో నెలరోజుల పాటూ ప్రతి గురువారం, ఆదివారం ప్రత్యేక పూజలు జరుగుతాయి...మళ్లీ గోల్గొండ కోటలోనే చివరి రోజు పూజ నిర్వహించడంతో ఉత్సవాలు ముగుస్తాయి.  
జూలై 7 ఆదివారం - గోల్గొండ జగదాంబికకు తొలిబోనం సమర్పణతో ఉత్సవాలు ప్రారంభం
జూలై 11 గురువారం - రెండో పూజ
జూలై 14 ఆదివారం - మూడో పూజ
జూలై 18 గురువారం - నాలుగో పూజ
జూలై 21 ఆదివారం - ఐదో పూజ
జూలై 25 గురువారం - ఆరోపూజ
జూలై 28 ఆదివారం - ఏడో పూజ
ఆగష్టు 1 గురువారం - ఎనిమిదో పూజ
ఆగష్టు 4 ఆదివారం -  తొమ్మిదో పూజ
అంటే జూలై 7 ఆదివారంతో మొదలయ్యే బోనాలు...ఆగష్టు 4 ఆదివారంతో ముగుస్తాయి. అదే రోజు ఆషాడమాస అమావాస్య... ఆగష్టు 5 సోమవారం నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతుంది...లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఏటా ఢిల్లీలో తెలంగాణ భవన్ లో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది కూడా జూలై 8,9,10 తేదీల్లో మూడు రోజుల పాటూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం తరఫున ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేయమని కోరుతూ ఆలయ కమిటీ ప్రతినిధి బృందం రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్ కి వినతి పత్రం సమర్పించింది.  గోల్కొండ బోనాల ట్రస్ట్ బోర్డ్ కమిటీ పదవీకాలం ముగిసింది. దీంతో దేవాదాయ శాఖాధికారులు త్వరలోనే నూతన కమిటీ ఏర్పాటు చేసే సన్నాహాల్లో ఉన్నారు. ఈ మేరకు త్వరలోనే నోటఫికేషన్ ఇవ్వనున్నారు. గోల్గొండ బోనాల ట్రస్ట్ బోర్డ్ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ నాయకులు పోటీపడుతున్నారు. మరి ఈ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి...  ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళుతుందని  భక్తుల విశ్వాసం... అందుకే అమ్మను తమ ఇంటి ఆడబిడ్డలా భావించి భక్తి శ్రద్ధలతో పూజించి నైవైద్యాలు సమర్పిస్తారు. అప్పట్లో బోనాల పండుగ ప్రారంభించే సమయంలో దుష్టశక్తులను తరిమేసేందుకు దున్నపోతుని బలిచ్చేవారు. ఇప్పుడు దున్నపోతుకి బదులు కోడి, మేకలను బలిస్తున్నారు. బోనాలు తీసుకెళ్లే మహిళలపై అమ్మవారు ఉంటుందని భక్తుల నమ్మకం.. అందుకే బోనంపట్టుకున్న మహిళలు ఆలయాన్ని సమీపించగానే పాదాలపై నీళ్లుచల్లి నమస్కరిస్తారు. హైదరాబాదు లోని జగదాంబిక అమ్మవారి ఆలయం  తొలి బోనం సమర్పిస్తారు.. రెండో బోనం బల్కంపేట రేణుక ఎల్లమ్మ గుడిలో, మూడో బోనం సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఇస్తారు.  ఆషాడమాసంలో వర్షాల కారణంగా అంటువ్యాధులు విజృంభిస్తాయి... వైరస్ లు వ్యాప్తి చెందుతాయి. ఈ వ్యాధుల నుంచి కాపాడి ఆరోగ్యాన్ని ప్రసాదించమ్మా అంటూ గ్రామదేవతలను ఆరాధిస్తారు. పూజకోసం ఉపయోగించే వస్తువులైన వేపాకులు, పసుపునీళ్లు.. ఇవన్నీ వైరస్ ను తరిమికొట్టేవే...

Related Posts