YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ చార్జీలు

ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ చార్జీలు

హైదరాబాద్, జూన్ 17,
తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ చార్జీలను సవరించాలని నిర్ణయించింది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్‌ చార్జీలు అమలు చేయనుంది. రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే క్షేత్రస్థాయిలో విలువను అంచనా వేసేందుకు స్టాపులు–రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాచరణ స్రారనంభించింది. పాత విలువను సవరించి కొత్త విలువను అమలులోకి తెచ్చేందుకు ఉన్న పరిస్థితులపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. జూన్‌ 18న అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో ఈ శాఖ అధికారులు ప్రాథమిక సమావేశం నిర్వహించి కార్యక్రమం ప్రారంభిస్తారు.దశలవారీగా పరిశీలన పూర్తిచేసి జూలై 1న కొత్త రిజిస్ట్రేషన్‌ చార్జీలు ఖరారు చేస్తారు. మండల, జిల్లా స్థాయిలోని కమిటీల పరిశీలన అనంతరం ఆగస్టు నుంచి కొత్త మార్కెట్‌ విలువలు అమలు చేసేలా స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
మార్గదర్శకాలు జారీ..
గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల వారీగా మార్కెట్‌ విలువల సవరణ సందర్భంగా అనుసరించాల్సిన మార్గదర్శకాలను శనివారం స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే–లాయండ్‌ రికార్డ్స్, పురపాలక శాఖ నుంచి సహకారం తీసుకోవాలని సూచించారు.
గ్రామాల్లో కసరత్తు ఇలా..
జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ఉన్న గ్రామాలను గుర్తిస్తారు. అక్కడ వ్యవసాయేతర వినియోగానికి అనువైన ప్రాంతాలు, పరిశ్రమలు, సెజ్‌లు తదితర ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఆయా స్రాంతాల్లో బహిరంగ భూముల ధరలను లెక్కలోకి తీసుకుని మార్కెట్‌ విలువ నిర్ణయిస్తారు.భూముల ధరలు క్రమంగా పెరగడం లేదా తగ్గుతుండడాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తారు. జిల్లా రిజిస్ట్రార్లు, డీఐజీలు ఆ రీతులను గుర్తిస్తారు.వ్యవసాయ భూముల విషయంలో రెవెన్యూ, పంచాయతీ అధికారుల సూచనలు తీసుకుని బహిరంగ మార్కెట్‌ ధరలపై అంచనాకు వస్తారు.
పట్టణ ప్రాంతాల్లో ఇలా..
ఇక మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో స్థానిక ప్రాంతాలను అనుసరించి విలువను నిర్ధారిస్తారు. వాణిజ్య ప్రాంతాలు, ప్రధాన రహదారుల లాంటి ఏరియాల్లో ఆ ప్రాంతానికి అనుగుణంగా విలువను నిర్ణయిస్తారు. కాలనీలు, అంతర్గత రహదారుల ప్రాంతాలు, మౌలిక వసతులు–అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనూ పాత విలువతో పోల్చి అవసరమైతేనే సవరిస్తారు. పెంపు లేదా తగ్గింపు కూడా చేసే వీలు ఉంది. పురపాలక, నగరపాలక సంస్థల్లో కొత్తగా చేరిన గ్రామాల్లో స్థానిక విలువను బట్టి క్షేత్రస్థాయి ధరలను ప్రతిబింబించేలా సవరణ చేస్తారు. శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న ఆయా శాఖల నుంచి రావాల్సిన బకాయిలు సమీకరిస్తున్నారు. ఈ క్రమంలో భూముల విలువ పెంపుపైనా దృష్టి పెట్టారు. భూముల విలువ పెంచడం ద్వారా రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఖజానాకు వచ్చే ఆదాయంలో మద్యం మొదటి స్థానంలో ఉండగా, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం తర్వాతి స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలోనే భూముల విలువ పెంచాలని రేవంత్‌ సర్కార్‌ భావిస్తోంది. తద్వారా భారీగా ఖజానాకు నిధులు వస్తాయని అంచనా వేస్తోంది.భూముల విలువ పెంపు విషయంలోనూ రేవంత్‌రెడ్డి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏపీలో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి మూడు నాలుగుసార్లు భూముల విలువలు సవరించారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది కానీ, సామాన్యులకు ఎలాంటి లబ్ధి కలుగలేదు. దీంతోపాటు ల్యాడ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అమలు కూడా మొన్నటి ఎన్నికల్లో జగన్‌ ఓటమికి కారణమయ్యాయి.
విలువ ఉన్న ప్రాంతాల్లో పెంచాలి..
భూముల విలువ పెంపు అంటే .. డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లోనే పెంచాలి. డిమాండ్‌ లేని ప్రాంతాల్లో భూముల విలువ పెంచితే అది ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందుకు జగన్‌ చేసిన ప్రయోగమే నిదర్శనమంటున్నారు. జూన్‌ 15 లేదా 18న నిర్వహించే కేబినెట్‌ మీటింగ్‌లో భూముల విలువలు సవరించే అవకాశం ఉందని తెలుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
షెడ్యూల్‌ ఇదీ..
– జూన్‌ 18న రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, సర్వే అధికారులో సమావేశం.
– జూన్‌ 23న మార్కెట్‌ విలువల సవరణ పూర్తి.
– జూన్‌ 25న పునః సమీక్ష
– జూన్‌ 29న కమిటీ ఆమోదం.
– జూలై 1న వెబ్‌సైట్‌లో సవరించిన విలువల ప్రదర్శిన.
– జూలై 20 వరకు సలహాలు, సూచనలు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం.
– జూలై 31న శాఖ వెబ్‌సైట్‌లో కొత్త ధరల అప్‌డేషన్‌.
– ఆగస్టు 1 నుంచి సవరించిన ధరలు అమలు.

Related Posts