YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్...

జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్...
ఆకాశన్నంటున్న పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై గుస్సవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉపశమన చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. చమురు ధరలను తగ్గించే అవకాశాలపై యోచిస్తోంది. నాలుగు అవకాశాల గురించి ప్రధానంగా చర్చిస్తోంది. అందులో ఒకటి చమురును జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఎప్పటి నుంచో పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ అవకాశాన్నీ పరిశీలిస్తోంది కేంద్రం. జీఎస్టీ సహా నాలుగు రకాలుగా పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయించే విధానంపై సమగ్ర అధ్యయనం చేస్తోంది.  జనం, చమురు డీలర్ల సంఘం.. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే, కేంద్రం మాత్రం స్పందన కరువైంది. తాజాగా ఆ అవకాశాన్ని పరిశీలిస్తోంది. జీఎస్టీ పరిధిలోకి చమురు ఉత్పత్తులను తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇంకా ఎలాంటి సమ్మతి రాలేదని ఇటీవలే రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇటు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. చమురు సంస్థలు, ఇతర భాగస్వాములతో జీఎస్టీ సహా వివిధ అవకాశాలపై చర్చిస్తున్నారు. రాష్ట్రాలు అంగీకరిస్తే జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకూ సుముఖంగానే ఉంది కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ రాష్ట్రాలు ఒప్పుకొని కేంద్రం ఆ నిర్ణయాన్ని అమలు చేస్తే 50 శాతంగా ఉన్న పన్నులను 30 నుంచి 40 శాతానికి తగ్గించినా వినియోగదారుడికి కొంతలో కొంత మేలు కలుగుతుంది.
 ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో ధరలకు అనుగుణంగా రోజువారీ ధరల సమీక్షను చేపట్టింది. ఇప్పుడు అదే అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పన్ను సమీక్షను చేపట్టాలన్న ఆలోచనను కేంద్రం చేస్తోంది. అందుకు అనుగుణంగా ఓఎన్జీసీతో చర్చలు జరుపుతోంది. ఎందుకంటే దేశానికి అవసరమైన చమురులో 20 శాతం ఓఎన్జీసీనే సరఫరా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ధరలకు అనుగుణంగానే ఓఎన్జీసీ కూడా ధరలను నిర్ణయిస్తోంది. ఇప్పుడు అలా కాకుండా దేశీయంగానే ఉత్పత్తి అవుతోంది కాబట్టి.. ధరలను తగ్గించేలా ఓఎన్జీసీతో చర్చిస్తోంది. రిటైలర్లకు తక్కువ ధరలకే పెట్రోల్, డీజిల్‌ను విక్రయించాలని సూచిస్తోంది. ధరలను తగ్గిస్తే ఓఎన్జీసీ నుంచి కేంద్రానికి అందే డివిడెండ్‌నూ తగ్గించుకునేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు అందుబాటులో ఉన్న మరో అవకాశం.. వాటిని ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో పెట్టడం. ఇప్పటికే భారత కమోడిటీ ఎక్స్‌చేంజీ (ఐసీఈఎక్స్)కు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సూత్రప్రాయ అంగీకారాన్ని కూడా తెలిపారు. దీనిపై ఐసీఈఎక్స్ ఎండీ సంజిత్ ప్రసాద్ కూడా స్పందించారు. పెట్రోలియం శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా వచ్చిందన్నారు. అయితే, పెట్రోల్, డీజిల్‌ను ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లోకి తేవాలంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నుంచి అనుమతి రావాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా ఉత్పత్తులు, వస్తువులను ప్రస్తుత మార్కెట్ ధరకే భవిష్యత్తులో అమ్మేలా చూస్తారు. అదే ఫ్యూచర్ ట్రేడింగ్. ఉదాహరణకు ఓ వంద లీటర్ల పెట్రోల్‌ను ప్రస్తుత ధర ప్రకారం ఓ నెల తర్వాత అందించేలా ఒప్పందం కుదుర్చుకోవడం.  ప్రస్తుతం ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్ట్ కంట్రీస్ (ఒపెక్).. పాశ్చాత్య దేశాలకు ఓ రేట్, ఆసియా దేశాలకు ఓ రేట్‌కు చమురును సరఫరా చేస్తున్నాయి. భారత్ సహా ఆసియా దేశాలకు అధిక ధరలకు అమ్ముతోంది ఒపెక్. ఈ నేపథ్యంలోనే ఆసియా దేశాలను ఏకం చేసి ఆసియాకు కూడా ధరల్లో రాయితీ ప్రకటించేలా ఒపెక్‌ను ఒప్పించడం. కేంద్రం ఆ ప్రయత్నాన్నీ చేస్తోంది. 

Related Posts