విజయవాడ, జూన్ 20,
అసెంబ్లీకి హాజరయ్యే విషయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు కొన్ని సంకేతాలు ఇచ్చారు. అసెంబ్లీలో ఏమీ చేయలేమని ప్రజలతో కలిసి పోరాటాలు చేయడమే మంచిదన్న అభిప్రాయాన్ని పార్టీ కార్యవర్గ సమావేశంలో వ్యాఖ్యానించారు. జగన్ ఓడిపోయాడు.. చనిపోలేదు అని ఒకరు అంటున్నారని.. చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకరు అంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి కౌరవులు ఉండే సభకు మనం వెళ్లాల్సి ఉంటుందని... ఇలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏదో చేయగలుగుతామనే నమ్మకం లేదని జగన్ స్పష్టం చేశారు. పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి, ప్రజలతో నిలబడి చేసే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఊపందుకుంటున్నాయి. శిశుపాలుడి పాపాలు పండినట్టుగా ఇప్పటికే చంద్రబాబు పాపాలు పండుతూనే ఉన్నాయన్నారు. ప్రజల మధ్యకి గౌరవంగా వెళ్లగలుగుతామని.. కాలం గడుస్తున్న కొద్దీ మన పట్ట అభిమానం వ్యక్తమవుతుందని చెప్పుకొచ్చారు. మళ్లీ మనం రికార్డు మెజార్టీలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మోసపోతున్నవారికి మనం అండగా నిలవాలి. మనకార్యకర్తలకు మనం తోడుగా ఉండాలి. ఎప్పుడూ చూడని విధంగా కార్యకర్తలమీద, సానుభూతి పరులమీద దాడులు చేస్తున్నారు. కొన్ని చోట్ల అవమానాలు, ఆస్తుల నష్టాలు చేస్తున్నారు. వీళ్లందరికీ కూడా భరోసా ఇవ్వాలని పార్టీ నేతల్ని కోరారు. అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడంతో అసెంబ్లీకి వెళ్లే విషయంలో జగన్ ఆలోచిస్తున్నారు. గత అసెంబ్లీలో వైసీపీ సభ్యులు టీడీపీ సభ్యుల్ని తీవ్రంగా అవమానించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని సార్లు దాడుల ఘటనలు కూడా జరిగాయి. పార్టీ అధినేత చంద్రబాబును అవమానించంతో ఇది కౌరవ సభ అని ఆరోపించి.. మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతానని సవాల్ చేసి వెళ్లారు. ఇప్పుడు సీఎంగానే ఆయన సభలో అడుగుపెట్టనున్నారు. అయితే జగన్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. టీడీపీ సభ్యులు పదకొండు మంది మాత్రమే ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలను పట్టించుకోరని జగన్ ను అవమానించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. అందుకే జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల్లోనే ఉండి పోరాడాలని అనుకుంటున్నారు. ఓ ఏడాది తర్వాత ప్రజల్లోకి వెళ్తే సరిపోతుందని అనుకుంటున్నారు. అందుకే అసెంబ్లీలో ఈ సారి వైసీపీ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉండే అవకాశం తక్కువగా ఉందని భావిస్తున్నారు.