YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పాపం... జీవన్ రెడ్డి

పాపం... జీవన్ రెడ్డి

మహబూబ్ నగర్ , జూన్ 13,
మన్నే జీవన్ రెడ్డి.. పాలమూరు జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం ఈ పేరు తెలియని వారుండరు. ఇటీవలే జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి అందరి దృష్టి ఆకర్షించారు. అయితే ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాతో పోటీ చేస్తే, అనుహ్య ఓటమిని మూటగట్టుకున్నాడు. రాజకీయ అరంగేట్రంలోనే ఓటమిపాలై, కోలుకోలేని షాక్ కు గురిచేసింది. దీంతో గెలుపుతోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న ఆయన ఆశలు ఆవిరయ్యాయి.ఎమ్మెల్సీగా పోటీకి ముందే రాజకీయ ప్రవేశం కోసం చాలా ఏళ్ల నుంచే గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారు మన్నే జీవన్ రెడ్డి. బాబాయ్ మన్నే శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పుడే జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేకంగా క్యాడర్ ను సిద్ధం చేసుకున్నారు. అయితే అధికారికంగా బీఆర్ఎస్ లో చేరకపోయినా, ఆ పార్టీ కార్యకర్తలతో నిత్యం టచ్ లో ఉండేవారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఆయన క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని జోరుగా చర్చలు సైతం నడిచాయి.అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ అధిష్టానం సిట్టింగ్ లకే సీట్లు ప్రకటించడంతో కొద్ది రోజులు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. అనంతరం బీఆర్ఎస్ ఓటమి, జిల్లాలో పార్టీ పట్టు కోల్పోవడంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధిష్టానం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరే క్రమంలోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశాన్ని హామీ తీసుకున్నారని జోరుగా చర్చలు నడిచాయి. తర్వాత ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ఏఐసీసీ ప్రకటన సైతం జారీ చేసింది.ఇంతవరకు బాగానే ఉన్నా అసలు కథ ఎమ్మెల్సీ ఉపఎన్నికతోనే మొదలైంది. వాస్తవానికి స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీకే మెజారీటీ సభ్యుల సంఖ్యా బలం ఉంది. భారీగా క్రాస్ ఓటింగ్ జరిగితే తప్ప కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం అసాధ్యం. కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన జోష్, జిల్లాలో 12చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారు. ఎమ్మెల్సీ స్థానాన్ని కచ్చితంగా గెలవాలని ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు అందరూ సమిష్టిగా కృషి చేయాలని అదేశాలు సైతం జారీ చేసింది అధిష్టానం. సిట్టింగ్ స్థానాన్ని కాపాడునేందుకు అధికార కాంగ్రెస్ కు ఎదురొడ్డి… బీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డింది.కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం క్రాస్ ఓటింగ్ అనే అంశాన్ని గుర్తెరిగి, నియోజకవర్గాల వారీగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను గోవా క్యాంప్‌లకు తరలించారు. మాజీ ఎమ్మెల్యేలను ఇంఛార్జీలుగా పదిరోజుల పాటు క్యాంప్ లోనే ఉండేలా చేశారు. గులాబీ అధిష్టానం సైతం క్యాంప్ లను మానిటరింగ్ చేసింది. క్యాంపుల నుంచే నేరుగా పోలింగ్ కేంద్రాలకు తరలించడంతో కాంగ్రెస్ అనుకున్నంత స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరగలేదు. దీంతో 109 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు.సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలింగ్ పూర్తయిన రెండు నెలల తర్వాత కౌంటింగ్ జరిగింది. అన్ని రోజుల పాటు విజయంపై ధీమాగా ఉన్న మన్నే జీవన్ రెడ్డి.. కౌంటింగ్ ప్రారంభమైన గంటలోనే ఓటమిని గ్రహించి లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయారు. వాస్తవంగా అదే బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటి చేస్తే ఎమ్మెల్సీగా మండలిలో అడుగుపెట్టేవారని, అనుహ్యంగా పార్టీ మారి ఓటమి కొనితెచ్చుకున్నారని ఆయన అనుచరులు లెక్కలు వేసుకుంటున్నారట. ఏది ఏమైనా నామినేటెడ్ కాకుండా బరిలో నిలిచి గెలిచే రాజకీయల్లోకి రావాలన్న ఆయన ఆశలు అడియాశలయ్యాయి.

Related Posts