విజయవాడ, జూన్ 27,
అవును.. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే గెలిచిన వాళ్లు సరే. ఎన్నికల్లో టిక్కెట్లు పొంది ఓటమి పాలయిన వాళ్లు సరే. కానీ త్యాగాలు చేసిన తమ్ముళ్ల మాటేమిటి? అన్న చర్చ ఇప్పుడు పార్టీలో జోరుగా సాగుతుంది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. 175 స్థానాల్లోనూ తన అభ్యర్థులను పోటీకి దింపింది. అయితే 2024 ఎన్నికల నాటికి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జగన్ ను ఒంటరిగా ఎదుర్కొనే సాహసం చేయలేని విపక్షాలు కలసి పోరాటం చేయాలని నిర్ణయించాయి. అందుకే ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కలసి పోటీ చేశాయి. ఈ కాంబినేషన్ సూపర్ హిట్ అయింది. 2014 నాటి ఎన్నికల తరహాలోనే 2024లోనూ కూటమి పార్టీల విజయం మాత్రం ఆశించిన దానికంటే ఎక్కువగా వచ్చింది. అయితే కూటమి ఏర్పడినప్పుడు ఇబ్బంది పడింది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఎందుకంటే మిత్రపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి తట్టి చూసినా నియోజకవర్గాల్లో పెద్దగా నాయకత్వం లేదు. సో.. దానికి ఇబ్బంది లేదు. ఇక జనసేన కూడా కేవలం కొన్ని స్థానాలు.. అదీ ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు మాత్రమే పరిమతమయిన పార్టీగా పేరుండటం, అక్కడే ఆ పార్టీకి నేతలు ఎక్కువగా ఉండటం వల్ల అది కూడా పెద్దగా సీట్ల పంపకంలో పెద్దగా ఇబ్బంది పడలేదు. దీంతో పాటు పవన్ కల్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ కావాలని తక్కువ స్థానాలకే పరిమితమయినా.. అక్కడకక్కడా తప్ప పెద్దగా అసంతృప్తులు మాత్రం కనిపించలేదు. పవన్ కల్యాణ్ పెద్దగా లెక్క కూడా చేయలేదు. ఇక బాగా ఇబ్బంది పడింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రమే. ఒరకంగా పొత్తు ధర్మ పాటించాల్సి రావడం, మిత్రపక్షాలకు సీట్లు కేటాయించాల్సి రావడంతో కొంత నలిగిపోయారని చెప్పకతప్పదు. మొత్తం మీద చంద్రబాబు 21అసెంబ్లీ స్థానాలను జనసేన పార్టీకి, 10 స్థానాలను బీజేపీకి కేటాయించారు. అంటే 31 స్థానాల్లో టీడీపీ ఇన్‌ఛార్జులకు ఇబ్బంది వచ్చింది. వారిని కావాలని ఇబ్బంది పెట్టలేదు. కానీ పరిస్థితులు అలా వచ్చాయి. గెలుపు కావాలన్నా, పార్టీ అధికారంలోకి రావాలన్నా త్యాగానికి సిద్ధం అవ్వాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు నేతలు పాజిటివ్ గానే స్పందించారు. అక్కడక్కడా ఒకరిద్దరు నేతలు మినహాయించి అందరూ కూటమి పార్టీల నేతల విజయానికి సహకరించారు. పెద్దగా అసంతృప్తులు లేకుండానే పొత్తుల పంపకం సాగిపోయింది. సాఫీగా ఎన్నికల ప్రక్రియ ముగిసింది. విజయం సాధ్యమయింది. ఇక త్యాగాలు చేసిన తమ్ముళ్లకు ఏదో ఒక పనిని అప్పగించాల్సిన అవసరం పార్టీ అధినేతగా చంద్రబాబు పై ఉంది. దానిని ఎవరూ అభ్యంతరం కూడా చెప్పరు. అందుకు కారణం సీట్లు దక్కని చోట కూడా గట్టిగా కూటమి అభ్యర్థుల విజయానికి కృషిచేసినట్లే. అందుకే చంద్రబాబు ఆ 31 మందికి ఏదో ఒక పదవులు ఇవ్వాలని నిర్ణయించనట్లు తెలిసింది. ఓడిపోయిన 11 మందిని పక్కన పెడితే.. 31 మందికి మాత్రం పదవుల పంపకాల్లో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. పార్టీ పదవులో లేకుంటే ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులు ఇచ్చి టిక్కెట్ దక్కని వారిని సంతృప్తి పర్చాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. అయితే కొంత పాలన గాడిలో పడిన తర్వాత ఆ 31 మందికి పదవులను ఇచ్చే విషయంపై చంద్రబాబు దృష్టి పెడతారని చెబుతున్నారు. భవిష్యత్ లో శాసనమండలి, రాజ్యసభలో ఖాళీ అయ్యే పదవులతో పాటు నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్లు తెలిసింది. మొత్తం టిక్కెట్ రాని ఆ 31 మంది మాత్రం మోస్ట్ లక్కీ ఫెలోలంటూ పార్టీ నేతలు కూడా అంటున్నారు.