YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రకాశం పొలిటికల్ స్క్రీన్

ప్రకాశం పొలిటికల్ స్క్రీన్
దక్షిణాంధ్రలో కీలకమైన ప్రకాశం జిల్లాలో ప్రధాన పార్టీల్లో రాజకీయ సమీకరణలు ఇంకా కొలిక్కి రాలేదు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలిగిన వ్యక్తులు, కుటుంబాలు రాజకీయంగా ఏ వైఖరి తీసుకుంటాయో స్పష్టత రాకపోవడంతో అభ్యర్ధుల ఎంపికలో కొంత ఉత్కంఠ నెలకొంది. రెండు ప్రధాన పార్టీల్లో అలకలు, అసంతృప్తులు తమ వంతు ప్రభావం చూపుతున్నాయి. ఒంగోలు లోక్‌సభ స్థానానికి మళ్లీ పాత ప్రత్యర్థులే బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ సిటింగ్‌ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇక్కడ తిరిగి పోటీ చేయనున్నారు.
కానీ ఆయనకు జిల్లాలో పార్టీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డితో తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. వారి మధ్య కనీసం మాటలు కూడా లేవు. టీడీపీ నుంచి మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తిరిగి పోటీ చేయనున్నారు. ఆయన అసంతృప్తితో ఉన్నారని తెలిసి పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవల ఆయన్ను పిలిపించి మాట్లాడారు. ఒంగోలు అసెంబ్లీ స్థానంలో టీడీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ తిరిగి పోటీ చేయనున్నారు. కొందరు సొంత పార్టీ నేతలతో ఆయనకు విభేదాలున్నా టికెట్‌ విషయంలో ఇబ్బంది లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనపై వైసీపీ నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ చేయనున్నారు. ఆయన జిల్లాలో పశ్చిమ ప్రాంతానికి మారే అవకాశం ఉందని కొంత కాలం క్రితం ప్రచారం జరిగినా ఆయన ఒంగోలులోనే పోటీ చేస్తారని తాజాగా చెబుతున్నారు.
పరుచూరు స్థానంలో కొంత ఉత్కంఠ ఉంది. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తిరిగి పోటీ చేయనున్నారు. సీనియర్‌ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి, ఎన్టీఆర్‌ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి ఇదే నియోజకవర్గానికి చెందినవారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న వీరు తమ పార్టీలోకి వస్తే కోరుకున్న లోక్‌సభ స్థానం, పరుచూరు అసెంబ్లీ సీటు ఇస్తామని వైసీపీ నాయకత్వం కొంత కాలం క్రితం రాయబారాలు నడిపింది.
ఆ సమయానికి టీడీపీకి... బీజేపీకి మధ్య మైత్రి ఉండడంతో దగ్గుబాటి కుటుంబం ప్రతిస్పందించలేదు. తర్వాత రెండు పార్టీలు తెగతెంపులు చేసుకున్న నేపథ్యంలో దగ్గుబాటి కుటుంబం రాజకీయ వైఖరి ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. తన కుమారుడిని వచ్చే ఎన్నికల్లో పరుచూరు నుంచి నిలపాలని దగ్గుబాటి ఆసక్తితో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గానికి వైసీపీ నుంచి మొదట గొట్టిపాటి భరత్‌ ఇన్‌చార్జిగా ఉన్నారు. తర్వాత ఆయన్ను తప్పించి అడుసుమిల్లి రాంబాబును నియమించారు. ఈ సీట్లో చివరకు ఆ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది ఇప్పటికైతే అస్పష్టంగా ఉంది. చీరాలలో టీడీపీ తరపున సిటింగ్‌ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ తిరిగి పోటీ చేయనున్నారు. 2014లో నవోదయం పార్టీ తరపున గెలిచిన ఆయన.. తర్వాత కొన్నాళ్లకే టీడీపీలోకి వచ్చారు. ఇక్కడ వైసీపీ ఇన్‌చార్జిగా బాలాజీ ఉన్నారు. ఇంకా మంచి అభ్యర్థి కోసం ఆ పార్టీ అన్వేషిస్తోంది. టీడీపీ నుంచి ఎవరైనా వస్తారేమోనని చూస్తున్నారు. కనిగిరిలో రాజకీయ పరిస్థితి ఆసక్తికరంగా ఉంది. టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు మళ్లీ పోటీ చేయడానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.
కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి నియోజకవర్గంలో క్రియాశీలంగా ఉన్నారు. ఆయన్ను టీడీపీలోకి తీసుకొచ్చి నిలపాలని కొందరు నేతలు ఆశిస్తున్నా రు. జడ్పీ మాజీ చైర్మన్‌ ముక్కు కాశిరెడ్డి గతంలో వైసీపీలో ఉన్నా కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన్ను కూడా టీడీపీలోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైసీపీ నుంచి ఇక్కడ బుర్రా మధుసూధన్‌ యాదవ్‌ పోటీ చేస్తారని అంటున్నారు. ఆయనపై ఆ పార్టీ నేతలు కొందరు అసంతృప్తితో ఉన్నా టికెట్‌ ఆయనకే ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. కందుకూరులో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే పోతుల రామారావు ఈసారి టీడీపీ తరపునే పోటీ చేయనున్నారు. మాజీ ఎమ్మెల్యే దివి శివరాంను సంతృప్తిపరిచేందుకు ఆయనకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పదవి కట్టబెట్టారు. ఇక్కడ వైసీపీ ఇన్‌చార్జిగా తూమాటి మాధవరావు ఉన్నారు. ఆయన్ను మార్చి మరొకరిని తేవాలని కొందరు సీనియర్‌ నేతలు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ కు చెందిన మాజీ మంత్రి మహీధర్‌రెడ్డి ఈసారి ఎలాగైనా బరిలోకి దిగాలన్న ప్రయత్నంలో ఉన్నారు.
ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీల్లో ఏదో పార్టీ తరపున పోటీ చేయాలని... లేని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగానైనా రంగంలోకి దిగాలని ఆయన దృఢంగా భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఆయనపై కొంత ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. దర్శి నియోజకవర్గంలో ఆటవీ మంత్రి శిద్థా రాఘవరావు తిరిగి పోటీ చేయనున్నారు. వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఈసారి తాను పోటీ చేయనని ప్రకటించడంతో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌.. బాదం మాధవరెడ్డిని ఇన్‌చార్జిగా ప్రకటించారు. కానీ మాధవరెడ్డితో బూచేపల్లికి సత్సంబంధాల్లేవు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మార్కాపురంలో వైసీపీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి తిరిగి పోటీ చేయనున్నారు.
ఇక్కడ టీడీపీ ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కొంత పట్టున్న మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, ఆయన వియ్యంకుడు ఉడుముల శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ అభ్యర్థిత్వాన్ని ప్రభావితం చేయగలరని ప్రచారం జరుగుతోంది. వారు టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గిద్దలూరులో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చిన సిటింగ్‌ ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డి టీడీపీ నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే టీడీపీలో అనాదిగా కొనసాగుతున్న కార్యకర్తలను ఆయన ఎంతవరకు కలుపుకొని వెళ్లగలరా అని పార్టీ అధినాయకత్వం తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. ఇక్కడ వైసీపీ టికెట్‌ కోసం పోటీ నెలకొంది. నియోజకవర్గ ఇన్‌చార్జి ఐవీ రెడ్డి పోటీ చేస్తారని ఆ పా ర్టీ వర్గాలు అంటున్నాయి. ఆయనకు మాజీ ఎమ్మెల్యే సాయికల్పనారెడ్డి, మరో నేత రమణారెడ్డి నుంచి పోటీ ఎదురవుతోంది. మాజీ ఎమ్మెల్యే అన్నే రాంబాబు కూడా వైసీపీ టికెట్‌పై ఆసక్తితో ఉన్నారు. కుదరకపోతే జనసేనతో రంగంలోకి వచ్చే అవకాశం ఉంది.
యర్రగొండపాలెం (ఎస్సీ)నియోజకవర్గంలో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చిన సిటింగ్‌ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజుకు టీడీపీ అభ్యర్థిత్వంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆయన ఈసారి సంతనూతలపాడు(ఎస్సీ)కు మారే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన ఇటు వస్తే గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన అజితారావే అక్కడ మళ్లీ అభ్యర్థి అవుతారని అంటున్నారు. పార్టీ సీనియర్‌ నేత డాక్టర్‌ మన్నే రవీంద్ర అభిప్రాయానికి పార్టీ నాయకత్వం ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. వైసీపీ నుంచి కూడా ఈసారి మార్పు ఉంటుందని అంటున్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్‌ ఈసారి యర్రగొండపాలెం నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన కూడా కొంతకాలంగా ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టి తిరుగుతున్నారు. సంతనూతలపాడు టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న విజయ్‌కుమార్‌కు పార్టీలో మొదటి నుంచీ ఉన్న నేతలతో సఖ్యత లేదు. అభ్యర్థిని మార్చే అవకాశం ఉందన్న అంచనాతో టికెట్‌ కోసం పోటీ పెరిగింది. లిడ్‌క్యాప్‌ చైర్మన్‌ ఎరిక్సన్‌బాబుతోపాటు ఇద్దరు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్‌ యర్రగొండపాలెంకు మారడం ఖాయం కావడంతో గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్‌బాబును వైసీపీ ఈ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించారు. కొండపి (ఎస్సీ) నుంచి టీడీపీ సిటింగ్‌ ఎమ్మెల్యే డీఎస్‌ బాలవీరాంజనేయస్వామి తిరిగి పోటీ చేయనున్నారు. ఇక్కడ టీడీపీలో కొంత అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఇక్కడ టికెట్‌ కోసం ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకరరావు కూడా ప్రయత్నిస్తున్నారు. వైసీపీలో కూడా ఇవే పరిస్థితులు ఉన్నాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతుండగా.. ఆయన్ను మార్చాలని ఒక వర్గం గట్టిగా పట్టుపడుతోంది. కీలకమైన అద్దంకిలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఈ దఫా టీడీపీ తరపునే బరిలోకి దిగనున్నారు. ఈ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేత కరణం బలరాంను రాజకీయంగా సర్దుబాటు చేసే నిమిత్తం టీడీపీ అధినాయకత్వం ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చింది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆయన కుమారుడు వెంకటేశ్‌కు సీటు ఇస్తామని నాయకత్వం హామీ ఇచ్చింది. కానీ పునర్విభజన జరగలేదు. మరెక్కడైనా వెంకటేశ్‌కు అవకాశం ఇవ్వాలని బలరాం కోరుతున్నారు.
ఇంకోవైపు.. బలరాం తమ పార్టీలోకి వస్తే అద్దంకి లేదా చీరాల సీటు ఇస్తామని వైసీపీ నాయకత్వం ఆయనకు వర్తమానాలు పంపింది. ఈ రాయబారాలకు ఆయన స్పందించలేదు. టీడీపీ కార్యక్రమాల్లో యథాప్రకారం చురుగ్గా పాల్గొంటున్నారు. ఎన్నికల నాటికి జిల్లాలో అనేక కొత్త సమీకరణలు చోటు చేసుకోవచ్చని.. ఆ సందర్భంగా ఏదో ఒక నియోజకవర్గంలో బలరాంను సర్దుబాటు చేసే అవకాశం లేకపోలేదని కొందరు పార్టీ నేతలు అంటున్నారు. అద్దంకిలో వైసీపీ తరపున బాచిన చెంచుగరటయ్య లేదా ఆయన కుమారుడు చైతన్య పోటీ చేయవచ్చని అంటున్నారు. ఇంకా మెరుగైన అభ్యర్థి కోసం ఆ పార్టీ నాయకత్వం అన్వేషిస్తున్నట్లు సమాచారం.

Related Posts