అవును! ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయిన చంద్రబాబు నుంచి ప్రస్తుతం ప్రవచిస్తున్న నీతులను మించి ఎక్స్ పెక్ట్ చేయలేమేమోనని అంటున్నారు విశ్లేషకులు. గతంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగిన సమయంలో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో మంత్రిగా ఉన్న తెన్నీరు హరీష్ రావు ఒక మాట అన్నారు.. బాబుది రెండు కళ్ల సిద్ధాంతమని! ఇప్పుడు ఆయన వ్యవహార శైలిని దగ్గరగా చూస్తున్న రాజకీయ పరిశీలకులు దీనినే కొంచెం అటు ఇటు మార్చి.. బాబుది రెండు నీతుల సిద్ధాంతమేమో అంటూ విమర్శలు సంధిస్తున్నారు. ఇంతకీ విషయంలోకి వెళ్తే.. చంద్రబాబు తాజాగా ఓ ప్రకటన చేశారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదిస్తే.. ఆయా చోట్ల తాము పోటీ చేసి ఘన విజయం సాధిచేందుకు రెడీగా ఉన్నామన్నారు. తాము పోటీ చేస్తామని భయపడే.. జగన్ ఈ రాజీనామాలను వాయిదా వేయిస్తున్నారని కూడా కామెంట్ చేశారు.ఇక్కడే చంద్రబాబు ద్వంద్వ నీతి బయటపడిందని అంటున్నారు విశ్లేషకులు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తు న్న క్రెడిట్‌ను తన బుట్టలో వేసుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను బాబు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇతర పార్టీలు చేస్తున్న ప్రత్యేక హోదా ఉద్యమాలు బూటకమని అంటున్నారు. తాను బీజేపీతో చెలిమి చేస్తే.. కాపురమని, ఇతరులు చేస్తే.. అది వ్యభిచారమని కూడా బాబు అంటున్నారు. ఇక, ఏపీ కోసం, ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు ఐదుగురు రాజీనామాలు చేయాలని పట్టుబట్టింది ఎవరో బాబు చెప్పాలి. వాస్తవానికి జగన్ రాజీనామాల అంశాన్ని తెరమీదికి తెచ్చినప్పుడు.. జగన్ ఎంపీలు రాజీనామాలు చేయరని, అవి కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకు చెబుతున్న మాటలని ఎద్దేవా చేశారు చంద్రబాబు అండ్ తమ్ముళ్లు!కానీ, ఆ తర్వాత జగన్ ఎంపీలు మూకుమ్మడిగా ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేశారు. ఇక, ఇంతటితో ఈ విషయా న్ని పక్కన పెట్టిన బాబు.. ఇప్పుడు వాటిని ఆమోదించుకోవాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉందంటూ కొత్త పల్లవి అందు కున్నారు. అలా ఆమోదం పొందక పోతే.. బీజేపీతో కలిసి వైసీపీ కుట్ర చేస్తోందని విమర్శిస్తున్నారు. నిజానికి రాజీనామాల ఆమోదం.. ఆమోదం కాకపోవడం అనేది ఎంపీల చేతుల్లో ఉండే విషయం కాదు. అది స్పీకర్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా బాబు చేస్తున్న విమర్శలు.. ఆయన నైతికతను తెరమీ దికి తెస్తున్నాయి. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకోవడం, వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం వంటివి చేసినప్పుడు బాబు నైతికత ఏనాడో.. బయటపడిందని అంటున్నారు. మొత్తంగా బాబు నుంచి ఇంతకన్నా ఎక్స్‌పెక్ట్ చేయలేమని అనడం వెనుక ఉద్దేశం ఇదేనా ? అనిపించకమానదు.