YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

భద్రాద్రిలో శ్రీరామకల్యాణమా? లక్ష్మీనారాయణుల కల్యాణమా?

భద్రాద్రిలో శ్రీరామకల్యాణమా? లక్ష్మీనారాయణుల కల్యాణమా?

ఖమ్మం, జూన్ 21,
రాముడా? నారాయణుడా? దశాబ్ద కాలంగా రాములోరి క్షేత్రం భద్రాచలంలో ఇదే చర్చ జరుగుతోంది. తెగని వివాదంపై హైకోర్టును ఆశ్రయించారు రామ భక్తులు. కోర్టు వేసిన ఐదుగురి సభ్యుల కమిటీ రెండు రోజుల పాటు అర్చకులు, పండితుల అభిప్రాయాలు సేకరిస్తోంది. తర్వాత కోర్టుకు రిపోర్టు సమర్పించనుంది. ఇంతకీ భద్రాద్రిలో ఈ పంచాయితీ ఎందుకు?దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం క్షేత్రంలో దశాబ్దకాలంగా రామనారాయణపై వివాదం కొనసాగుతోంది. సీతారామచంద్రస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల తరుణంలో చర్చ తెరమీదకు వస్తుంది. భద్రాద్రిలో జరిగేది శ్రీరామకల్యాణమా లేక లక్ష్మీనారాయణుల కల్యాణమా అంటూ కొంతమంది ప్రశ్నిస్తుండటం చర్చకు దారి తీస్తోంది. దశాబ్ద కాలంలో ఎన్నోసార్లు ఈ విషయం శ్రీరామనవమి ముందు తెరపైకి రావటం, తర్వాత తెరమరుగు కావటం ఏటా జరుగుతోంది.ఈ క్రమంలో ప్రభుత్వమే ఈ విషయంపై జోక్యం చేసుకోవాలని ఆధ్యాత్మికవేత్తలు, పీఠాధిపతులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం దొరకలేదు. దీంతో కొంతమంది భక్తులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఐదుగురి సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సభ్యులు భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవాలయంలో రెండు రోజుల పాటు విచారణ చేపట్టారు.రామనారాయణ అంశం ఆలయ వైదికులకు, భక్తులకు ఎన్నో సవాళ్లు విసురుతోంది. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవంలో రామనారాయణ అనే మాటను వైదిక బృందం ఉపయోగిస్తోంది. కొన్ని వర్గాలు దీన్ని తప్పు పడుతున్నాయి. కొన్నేళ్లుగా ఈ వివాదాల తాకిడి రాజుకుంటూనే ఉండగా తమదే సరైన పద్ధతి అని ఇరుపక్షాలు చెప్పుకుంటున్నాయి. గతంలో పలు సంచలన విషయాలను ప్రస్తావిస్తూ గుంటూరు జిల్లా ఆరేపల్లి అగ్రహారానికి చెందిన డా.అన్నదానం చిదంబరశాస్త్రి రాసిన భద్రాద్రీశునకు జరుగుతున్న ఘోరాపచారం అనే పుస్తకం దుమారాన్నే రేపింది. రామాలయ సిబ్బంది ఈ పుస్తకంలోని అంశాలను ఖండించారుతెలంగాణ రాముడి వైభవం తగ్గించేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగానే రామనారాయణ వివాదాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారనే వాదన ఉంది. గతంలో ఎన్నో చర్చా వేదికల్లో కూడా వివరించి ప్రభుత్వానికి కూడా నివేదిక సమర్పించామని మాజీ ప్రధానార్చకులు కోటి కృష్ణమాచార్యులు చెబుతున్నారు. ప్రతి ఆలయానికి కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయని.. లేనిపోని అంశాల తెరమీదకు తేవొద్దంటున్నారు.ఆలయ సంప్రదాయ అంశంపై 1999 నుంచే కొంతమంది కుట్రలు చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వచ్చారని పలువురు అర్చకులు అంటున్నారు. స్వామివారి కల్యాణం వైష్ణవ సంప్రదాయం ప్రకారం జరుగుతుందని నాటి కమీషనర్‌కు వివరించామని చెబుతున్నారు. 2000 సంవత్సరంలో కల్యాణం గురించి అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చిందని, భద్రాచలం అర్చకులు పాటిస్తున్న సంప్రదాయాలే కొనసాగుతాయని హైకోర్టు కూడా గతంలో స్పష్టం చేసిందని గుర్తుచేస్తున్నారు. ఆ తీర్పుతో భంగపడ్డ కొందరు అప్పటినుంచి కుట్రలకు తెరలేపారని మండిపడుతున్నారు.భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో.. రాముడా రామ నారాయణుడా అనేదానిపై దశాబ్ద కాలానికిపైగా కొనసాగుతోన్న వివాదం ఇప్పటికైనా కొలిక్కి వస్తుందా అన్న చర్చ ఉంది. హైకోర్టు కమిటీ వైదిక సిబ్బంది, వేద పండితుల అభిప్రాయ సేకరణతో పాటు వివాదానికి కారణాలను వీడియో రికార్డు ద్వారా సేకరిస్తుంది. తర్వాత కమిటీ సభ్యులు రాముడా.. రామనారాయణుడా అనే అంశంపై స్పష్టత కోసం వీడియోలు, అభిప్రాయాలను కోర్టుకు సమర్పించనున్నారు. దీనిపై ఫైనల్‌గా హైకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.

Related Posts