నెల్లూరు, జూన్ 18,
ఆకలేస్తే అన్నం పెడతారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. పేదలు, కూలీలు, రిక్షా, ఆటో డ్రైవర్లకు కడుపు నింపే శుభవార్త చెప్పింది. పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు సిద్ధం అవుతున్నాయి. గత 5 సంవత్సరాలుగా వైఎస్ జగన్ పాలనలో మూతపడ్డ అన్న కాంటీన్లను పునఃప్రారంభించబోతోంది చంద్రబాబు సర్కార్. గతంలో 5 రూపాయలకే కడుపు నిండా భోజనం చేసిన పేద ప్రజలకు, మళ్లీ అవే రోజులు తిరిగి రాబోతున్నాయి. పేదల ఇబ్బందులు మరో మూడు వారాల్లో తీరబోతున్నాయి. అయితే చంద్రబాబు 4.0లో పేద, మధ్య తరగతి ప్రజలకు సరికొత్తగా అన్న క్యాంటీన్లను అందుబాటులో తేనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.పేద వాడికి పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను 2014-19 మధ్య చంద్రబాబు సర్కార్ ఏర్పాటుచేసింది. వివిధ పనుల కోసం పట్టణాలకు వచ్చే పేదల ఆకలి తీర్చేందుకు వీలుగా, కేవలం రూ.5కే భోజనం పెట్టే విధంగా అన్నా క్యాంటీన్లకు రూపకల్పన చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని మూసి వేసింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం, అన్నా క్యాంటీన్లు మళ్లీ తెరవాలని నిర్ణయించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.చంద్రబాబు ఆదేశాలతో అన్నా క్యాంటీన్ల పనులు వేగవంతం అయ్యాయి. అన్న క్యాంటీన్ల రీ ఓపెన్‌పై వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆదివారం ఉదయం మున్సిపల్ శాఖ అధికారులతో మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు. మూడు వారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లని ప్రారంభించేలా కార్యాచరణ సిద్ధం చేయాలంటూ అధికారులను మంత్రి ఆదేశించారు. క్యాంటీన్ల నిర్వహణ మళ్లీ ఇస్కాన్‌కే ఇవ్వాలా లేక టెండర్లు పిలవాలా అనే దానిపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో ఇస్కాన్ సెంట్రలైజ్డ్ కిచెన్స్ కూడా ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లాయని విమర్శించారు. పేదలు, రోజువారీ కూలీల ఆకలి తీర్చడమే అన్న క్యాంటీన్ల లక్ష్యం అన్నారు మంత్రి. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లని వేరే అవసరాలకు వినియోగించుకుందన్నారు. కండిషన్లో లేని నాటి అన్న క్యాంటీన్ల భవనాలను రెనోవేట్ చేయాలని ఆదేశించామన్నారు.అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. సెప్టెంబరు 21లోగా 203 క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. అయితే ముందుగా మూడు వారాల్లోనే 100 క్యాంటీన్లను ఓపెన్ చేయనున్నారు. మున్సిపల్, కార్పొరేషన్ల కమిషనర్లతో పాటు ప్రజారోగ్య, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను, ఈ ప్రాజెక్టులో భాగస్వాములను చేశారు. గతంలో ప్రారంభించిన క్యాంటీన్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి.. వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. గతంలో మంజూరుచేసిన 203 క్యాంటీన్ భవనాల్లో 184 వరకు అప్పట్లో పూర్తయ్యాయి. పాత డిజైన్ మేరకు మిగిలిన వాటి నిర్మాణ పనులకు టెండర్లు పిలవాలని ప్రభుత్వం సూచించింది. దీనితో అధికారులు చర్యలు చేపట్టారు.అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం కానుండడంతో విజయవాడ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఐదేళ్ల కిందటి వరకూ 18 అన్న క్యాంటీన్లు ఉండేవి. కేవలం రూ. 5 చెల్లిస్తే చాలు కడుపు నిండా ఆహారం దొరికేది. మూడు పూటలకు కలిపి రూ. 15తో భోజనం చేసేవారు. ఈ క్యాంటీన్లను గత సర్కార్ కక్షపూరితంగా మూసేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇన్నాళ్లకు మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో అన్న క్యాంటీన్లు తెరుచుకోబోతున్నాయి. అన్నా క్యాంటీన్ల రీ ఓపెనింగ్ పైనే చంద్రబాబు నాలుగోవ సంతకం చేశారు. విజయవాడ నగరంలో 11 ప్రాంతాల్లో, గుడివాడలో రెండు, జగ్గయ్యపేట, నందిగామ, నూజివీడు, ఉయ్యూరు, మచిలీపట్నంలో ఒక్కోటి చొప్పున అన్న క్యాంటీన్లు క్యాంటీన్ ఉండేవి. నిత్యం వేలాదిమంది ఆకలి తీర్చేవి. ప్రస్తుతం వీటితో పాటు కొత్తగా మరికొన్నింటిని ప్రారంభించనున్నారు.ఇక విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో… అన్న క్యాంటీన్ల ప్రదేశంలో పది రకాల వంటకాలతో ఉచిత భోజనం పెడుతున్నారు. దీనికి పేద ప్రజలు పెద్దఎత్తున క్యూ కడుతున్నారు. ఎన్నికల హామీకి అనుగుణంగా అన్న క్యాంటీన్లను ఓపెన్ చేస్తున్నామని ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయని, పాత పద్ధతిలోనే మూడు పూటలా ప్రజలకు ఆహారం అందిస్తామన్నారు.అప్పట్లో ఇస్కాన్‌కు ప్రభుత్వం ఒక్కో ప్లేటుకు మూడు పూటలకు కలిపి 58 రూపాయలు చెల్లించేది. 2014-19 మధ్యలో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 2.25లక్షలమంది అన్న క్యాంటీన్ల పైనే ఆధారపడేవాళ్లు. ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి, పేదలకు పట్టెడన్నం పెట్టేందుకు చంద్రబాబు సర్కార్ చకచకా ఏర్పాట్లు చేస్తోంది.