తిరుపతి, జూన్ 19,
మార్కెట్‌లో టమాటా రేట్లు భగ్గుమంటున్నాయి. టచ్ చేసి చూడు అంటూ టమాటా సవాల్ విసురుతోంది. టమాటా రేట్లకు మళ్లీ రెక్కలు వచ్చాయి. జనాలకు తినాలనే కోరిక ఉన్నా..టమాటాను కొనాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. స్టాక్ మార్కెట్‌ను మించి, బంగారం రేట్లను మించి వేరియేషన్స్ చూపిస్తోంది టమాటా. రెండు వారాల క్రితం కిలో 25 రూపాయలు ఉన్నా టమాటా, ఇప్పుడు ఏకంగా వంద రూపాయలకు చేరుకుంది. మార్కెట్‌లో సరిపడినంత స్టాక్ లేకపోవడంతో దేశవ్యాప్తంగా పలు చోట్ల టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మదనపల్లె హోల్‌సేల్ మార్కెట్‌లో 80 రూపాయలకు చేరిన కిలో టమాటా రేట్.. సెంచరీ దిశగా దూసుకెళ్తోంది. ఇక రిటైల్‌గా టమాటా ఆల్రెడీ సెంచరీ కొట్టేసింది. నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతున్నప్పటికీ, వాటిని మించిన వేగంతో టమాటా దూసుకుపోతోంది. వేసవి కాలంలో కాస్తంత ఫర్వాలేదనిపించినప్పటికీ వర్షాకాలం వచ్చేసరికి మాత్రం కూరగాయల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రెండు నెలల క్రితమే సరైన ధర లేదంటూ రైతులంతా టమాటాలను రోడ్డు మీద పారపోశారు. అయితే ప్రస్తుతం అదే టమాటా 100కు చేరువలో ఉంది.టమాటా రేట్లు ఆకాశానికి దూసుకుపోతుండడంతో, దాంతో కర్రీ చేయాలంటే వర్రీ తప్పట్లేదు. టమాటా @ 100 కావడంతో కిచెన్‌లో కల్లోలం మొదలైంది. గత వారం రోజులుగా మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధర అత్యల్పంగా కిలో 41 రూపాయల నుంచి అత్యధికంగా 64 రూపాయల మధ్య ఉంది. ఇప్పుడు మాత్రం A గ్రేడ్ టమాటాలు కిలో 69 నుంచి 80 రూపాయల వరకు పలుకుతోంది. ఇక B గ్రేడ్ వెరైటీ రేటు 50 నుంచి 68 రూపాయల వరకు పలుకుతోంది. దిగుబడి తగ్గడం, వర్షాలకు సాగు దెబ్బ తినడంతో మేలు రకం టమాటాలకు డిమాండ్ పెరిగి రేట్లు కూడా పెరిగాయి. ఈ సీజన్ లో మదనపల్లి టమోటా మార్కెట్ కు సగటున దాదాపు 800 మెట్రిక్ టన్నుల టమోటా రావాల్సి ఉండగా, ఆ దిగుబడి సగానికి పడిపోయింది. రైతుల నుంచి 25 కిలోల టమాటా బుట్టను 1600 నుంచి 1900 రూపాయలకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.ఇక ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్ల పరిధిలో కూడా సరుకు తగ్గడంతో పాటు, దేశవ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురుస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో టమాటా దిగుబడి తగ్గింది. దీంతో నాణ్యమైన సరుకు మార్కెట్‌కు రావడం లేదు. ఈ పరిస్థితులు ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతున్నాయి. అందుకే మదనపల్లె మార్కెట్‌కు డిమాండ్ పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. మదనపల్లె మార్కెట్‌కు డైలీ 600 టన్నుల నుంచి 750 టన్నుల మేరకు సరుకును రైతులు తీసుకొస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఎగుమతికి అవసరమైన దాని కంటే తక్కువగా సరుకు వస్తోంది. మదనపల్లె చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామాల నుంచి కేవలం 396 టన్నులు టమాటాలు మాత్రమే మార్కెట్‌కి వస్తోంది. దీంతో హోల్‌సేల్ మార్కెట్‌లోనే కిలో ధర 80 రూపాయలకి చేరుకుంది.ఇక టమాటాలతో పాటు ఇతర కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. కర్నూలు రైతు బజార్‌లో కిలో ఉల్లి 34 నుంచి 40 రూపాయలు పలుకుతోంది. ఇక టమాటా, పచ్చి మిర్చి రేట్లు కూడా మండిపోతున్నాయి. కిలో పచ్చిమిర్చి కిలో 70 నుంచి 84 రూపాయలు రేటు పలుకుతోంది. ఇప్పుడు పూర్తిగా అన్ సీజన్ కావడంతో కర్నూలు మార్కెట్‌కి ఉల్లి సరఫరా నిలిచిపోయింది. దీంతో మహారాష్ట్ర నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నారు వ్యాపారులుభారీగా పెరుగుతున్న టమాటా ధరలపై దృష్టి పెట్టింది ఏపీ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ. ధరల స్థిరీకరణకు చర్యలు చేపట్టింది. చిత్తూరు జిల్లా నుంచి టమాటాలు కొని రైతు బజార్లలో విక్రయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పది రోజుల్లో 30 టన్నుల టమాటాలు కొని, వాటిని కృష్ణా, గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల మార్కెట్లకు పంపిణీ చేయనున్నారు. ఈ ప్రక్రియ కోసం ప్రతి జిల్లా అధికారి చేతిలో ఐదు లక్షల రూపాయల రివాల్వింగ్ ఫండ్ ఉంచనున్నారు. ఇక కూరగాయల రేట్లు పెరగడానికి వీల్లేదన్నారు ఏపీ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు. అవసరమైతే బయట నుండి తెప్పించి రైతు బజార్లలో అందుబాటులో ఉంచి, ప్రజలకు తక్కువ ధరకే అందిస్తామన్నారు మంత్రి.టమాటా రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. అదే ఇప్పుడు వినియోగదారుల గుండెల్లో గుబులు రేపుతోంది. టమాటా పరుగులకు ఫుల్ స్టాప్ పడుతుందో…లేక బంగారం రేటులా ఎర్ర బంగారం రేట్లు కూడా ఇంకా పరుగులు తీస్తాయో చూడాలి.