YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అశోక, యనమలకు గవర్నర్ పోస్టులు

అశోక, యనమలకు గవర్నర్ పోస్టులు

రాజమండ్రి, జూన్ 17,
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంత్రివర్గంలో రెండు పేర్లు తప్పనిసరి. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రి వర్గాల్లో వారికి తప్పకుండా చోటు దక్కాల్సిందే. కానీ మొదటిసారి ఆ ఇద్దరి పేర్లు లేవు. వారే సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు. వారి వారసులు అసెంబ్లీలో అడుగుపెట్టడంతో.. వారి సేవలను చంద్రబాబు ఎలా వినియోగించుకుంటారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే వారికి కీలకమైన గవర్నర్ పోస్టులు కేటాయిస్తారని ప్రచారం ప్రారంభం అయ్యింది. ఈ ఎన్నికల్లో విజయనగరం నుంచి అశోక్ కుమార్తె అదితి గజపతిరాజు పోటీ చేసి గెలిచారు. తుని నుంచి రామకృష్ణుడు కుమార్తె దివ్య పోటీ చేసి గెలుపొందారు.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ ఇద్దరు సీనియర్ నాయకులు కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. అశోక్ గజపతిరాజు 2014లో విజయనగరం ఎంపీగా గెలిచారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయనకు కీలకమైన పౌర విమానయాన శాఖ దక్కింది. ఆ ఒక్కసారి తప్పి.. అన్నిసార్లు అశోక్ చంద్రబాబు మంత్రివర్గంలో కొనసాగారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో సైతం ఆయనకు టాప్ ప్రయారిటీ ఇచ్చారు. యనమల రామకృష్ణుడు సైతం దాదాపు అన్ని క్యాబినెట్లలో చోటు దక్కింది. ఒక్కసారి మాత్రం శాసనసభ స్పీకర్ గా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీగా ఉండేవారు. అక్కడ నుంచి క్యాబినెట్ లోకి తీసుకున్నారు చంద్రబాబు. ఆర్థిక వ్యవహారాలు చూడడంలో రామకృష్ణుడు దిట్ట. ఇప్పుడు తాజా మంత్రివర్గంలో రామకృష్ణుడిని తీసుకోలేదు. ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ కు బాధ్యతలు అప్పగించారు.అయితే ఈ ఇద్దరి సేవలను చంద్రబాబు మరో విధంగా వినియోగించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్ డి ఏ లో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. రెండో అతిపెద్ద పార్టీ కూడా. అందుకే కేంద్రం సైతం టిడిపికి మంచి ప్రాధాన్యం ఇస్తుంది. ఇప్పటికే కేంద్ర క్యాబినెట్లో కీలకమైన పౌర విమానయాన శాఖను రామ్మోహన్ నాయుడుకు అప్పగించింది. పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రి పదవి పొందారు. ఇప్పుడు పలు రాష్ట్రాలకు గవర్నర్ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ఈ తరుణంలో అశోక్ గజపతిరాజుతో పాటు యనమల రామకృష్ణుడి పేర్లను గవర్నర్ పోస్టులకు పరిశీలిస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పేర్లు అడిగిందని.. చంద్రబాబు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే వరుస పదవులను దక్కించుకోవడంతో టీడీపీ మంచి దూకుడు మీద ఉంది.

Related Posts