ప్రశ్నిస్తానంటూ.. పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్.. ప్రశ్నించడం పక్కన పెట్టి.. తానే గద్దె నెక్కాలని పక్కా స్కెచ్ సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన నిన్న మొన్నటి వరకు సీఎం అయ్యే అర్హత తనకు లేదని, అనుభవం కూడా లేదని చెప్పుకొంటున్నారు. అయితే, అనూహ్యంగా రాత్రికి రాత్రి ఏ జ్ఞానోదయం కలిగిందో తెలియదు కానీ.. అధికారంలోకి వస్తానని.. సీఎం అవుతానని, ప్రజలకు మేలు చేస్తానని చెబుతున్నారు. అయితే, ఇలా చెప్పడం చేతల్లోకి రావాలంటే చాలా తతంగమే ఉంటుందనేది తెలియని విషయం కాదు. సీఎం సీటును అందుకోవాలంటే .. ఇప్పుడున్న 175 సీట్లలో మేజిక్ ఫిగర్ 88 మంది అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ దిశగా పవన్ చేస్తున్న కృషి ఏమైనా ఉందా? అంటే ప్రశ్నార్థకంగానే మారింది.ముఖ్యంగా టీడీపీ, వైసీపీ వంటి బలమైన పక్షాలను దెబ్బకొట్టి సీఎం సీటును అధిరోహించడం పవన్ వంటి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారికి సాధ్యమా? అనేది కూడా ప్రశ్న. మరి దీనిని దృష్టిలో పెట్టుకుంటే.. ఆయన ఇప్పటికే చాలా యాక్టివ్ అయి ఉండాలి. మాజీలు, యువ నాయకులను పవన్ చేరదీయాల్సి ఉంది. మరి పవన్ ఈ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. పైగా తన వద్దకు వచ్చి.. స్వయంగా పార్టీలో చేరతామని అంటున్న వారిని సైతం పవన్ పట్టించుకోవడం లేదనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎంత బిజీగా ఉన్నా టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్‌లు.. కొత్తవారిని పార్టీలోకి చేర్చుకునేందుకు, కొత్తవారికి అప్పాయింట్‌మెంట్ ఇచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.మరి, ఇప్పుడు ఆ తరహాలో కూడా పవన్ వ్యవహరించడం లేదనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బస్సు యాత్రలో ఉన్న పవన్‌ను కలిసేందుకు పార్టీలో చేరేందుకు కొందరు మాజీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయితే, వారికి ఎవరికీ పవన్ అప్పాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇలాగైతే.. పార్టీ అధికారంలోకి వచ్చినట్టేనని అంటున్నారు.. సదరు మాజీలు. తాజాగా గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య పవన్ కళ్యాణ్‌ను కలడానికివచ్చారు.జనసేనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని, పార్టీలో చేరతానని చెప్పేందుకు ఆయన వచ్చారు. అయితే, పవన్ ఈయనను లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన పవన్ పీఏతో మాట్లాడి, తిరిగి వెళ్లిపోయారు. ఈ పరిణామంపై సీనియర్లు, మాజీలు ఆగ్రహంతో ఉన్నారు. పవన్ నుంచి తమకు కూడా అవమానాలు ఎదురవుతాయని కొందరు ఇప్పటికే పవన్ ను కలవాలని అనుకున్నా వాయిదా వేసుకున్నారు. మరి ఇలా అయితే.. జనసేన ఎప్పటికి ఊపందుకుంటుంది?