YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఓట్లు గల్లంతు

 ఓట్లు గల్లంతు
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీలతో పాటు, ఇదివరకు ఉన్న పంచాయతీల్లో పెద్దఎత్తున ఓట్లు గల్లంతయ్యాయి. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కానున్న తరుణంలో పెద్దసంఖ్యలో ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న తరుణంలో పకడ్బందీగా ఓటరు జాబితాను సిద్ధం చేయాల్సింది పోయి, గత సార్వత్రిక ఎన్నికల్లో ఉన్న ఓటరు జాబితాను యథాతథంగా ప్రచురించడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. జిల్లాలో ఇదివరకు 320 గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో ఎనిమిది పంచాయతీలు పురపాలికలో విలీనమయ్యాయి. కొత్తగా 157 పంచాయతీలతో కలిపి మొత్తం 469 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. కౌడిపల్లి మండలం రాయిలాపూర్‌ గ్రామపంచాయతీ మినహా మిగతా వాటికి ఎన్నికలు నిర్వహించనున్నారు.
జిల్లాలో 4,086 వార్డులు ఉన్నాయి. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం. అలాంటిది వందల సంఖ్యలో ఓట్లు గల్లంతవ్వడం రాజకీయ నాయకులపై ప్రభావం చూపనుంది. ఈ నెల 17న ప్రకటించిన తుది జాబితా ఆధారంగా జిల్లాలోని పంచాయతీల్లో 4,26,873 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలే ఎక్కువగా ఉన్నారు. తుది జాబితాను ప్రకటించిన ఆయా గ్రామపంచాయతీల వద్ద వీటిని  ప్రదర్శించారు. జాబితాను చూసుకొని చాలా మంది తమపేర్లు గల్లంతైన విషయాన్ని గుర్తించారు. ప్రతి పంచాయతీ పరిధిలో పదుల సంఖ్యలో ఓటర్ల పేర్లు జాబితాలో లేవు. వారంతా ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ ఎన్నికల హడావుడి నేపథ్యంలో తుది జాబితాను ప్రకటించాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు గత అసెంబ్లీ ఎన్నికలలో ఉన్న ఓటరు జాబితా ఆధారంగా పాత గ్రామపంచాయతీలతో పాటు, కొత్తగా ఏర్పడిన పంచాయతీల వారీగా జాబితాను రూపొందించి ప్రచురించడం ఓట్లు గల్లంతవ్వడానికి కారణంగా చెప్పవచ్చు. ఒకవేళ జాబితాల్లో పేర్లు లేనివారు దరఖాస్తు చేసుకొని, ఆ తర్వాత రెవెన్యూ అధికారులు విచారణ చేసి పేరు నమోదు చేసేంతవరకు సుమారు 15 రోజుల సమయం పట్టనుంది. ఆలోపు పంచాయతీ ఎన్నికల ప్రకటన వెలువడితే కొత్త ఓటరు నమోదు ప్రక్రియ ఆగిపోతుంది. అందుకనే రెవెన్యూ సిబ్బంది గ్రామంలో ఇంటింటికి తిరిగి త్వరితగతిన ఓటరు నమోదు చేపడితేనే ప్రయోజనం ఉంటుంది. ఓటరు నమోదు చేపట్టకుంటే మాత్రం చాలాచోట్ల అభ్యర్థుల జాతకాలు తారుమారు కానుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
వెల్దుర్తి మండలంలో సుమారు 4,000 ఓటర్ల పేరు జాబితాలో ప్రచురితం కాలేదు. వీరందరికి ప్రస్తుతానికి ఓటు హక్కు లేకుండా పోయింది. హవేలిఘనపూర్‌ మండలకేంద్రంలో 63, గంగాపూర్‌ తండాలో 33, చౌట్లపల్లిలో 15, జక్కన్నపేట, బూర్గుపల్లిలో కనీసం 20 మంది చొప్పున ఓటర్ల పేర్లు జాబితాలో లేవు. రామాయంపేట మండలంలో కొత్తగా ఏర్పడిన నందగోకుల్‌ గ్రామపంచాయతీలో 50 ఓట్లు గల్లంతయ్యాయి. ఇదే గ్రామానికి చెందిన చాకలీ రవిందర్‌ కుటుంబంలో ఐదుగురు సభ్యుల పేర్లు జాబితాలో లేవు. అదేవిధంగా కొమ్మిడి తిరుపతిరెడ్డి, దొంతిరెడ్డి లక్ష్మి, భూంరెడ్డిల పేర్లు జాబితాలో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.  అల్లాదుర్గం మండలం గొల్లకుంటతండాలో 9 మంది, గాండ్లబాయితండాలో ఆరుగురి పేర్లు ఓటరు జాబితాలో లేవు.

Related Posts