పాట్నా, జూన్ 19,
బీహార్‌లోని రాజ్‌గిర్‌లో చారిత్రక నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఉదయం నలంద యూనివర్శిటీకి చేరుకున్న మోదీ ముందుగా యూనివర్సిటీలోని అలనాటి వారసత్వాన్ని పరిశీలించారు. ఆ తర్వాత కొత్త క్యాంపస్‌కు చేరుకున్న ప్రధాని అక్కడ బోధి వృక్షాన్ని నాటి నూతన ప్రాంగణాన్ని ప్రారంభించారు.విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, సీఎం నితీష్ కుమార్, నలంద యూనివర్సిటీ ఛాన్సలర్ అరవింద్ పనగారియా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, బ్రూనై, దారుస్సలాం, కంబోడియా, చైనా, ఇండోనేషియా, లావోస్, మారిషస్, మయన్మార్, న్యూజిలాండ్, పోర్చుగల్, సింగపూర్, దక్షిణ కొరియా, శ్రీలంక, వియత్నాం సహా మొత్తం 17 దేశాల నుండి విదేశీ రాయబారులు కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వర్శిటీ నిర్మాణానికి 17 దేశాల సహకారం ఉన్నట్లు తెలుస్తోంది. నలందా ప్రాంతాన్ని 2016లో ఐక్యరాజ్యసమితి వారసత్వ సంపదగా గుర్తించింది.వైభవోజ్వల ప్రాచీన భారత చరిత్ర పుటలు తిరగేస్తే, వినిపించే పేర్లు నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు. విదేశీయుల దాడుల్లో నలంద విశ్వవిద్యాలయం దెబ్బతిన్నది. అయినా దాని ఆనవాళ్లు మాత్రం ఇప్పటికీ ఉన్నాయి. అలాంటి నలంద విశ్వవిద్యాలయాన్నిఅదేచోట రాజ్‌గిర్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధునాతంగా మళ్లీ నిర్మించింది. నలంద విధ్వంసాన్ని గుర్తు చేస్తూ, జ్వాలలు జ్ఞానాన్ని నాశనం చేయలేవన్నారు ప్రధాని మోదీ. నలంద అంటే ఒక గుర్తింపు, గౌరవం. నలంద ఒక విలువ, ఒక మంత్రం, ఒక గర్వం, ఒక కథ అన్నారు. పుస్తకాలు అగ్ని జ్వాలల్లో కాలిపోవచ్చు కానీ, అగ్ని జ్వాలలు జ్ఞానాన్ని నాశనం చేయలేవు అనే సత్యాన్ని ప్రకటించేదే నలంద అన్నారు మోదీ.నలంద కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో 17దేశాలకు చెందిన మిషన్ల అధిపతులతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 455 ఎకరాల క్యాంపస్‌లో రెండు అకాడమిక్ బ్లాక్‌లను నిర్మించింది. దాదాపు 1749 కోట్లతో ఆధునాతన వర్శిటీని నిర్మించారు. 1900 సీటింగ్ సామర్థ్యంతో 40 తరగతి గదులు, రెండు అకడమిక్ బ్లాక్‌లు, 300 సీట్ల సామర్థ్యంతో రెండు ఆడిటోరియంలు ఏర్పాటు చేశారు. సుమారు 550 మంది విద్యార్థులకు హాస్టల్ వసతి సదుపాయం ఉంది. 2000 మంది వ్యక్తులకు వసతి కల్పించే యాంఫీథియేటర్, ఫ్యాకల్టీ క్లబ్ , స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి అనేక ఇతర సౌకర్యాలను కూడా నలంద విశ్వవిద్యాలయంలో కల్పించారు. సోలార్ ప్లాంట్లు, తాగునీటి శుద్ధి కర్మాగారాలు, మురుగునీటిని పునర్వినియోగం చేసే నీటి రీసైక్లింగ్ ప్లాంట్, 100 ఎకరాల నీటి వనరులు అనేక ఇతర పర్యావరణ అనుకూల సౌకర్యాలతో క్యాంపస్ ను నిర్మించారు. 2007లో నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ సూచనతో నలందా యూనివర్శిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.