పాట్నా జూన్ 21
బీహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ లో నితీష్ కుమార్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దళితులు, వెనుకబడిన తరగుతుల, గిరిజనులకు రిజర్వేషన్ కోటాను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచాలని గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు గురువారం కొట్టివేసింది. రిజర్వేషన్ కోటాను పెంచుతూ 2023 నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై చీఫ్ జస్టిస్ కె వినోద్ చంద్రన్ నేతృత్వంలోని పాట్నా హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. బీహార్‌లో కులాలపై సమగ్ర సర్వే జరిపిన రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసి, ఇబిసిల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కోటాను 50 నుంచి 65 శాతానికి పెంచుతూ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థలలో ఈ అణగారిన వర్గాలకు రిజర్వేషన్ కోటాను 50 నుంచి 65 శాతానికి పెంచుతూ గత ఏడాది నవంబర్ 21న ఒక గెజిట్ నోటిఫికేషన్‌ను నితీష్ కుమార్ ప్రభుత్వం జారీచేసింది.రజ్యాంగంలోని 14, 16, 20 అధికరణలను రాష్ట్ర ప్రభుత్వం తన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఉల్లంఘించిందని, తాము చేసిన వాదనలపై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ మార్చిలో తన తీర్పును రిజర్వ్ చేసిందని, ఈ రోజు తమ పిటిషన్లపై తీర్పును వెలువరించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులలో ఒకరైన రితికా రాణి తెలిపారు.
కుల గణన ఆధారంగా తాము రిజర్వేషన్ కోటాను పెంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం వాదించిందని, అయితే ఇంద్రా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులతోపాటు ఇటీవల మరాఠాల రిజర్వేషన్లకు సంబంధించిన కేసులో 50 శాతం గరిష్ఠ పరిమితికి మించి ఏ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను పెంచడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసిన విషయాన్ని తాము ఉటంకించామని మరో పిటిషనర్ తరఫు న్యయవాది నిర్భయ్ ప్రశాంత్ తెలిపారు. జనాభా గణాంకాల సేకరణలో భాగమైన ఎస్‌సి, ఎస్‌టిల జనాభా మినహాయించి మిగిలిన సామాజిక వర్గాల లెక్కలను సేకరించడంపై కేంద్రం నిస్సహాయతను వ్యక్తం చేసిన దరిమిలా బీహార్‌లో కులగణన నిర్వహించిన నితీష్ కుమార్ ప్రభుత్వం ఆ లెక్కల వివరాలను గత ఏడాది అక్టోబర్ 2న విడుదల చేసింది.ఈ సర్వే ప్రకారం రాష్ట్ర మొత్తం జనాభాలో ఓబిసిలు అత్యధికంగా 63 శాతం ఉండగాఎస్‌సి, ఎస్‌టిలను మొత్తం గా లెక్కగడితే 21 శాతానికి మించి ఉన్నారు. కాగా..కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా బలహీన వర్గాలకు(ఇడబ్లుస్) 10 శాతం కోటాను ప్రవేశపెట్టి రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఇదివరకే అతిక్రమించిందని బీహార్ ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఓబిసిలు, ఇబిసిల రిజర్వేషన్ కోటాను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తన రిజర్వేషన్ చట్టాలను సవరించింది. ఇదబ్లుఎస్ కోటా 10 శాతాన్ని కూడా కలుపుకుంటే రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 75 శాతం మందికి రిజర్వేషన్ కోటా వర్తిస్తోంది. తాము సవరించిన రిజర్వేషన్ చట్టాలను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో పొందుపరచాలని కూడా కేంద్రాన్ని బీహార్ ప్రభుత్వం కోరింది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో ఉండే కేంద్ర, రాష్ట్ర చట్టాలను కోర్టులలో సవాలు చేసేందుకు అవకాశం ఉండదు. రిజర్వేషన్ కోటాపై 50 శాతం గరిష్ఠ పరిమితి విధిస్తూ సుప్రీంకోర్టు 1992లో ఉత్తర్వులు జారీచేసింది.కాగా..బీహార్‌లో నితీష్ కుమార్ సారథ్యంలోని జెడియుతో అధికారాన్ని పంచుకున్న సమయంలో వచ్చిన ఈ కోటా చట్టాల సవరణను స్ఫూర్తిగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహిస్తామని తన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసింది. అయితే ప్రస్తుతం బీహార్‌లో నితీష్ కుమార్‌తో కలసి అధికారాన్ని పంచుకుంటున్న బిజెపి కూడా రిజర్వేషన్ కోటాల సవరణ విషయంలో తమ పాత్ర కూడా ఉందని వాదిస్తోంది. 2022లో అధికార కూటమిలో తాము భాగస్వామిగా ఉన్న కాలంలోనే కుల గణనకు ఆదేశాలు జారీ అయినట్లు చెబుతోంది.