YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై గురి..

హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై గురి..

ఛండీఘడ్, జూన్ 19,
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ  దృష్టి సారించింది. ఆ రాష్ట్రాల్లో పార్టీ స్థితిగతులు, లోటుపాట్లపై ఆత్మపరిశీలన చేస్తోంది. తమకు ఎదురేలేదు అనుకున్న హిందీ హార్ట్‌ల్యాండ్‌లోనే కమలదళానికి ఎదురుదెబ్బలు తగిలాయి. ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో ఆశించిన ఫలితాలు సాధించలేక బీజేపీ చతికిలపడింది. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు హర్యానాలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నుంచే లోపాలు, పొరపాట్లు గుర్తించి సరిదిద్దకపోతే.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. అందుకే కమలదళం పెద్దలు ఆయా రాష్ట్రాల్లో స్థితిగతులపై అధ్యయనం, మేధోమధనం ప్రారంభించారు. మొత్తం 10 లోక్‌‌సభ స్థానాలున్న హర్యానా రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెరో 5 సీట్లు గెలుపొందాయి. 2019లో సాధించిన సంఖ్యతో పోల్చితే ఈ రాష్ట్రంలో బీజేపీ బలం సగానికి సగం తగ్గిపోయింది. అప్పుడు ఏకంగా 58.02% ఓట్లతో రాష్ట్రంలోని అన్ని స్థానాలను బీజేపీ క్లీన్ స్వీప్ చేయగా, కాంగ్రెస్ పార్టీ కేవలం 28.42% ఓట్లతో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కానీ ఈసారి బీజేపీ 46.11% ఓట్లు, కాంగ్రెస్ 43.67% ఓట్లు సాధించి చెరో 5 స్థానాలు గెలుపొందాయి. గణాంకాలను పరిశీలిస్తే కాంగ్రెస్ ఏకంగా 15.25% మేర తమ బలాన్ని పెంచుకోగలిగింది. ఇదే సమయంలో బీజేపీ 11.91% ఓట్లను కోల్పోయింది. ఇది కమలనాథులను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తున్న అంశం.హర్యానాలో బీజేపీ పనితీరుపై కోర్ గ్రూప్ సమావేశం జరిగింది. ఆ పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కొత్తగా ఎన్నికల ఇన్‌ఛార్జి, కో-ఇన్‌ఛార్జులుగా నియమితులైన ధర్మేంద్ర ప్రధాన్, బిప్లవ్ కుమార్ దేవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. హర్యానా బీజేపీ కోర్ గ్రూప్ నేతలైన హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి), కృష్ణపాల్ గుర్జార్, కెప్టెన్ అభిమన్యు, సుధా యాదవ్, హర్యానా ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ఫణీంద్రనాథ్ శర్మ, సంజయ్ భాటియా, ఆర్గనైజేషన్ ఇన్‌ఛార్జ్ సతీష్ పునియా, కో-ఇన్‌చార్జ్ సురేంద్ర నాగర్ తదితరులు ఈ కీలక భేటీలో పాల్గొని లోటుపాట్లపై లోతుగా చర్చించారు. ముఖ్యంగా అంబాలా, సోనిపథ్ వంటి స్థానాల్లో ఓటమి వారిని కలవరపెట్టింది. అంబాలా బీజేపీకి వరుసగా విజయాలు అందిస్తున్న స్థానం. ఇంకా చెప్పాలంటే రాష్ట్రం మొత్తమ్మీద సురక్షితమైన స్థానంగా బీజేపీ నేతలు భావిస్తారు. అలాంటి చోట ఓటమికి దారితీసిన పరిస్థితులేంటి అన్నదే అగ్రనాయకత్వాన్ని వేధిస్తున్న ప్రశ్న. సుదీర్ఘ చర్చ అనంతరం రాష్ట్రంలోని జాట్ సామాజికవర్గం ఓటర్లలో నెలకొన్న ఆగ్రహం, దళితుల్లో నెలకొన్న అసంతృప్తి పార్టీ విజయావకాశాలను దెబ్బతీశాయని అంచనాకు వచ్చారు. జాట్ల ఆగ్రహానికి కారణాలను అన్వేషించి, వారిని ఆకర్షించేందుకు బీజేపీ త్వరలో విస్తృత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాలని చూస్తోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్రానికి తదుపరి పార్టీ అధ్యక్షుడిగా జాట్ నేతనే ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తం పరిస్థితులను ఆకళింపు చేసుకోడానికి హర్యానా రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జిగా నియమితులైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూన్ 22, 23 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు.బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తారు అంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం ప్రభావంతో దళితులు కొంత దూరమయ్యారని కమలనాథులు గ్రహించారు. యూపీ, రాజస్థాన్, మహారాష్ట్ర సహా దేశవ్యాప్తంగా రిజర్వుడు స్థానాల్లో ఈసారి బీజేపీ దెబ్బతినడానికి ఈ అంశమే ప్రధాన కారణమని భావిస్తున్నారు. హర్యానాలో దళితులు దూరమవడంలో ఈ-గవర్నెన్స్ కూడా ఒక కారణమని తేలింది. ఆన్‌లైన్ విధానం, యాప్‌ల వాడకం గురించి అంతగా తెలియని వర్గాలు సైతం ఏదైనా ప్రభుత్వ పథకాన్ని పొందాలంటే తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా మాత్రమే సమర్పించాల్సి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో, వెనుకబడిన వర్గాల్లో ఈ చర్య అసంతృప్తికి కారణమైందని కొందరు విశ్లేషిస్తున్నారు. దీన్ని సరిదిద్దేందుకు ఇక నుంచి ఆన్‌లైన్‌తో పాటు పేపర్ మీద దరఖాస్తులు నింపి అందజేసే ప్రక్రియను పునరుద్ధరించాలని నిర్ణయించారు. మొత్తంగా పార్టీకి దూరమైన 12% ఓటర్లను మళ్లీ తిరిగి తమ వద్దకు తెచ్చుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ రాష్ట్రంలో అక్టోబరు నెలలో హర్యానాలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఈ రాష్ట్రానికి పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్‌ను కో-ఇన్‌చార్జ్‌గా నియమించింది. ఇద్దరికీ లోటుపాట్లను గుర్తించి సరిదిద్దే కీలకమైన బాధ్యతలు అప్పగించింది.

Related Posts