YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నల్లారి కిరణ్ కు కీలక పదవి...

నల్లారి కిరణ్ కు కీలక పదవి...

తిరుపతి, జూన్ 20,
లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు బీజేపీ అధిష్ఠానం కీలక పదవిని కట్టబెట్టొచ్చనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారులో కీలకంగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా కిరణ్ విషయంలో సానుకూలంగానే ఉన్నట్లు చెప్తున్నారు. ఆ క్రమంలో ఆయనకు రాజ్యాంగ పదవి దక్కడం ఖాయమైందన్న టాక్ వినిపిస్తుంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా  కిరణ్ కుమార్ రెడ్డి రికార్డులకు ఎక్కారు. 2009లో వై.యస్.రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత అప్పటి కాంగ్రెస్ హై కమాండ్ రోశయ్యను సీఎంగా చేసింది. అప్పట్లో కిరణ్ శాసన సభ స్పీకర్ గా వ్యవహరించారు. రోశయ్య సీఎంగా బాధ్యతలు చేపట్టగానే కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. దానికి తోడు తండ్రి మరణించగానే సీఎం పదవి ఆశించి ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ కూడా చేసిన జగన్.. ఓదార్పు యాత్రంటూ హడావుడి మొదలుపెట్టారు.సహజంగా మృదుస్వభావి అయిన రోశయ్య.. అటు కేసీఆర్, ఇటు జగన్‌ల విషయంలో సాఫ్ట్ కార్నర్‌తో వ్యవహరిస్తుండటంతో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆయన్ని తప్పించి గవర్నర్‌గా పంపించింది. ఆ క్రమంలో స్పీకర్ గాఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డిని అప్పటి వరకు ఎలాంటి మంత్రి పదవి నిర్వహించకపోయినా ఒకేసారి సీఎంను చేసింది. కిరణ్ తండ్రి నల్లారి అమర్‌నాథ్‌రెడ్డి అప్పటికే కాంగ్రెస్ పార్టీలో పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. అది కిరణ్‌కు కలిసి వచ్చింది. మరో వైపు అప్పటికే తెలుగుకంటే హిందీ, ఇంగ్లీషుల్లో అనర్గళంగా మాట్లాడగలిగే కిరణ్‌కు ఢిల్లీ పెద్దలతో మంచి రాపో ఏర్పడింది.పైపెచ్చు ఎలాంటి వివాదాలకు తావులేని రాజకీయ జీవితం, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వ్యక్తిగత చరిత్ర, ఏదైనా ముక్కుసూటిగా చెప్పే మనస్తత్వం, కీలక సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సైతం వెనుకంజ వేయని ఆయన మనస్తత్వం. ఆయనను ముఖ్యమంత్రి స్థాయికి చేర్చాయి. అయితే ఏపీ విభజన విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ తో కిరణ్ కుమార్ రెడ్డి చివరి వరకు పోరాడారు. అయినా ఫలితం లేకపోవడంతో రాష్ట్ర విభజనకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సొంతంగా జై సమైఖ్యాంద్ర పార్టీ స్థాపించి 2014 ఎన్నికల్లో పోటీ చేసినా.. పెద్దగా ప్రభావం చూపించలేదు. కొన్నేళ్లు సైలెంట్‌గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి.. తిరిగి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.ఏపీలో వైసీపీ ప్రభుత్వం రావడం. కాంగ్రెస్ ఇంకా కోలుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2023లో బీజేపీలో చేరారు. తాజా ఎన్నికల్లో బీజేపీ నుంచి రాజంపేట ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తనకు ముందు నుంచి రాజకీయ ప్రత్యర్ధిగా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో వైరంతోనే ఆయన ఏరికోరి రాజంపేట నుంచి పోటీ చేశారు. పెద్దిరెడ్డి అరాచకాలను ఎన్నికల ప్రచారంలో ఎండగడుతూ.. సీఎంగా ఉన్నప్పుడు ఆయన తన కాళ్లు పట్టుకుని బతిమలాడారని గుర్తు చేశారు.ఎంత చేసినా ఈ ఎన్నికల్లో ఆయన పెద్దిరెడ్డి ఫ్యామిలీకి చెక్ పెట్టలేకపోయారు. విచ్చలవిడిగా డబ్బలు వెదజల్లిన పెద్దిరెడ్డి తండ్రీ కొడుకులు మెజార్టీలు తగ్గినా గట్టెక్కగలిగారు. ఎంపీగా మిథున్‌రెడ్డి మెజార్టీని గత ఎన్నికల కంటే గణనీయంగా తగ్గించడంలో కిరణ్ సక్సెస్ అయ్యారు. గత ఎన్నికల్లో 2.7 లక్షల మెజార్టీ సాధించిన మిథున్‌రెడ్డి ఈ సారి 76 వేల ఓట్లతో గెలవగలిగారు. మొత్తమ్మీద రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన నేతృత్వంలోని కూటమి విజయం సాధించినా.. ఆ ప్రభంజనంలో కిరణ్ కుమార్ రెడ్డి గెలవలేకపోయారు.దాంతో కేంద్రం ఆయన్ని గవర్నర్ గా నియమించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయనకు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉండనే ఉంది. ప్రస్తుతం దేశంలో వివిధ రాష్ట్రాలకు ఇన్‌చార్జ్ గవర్నర్లు కొనసాగుతున్నారు. కేంద్రంలో తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరడంతో అన్ని రాష్ట్రాలకు ఇంచార్జ్ గవర్నర్ ల ప్లేస్ లో పూర్తి స్థాయి గవర్నర్ లను నియమించనున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయన్న టాక్ గట్టిగానే వినిపిస్తుంది.ఈ విషయంలో కిరణ్‌కి ఎన్డీఏ సర్కారులో కీలకంగా మారిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సపోర్ట్ కూడా ఉందంటున్నారు. కిరణ్ తమ్ముడు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి టీడీపీ నుంచి పీలేరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ లెక్కలతో కిరణ్ ఏదో ఒక రాష్ట్రానికి ప్రధమ పౌరుడిగా వెళ్తారంటున్నారు. మరి చూడాలి ఆయన లక్ ఎలా ఉండబోతుందో ?

Related Posts