విజయవాడ, జూన్ 19,
ఎన్నికల్లో టిడిపి కూటమి విజయం సాధించింది. వైసీపీకి దారుణ పరాజయం ఎదురైంది. ఎన్నికల రోజు, తరువాత రాష్ట్రవ్యాప్తంగా హింస చెలరేగింది. అయితే కేంద్ర బలగాలు ప్రవేశించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానీ విజయవాడలో మాత్రం పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. వైసీపీలో వివాదాస్పద నాయకులుగా ముద్రపడిన కొడాలి నాని, వల్లభనేని వంశీలు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ దుమారం రేపుతున్నాయి. వారి వల్ల వైసీపీ శ్రేణులు మూల్యం చెల్లించుకుంటున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇద్దరు నేతలను టిడిపి టార్గెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరు నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కానీ వారి అనుచరులు ఇప్పుడు టార్గెట్ అవుతున్నారు.ఏపీలో టీడీపీ కూటమి గెలిచిన తర్వాత చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేశారు. హింసాత్మక ఘటనలు వద్దని కూడా కోరారు. కానీ టిడిపి శ్రేణులు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అధినేత ఆదేశాలను పట్టించుకోవడం లేదు. దీంతో రాజకీయ అలజడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విజయవాడలో అటువంటి గట్టనే ఒకటి వెలుగు చూసింది. విజయవాడ సింగ్ నగర్ ఏరియాలో ఒక్కప్పటి టిడిపి కార్పొరేటర్, ప్రస్తుత వైసిపి నాయకుడు నందీపు జగదీష్ కు సంబంధించి ఇంటిని ఆదివారం మున్సిపల్ అధికారులు కూల్ చేశారు. యంత్రాలతో వ్యాపార సముదాయాన్ని నేలమట్టం చేశారు. దీంతో ఇక్కడ రాజకీయ వాతావరణం కాక రేపుతోంది. అయితే ఈ ఘటన వెనుక టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఉన్నాడని జగదీష్ ఆరోపిస్తున్నారు. గత పది సంవత్సరాలుగా బెజవాడ ప్రశాంతంగా ఉంది. ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగలేదు. వైసిపి ప్రభుత్వ హయాంలో సైతం చెదురుమదురు ఘటనలే తప్ప.. ఎన్నడు హింస చెలరేగలేదు. కానీ ఇప్పుడు ఏకంగా ఓ మాజీ కార్పొరేటర్ ఇంటిని తొలగించడం రాజకీయ కక్షపూరిత చర్యగా స్థానికులు చెబుతున్నారు. ఒక్కసారిగా తన ఇంటిని కూల్చేయడంతో జగదీష్ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రకాష్ నగర్ లోని తన ఇంటి ముందే కూర్చుని శిరోమండలం చేయించుకుని నిరసన తెలిపారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు కూడా పక్కనే ఉన్నారు. జగదీష్ తన భార్యను కూడా శిరోముండనం చేయించేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తమపై కక్ష కట్టారని.. ఈరోజు టిడిపి ది అని.. రేపు వైసిపిదని.. కానీ రాజకీయ కక్షపూరిత చర్యలకు దిగడం మంచిది కాదని జగదీష్ స్పష్టం చేశారు. అయితే ఈ ఘటనతో బెజవాడలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. మున్ముందు ఎటువంటి ఘటనలు జరుగుతాయోనన్న భయంలో నగరవాసులు ఉన్నారు.