విజయవాడ, జూన్ 21,
ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ప్రస్తుత పరిస్థితుల్లో అనేక సవాళ్లును ఎదుర్కొనున్నారు. టీడీపీ కూటమిలో జనసేన, బీజేపీ ఉన్నాయి. వాటితో సంప్రదించే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. ఆ పార్టీలు అడ్డు చెబితే, ఆ నిర్ణయం అమలుకు నోచుకోదనేది స్పష్టం.చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పేరుతో భారీగా సంక్షేమ పథకాలను ప్రకటించారు. వాటి అమలుకు ఏడాదికి దాదాపుగా రూ.80 వేల కోట్లు నుంచి రూ.లక్ష కోట్లు వరకు అవుతాయని అంచనా. గత ప్రభుత్వం ఇచ్చిన కొన్ని సంక్షేమ పథకాలకే ఐదేళ్లలో రూ.2.70 లక్షల కోట్లు ఖర్చు చేశారు.అయితే టీడీపీ కూటమి ఇచ్చిన హామీలతో ఏడాదికి దాదాపుగా రూ.80 వేల కోట్లు నుంచి రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గతం కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఏపీలో ఆర్థిక పురోగతి ఆశించినంతగా పెరగటం లేదు. పథకాలను అమలు చేస్తే అప్పులు పెరిగే అవకాశం ఉంది.ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటికీ లోటు బడ్జెట్ కనబడుతుంది. సంక్షేమ పథకాల్లో ప్రధానంగా 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18,000 ఇవ్వాలి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు మహిళలకు ఏడాదికి రూ.18,000 ఇచ్చారు. కానీ చంద్రబాబు ఏకంగా 19 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు వరకు గల మహిళలకు ఇస్తానన్నారు. దీనివల్ల ఇప్పుడున్న లబ్ధిదారుల సంఖ్య మూడింతలు, నాలుగింతలు పెరిగే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతుంది.అలాగే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఇప్పుడు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తే, ఆర్టీసీ మరింత నష్టాల్లోకి వెళ్తుంది. ఉచిత బస్ ప్రయాణానికి అయిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. దీనివల్ల ఆర్థికంగా భారం పడనుంది.అమ్మఒడి పథకంతో ప్రస్తుతం స్కూల్‌కి వెళ్లిన విద్యార్థికి ఏడాదికి రూ.15,000 ఇస్తున్నారు. ఇది కుటుంబంలో ఒక విద్యార్థికే ఇస్తున్నారు. అయితే ఇంట్లో ఎంత మంది విద్యార్థులు ఉంటే, అంతమందికీ 'తల్లికి వందనం' కింద ఏడాదికి రూ.15,000 ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనివల్ల లబ్ధిదారులు సంఖ్య భారీగా పెరుగుతుంది. ఫలితంగా ఆర్థిక భారం పెరుగుతుంది.అలాగే సామాజిక పెన్షన్ రూ.3,000 నుంచి రూ.4,000లకు పెంపు, అలాగే వికలాంగుల పెన్షన్ రూ.6,000 పెంపు, బీసీలకు 50 ఏళ్లకు పెన్షన్ ఇస్తానని ప్రకటించారు. దీనివల్ల పెన్షన్ లబ్ధిదారులు నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు పెన్షన్ 60 ఏళ్లు నిండిన వారికి ఇస్తున్నారు. అంటే పదేళ్ల వ్యవధిలో నాలుగు రెట్లు లబ్ధిదారులు పెరుగుతారు. దీనివల్ల ఆర్థిక భారం భారీగా పెరుగుతుంది. నిరుద్యోగ భృతి నెలకు మూడు వేలు ఇస్తామని ప్రకటించారు. దీనివల్ల కూడా ఆర్థిక భారం పడనుంది. కోట్ల రూపాయాలు ఖర్చు కానుంది.అలాగే రైతులకు ఏడాదికి రూ.20 వేలు హామీ అమలు చేయాలంటే, చాలా వరకు నిధులు అవసరం అవుతాయి. అయితే ఇందులో రూ.6,000 కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద ఇస్తుంది. మిగిలిన రూ.14,000 రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. ఇందుకోసం కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. అన్నా క్యాంటీన్లు వంటి వాటికి కూడా కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. నిరుద్యోగం భృతి పేరుతో ప్రతి నెల నిరుద్యోగ యువతకు రూ.3,000 ఇస్తామన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు లక్షల్లో ఉన్నారు. దీనివల్ల కూడా కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉందిసంక్షేమ పథకాలతో ఆర్థిక భారం పెరగడంతో పాటు అప్పులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. రాష్ట్ర విభజన జరిగిన తరువాత వచ్చిన అప్పులతో పాటు చంద్రబాబు హయంలో కూడా భారీగా అప్పులు పెంచేశారు. చంద్రబాబు తరువాత జగన్మోహన్ రెడ్డి కూడా అప్పులు చేశారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబే పీఠం ఎక్కారు. సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడానికి అప్పులు భారీగా పెరుగుతాయి. రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం వంటివి కూడా చేయాల్సి ఉంది.