YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వైద్యానికి ఇబ్బందులే..

 వైద్యానికి ఇబ్బందులే..
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల విస్తరణకు ఆటంకాలు తొలగడం లేదు.. భవన నిర్మాణాలు పూర్తయినా ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. కొత్తగా మూడు ఆసుపత్రులను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.78.15 లక్షల నిధులను విడుదల చేసింది. 13 ఆర్థిక సంఘం కింద నిధులు మంజూరు కాగా చొప్పదండి మండలం గుమ్లాపూర్‌లో, కరీంనగర్‌ మండలం చామనపల్లిలో దాదాపు రూ.50 లక్షలు ఖర్చు చేసి భవనాలను నిర్మించారు. మూడేళ్ల కిందటే పూర్తయినా ప్రారంభించడం లేదు. కరీంనగర్‌ మండలం ఆసిఫ్‌నగర్‌కు కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోసం నిధులు మంజూరైనా స్థల సేకరణ ఖరారుకాకపోవడంతో ఆ నిధులు ప్రభుత్వ ఖాతాలోనే మూలుగుతున్నాయి. 
జిల్లాలో కొత్తగా మంజూరై భవనాలు ఉన్న గుమ్లాపూర్‌, చామన్‌పల్లి, ఆసిఫ్‌నగర్‌ ఆరోగ్య కేంద్రాలకు ప్రభుత్వం వైద్యులను నియమించింది. కానీ పారా మెడికల్‌ సిబ్బందిని మాత్రం నియమించలేదు. ఆసుపత్రిలో వినియోగించే వైద్య పరికరాలు, యంత్రాలను కూడా అందుబాటులో ఉంచారు. కేవలం వైద్య సిబ్బంది లేరనే నెపంతో ఈ ఆసుపత్రులను ప్రారంభించడం లేదు. నియామకమైన వైద్యులను ఇతర ఆసుపత్రుల్లో వినియోగించుకుంటున్నారు. ఇప్పటికైనా సిబ్బందిని నియమించి వెంటనే ఈ ఆస్పత్రులను ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఈ విషయం గతంలో వైద్య ఆర్యోగ్య శాఖ మంత్రి దృష్టికి వెళ్లింది. అయినా స్పందన రాలేదు.
కరీంనగర్‌లో ప్రస్తుతం మూడు పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉండగా మరో మూడు ఆరోగ్య కేంద్రాలను సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోనూ పూర్తి సౌకర్యాలు కల్పించి ప్రసవాలు జరిగేలా చూడాలని నిర్ణయించింది.. కానీ అరకొర సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి. నగరంలో బుట్టిరాజరాం కాలనీలో మాత్రమే సొంత భవన ఉంది. మోతాజ్‌ ఖానా, కట్టరాంపూర్‌, ఆసుపత్రులకు సొంత భవనాలు నిర్మించి సౌకర్యాలు విస్తరించాలి. సోమవారం విద్యానగర్‌, సప్తగిరి కాలనీ, హౌజింగ్‌బోర్డు కాలనీల్లో మరో మూడు పట్టణ ఆరోగ్య కేంద్రాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించనున్నారు. హౌజింగ్‌బోర్డు కాలనీ, సప్తగిరి కాలనీల్లో భవనాల కోసం స్థల సేకరణ చేశారు. కొత్త ఆసుపత్రులకు భవనాలు నిర్మించాల్సి ఉంది.
జిల్లాలో మొత్తం 16 ఆసుపత్రులు ఉండగా అందులో 6 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటల వైద్య సేవలు అందిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గంగాధర, గుండి, వావిలాల, శంకరపట్నం, వెల్ధి, చల్లూరు గ్రామాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండాలి. ఒకటి రెండు ఆసుపత్రులు మినహా మిగిలిన వాటిలో 24 గంటల వైద్యం అందటం లేదని ఇటీవల జరిగిన జడ్పీ సమావేశంలో సభ్యులు ధ్వజమెత్తారు. వైద్యులున్నా కొందరు స్థానికంగా ఉండటం లేదని ఫలితంగా 24 గంటల వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో 139 సబ్‌ సెంటర్లు ఉండగా అక్కడా వైద్య సేవలు మొక్కుబడిగానే ఉన్నాయని.. ఏఎన్‌ఎంలు స్థానికంగా ఉండటం లేరనే ఆరోపణలు ఉన్నాయి.

Related Posts