YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నింపాదిగా గులాబీ బాస్

 నింపాదిగా గులాబీ బాస్

హైదరాబాద్, జూన్ 27,
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాలు మరింత డైనమిక్‌గా మారిపోయాయి. భారత రాష్ట్ర సమితి ఒక్క ఎంపీ స్థానం కూడా గెలుచుకోకపోవడం మెజార్టీ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడంతో ఆ పార్టీ భవిష్యత్‌పై నేతల్లో ఆందోళన ప్రారంభమయింది. లోక్ సభ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చూస్తే అసెంబ్లీ స్థానాల్లో కేవలం మూడు అంటే మూడు స్థానాల్లో మాత్రమే ఆధిక్యత లభించింది. వ్యూహాత్మకంగా బీజేపీకి బీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చిందన్న ఓ ప్రచారం ఉంది. అయితే అది వ్యూహమా.. లేకపోతే నిర్లక్ష్యమా అన్న సంగతి పక్కన పెడితే ఆ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు పార్టీ ఉనికిపై ప్రభావం చూపేలా ఉన్నాయి.  పార్టీ హైకమాండ్‌కు అత్యంత సన్నిహితులైన వారు కూడా పార్టీ మారిపోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో వచ్చిన ఫలితాలు బీఆర్ఎస్ పార్టీ ఎంత ఘోరంగా వెనుకబడిపోయిందో చాటి చెప్పేలా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే  ఇప్పుటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో బీఆర్ఎస్‌కు మూడు అంటే మూడు సీట్లు వస్తాయి. అందులో రెండు గజ్వేల్, సిద్దిపేట. వినడానికి కాస్త అతిశయంగా ఉన్నా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఫలితాలు ఇదే విషయాన్ని వెల్లడించాయి. తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో… అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆధిక్యాలను పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీకి మూడు చోట్ల మాత్రమే ఆధిక్యత లభించింది.  లోక్ సభ ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఆధిక్యతలను చూస్తే.. కాంగ్రెస్ పార్టీ తన స్థానాలు కొన్ని మారినా మొత్తంగా 64 సీట్లలో ఆధిక్యాన్ని చూపించుకుంది. బీజేపీ ఏకంగా 45 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యాన్ని చూపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది స్థానాలు మాత్రమే వచ్చాయి. మజ్లిస్ పార్టీ తన   సెగ్మెంట్లలో ఆధిక్యాన్ని నిలుపుకుంది.  నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39సీట్లను సాధించుకుంది. కాంగ్రెస్ మిత్రపక్షంతో కలిసి అరవై ఐదు గోల్చుకోగా.. బీజేపీ ఎనిమిది దగ్గర ఆగిపోయింది. పార్లమెంట్ ఎన్నికల  నాటికి అంటే ఐదు నెలల్లోనే బీఆర్ఎస్ బీజేపీకి తన బలాన్ని కోల్పోయింది పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్,  బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లు, క్యాడర్లను చేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సహజంగా ఎమ్మెల్యేలు ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో బీఆర్ఎస్‌కు వచ్చిన ఓట్లు ఆ పార్టీని షాక్‌కు గురి చేశాయి.  మొత్తం పది స్థానాల్లో కలిపి లక్షన్నర ఓట్లు కూడా రాలేదు. దీంతో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులుగా పేరు పడిన బాన్స్ వాడ ఎమ్మెల్యే , మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వీరు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలిస్తే.. బీఆర్ఎస్ ఆపేందుకు అన్ని రకాల ఒత్తిళ్లు పెడుతుందని తెలుసుకాబట్టి.. వారికి కండువా కప్పిన తర్వాతనే అసలు విషయం వెలుగులోకి వచ్చేలా చేశారు. ఇక  వారితో పెద్దగా సాన్నిహిత్యం లేని.. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు  ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ సిగ్నల్ ఇస్తే అప్పుడు ఆ పార్టీలో చేరిపోవడానికి రెడీగా ఉన్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేందుకు అసెంబ్లీ సమవేశాలు వచ్చే నెలలో జరగనున్నాయి. ఆ సమావేశాల్లోపు కేసీఆర్‌కు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేస్తామని కాంగ్రెస్ పార్టీ అంటోంది. నిజానికి కేసీఆర్ తో సాన్నిహిత్యం ఎక్కువగా ఉన్న వారికి ముందుగా కండువాలు కప్పుతున్నారు. తర్వాత అందరికీ సామూహికంగా కండువాలు కప్పుతారని అంటున్నారు. అయితే ఒక్క కాంగ్రెస్ పార్టీనే కాదు.. ఈ విషయంలో బీజేపీ కూడా చాపకింద నీరులా తమ ప్రయత్నాలు తాము చేస్తోందన్న అనుమానాలు ఉన్నాయి. కొంత మంది ఎమ్మెల్యేలతో  బీజేపీ నేతలు టచ్ లో ఉన్నారు. కాంగ్రెస్‌లోకి పోయేవారు పోగా.. మిగిలిన వారు బీజేపీలో చేరే అవకాశం ఉంది. మొత్తంగా బీఆర్ఎస్‌కు నలుగురు, ఐదుగురు ఎమ్మెల్యేలు మిగలడం కష్టమని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే అదే జరగవచ్చని అనిపిస్తోంది. పార్టీ దుర్భర పరిస్థితుల్లో ఉంటే అధినేత కేసీఆర్ పట్టించుకోవడం మానేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం అయిపోయిన తర్వాత ఆయన ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయారు. పూర్తిగా వ్యవసాయం మీద దృష్టి పెట్టారు. ఎవరైనా పార్టీ నేతలు వస్తానంటే కలుస్తున్నారు కానీ.. అదీ కూడా చాలా తక్కువే. గ్రేటర్ పరిధిలోని నలుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ చర్చలు జరిపిన విషయం తెలియడంతో ఫామ్ హౌస్‌కు పిలిచి మాట్లాడారు. ఆ తర్వాత ఇక ఏ విషయాలు పట్టించుకోవడం లేదు. తనకు అత్యంత సన్నిహితులు కూడా పార్టీ వీడి పోతున్నా  స్పందిండం లేదు. మామూలుగా అయితే కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి పోరాడతారని క్యాడర్ అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అనైతిక పద్దతులకు పాల్పడి .. తెలంగాణ అస్థిత్వం అయిన  బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోందని ప్రజల్లో సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తారని అనుకున్నారు. కానీ కేసీఆర్ ఏమీ పట్టనట్లుగానే ఉన్నారు. పోతే పోనీ అన్నట్లుగా కేసీఆర్ ఉండటం ఆ పార్టీ క్యాడర్ ను కూడా ఆశ్చర్య పరుస్తోంది. కేటీఆర్ కూడా వలసలపై పెద్దగా ఆందోళన చెందుతున్నట్లుగా కనిపించడం లేదు. పవర్‌లో ఉన్న పాలకుల కన్నా ప్రజల పవర్ ఎక్కువ అని కొటేషన్లు చెప్పి ట్వీట్లు పెట్టి ఊరుకుంటున్నారు. ఎమ్మెల్యేలు జారిపోతారని తెలిస్తే.. ఒకటి రెండు సార్లు చెప్పి చూసి వదిలేస్తున్నారు. అయితే పార్టీని వీడిపోతే.. అనర్హతా వేటు వేయించే విషయంలో వెనక్కి తగ్గబోమని మాత్రం హెచ్చరిస్తున్నారు. బుజ్జగించడం కన్నా హెచ్చరికల మీదనే దృష్టి పెడుతున్నారు.  సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా పదవి ఊడగొడతామని అంటున్నారు.   మహారాష్ట్ర విషయంలో సుప్రీంకోర్టు పెట్టిన మూడు నెలల గడువును చూపిస్తున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే వెంటనే అనర్హతా వేటు వేయవచ్చు. కానీ అది వందశాతం స్పీకర్ కు ఉన్న అధికారం. కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవు. ఫలానా సమయం లోపు నిర్ణయం తీసుకోవాలన్న రూల్ కూడా లేదు. అందుకే అధికారంలో ఉన్న వారికి ఫిరాయింపుల నిరోధక చట్టం ఓ ఆయుధంగా కనిపిస్తోంది. గతంలో బీఆర్ఎస్ వాడుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాడుతోంది. ఈ బెదిరింపులతో ఎమ్మెల్యేల్ని ఆపలేరని బీఆర్ఎస్ నేతలకూ తెలుసు.  అయితే బీఆర్ఎస్ నేతలు తమ ప్రయత్నాలు మాత్రం తాము చేస్తున్నారని అనుకోవచ్చు.  ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే.. బీఆర్ఎస్ లీడర్లే కాదు క్యాడర్ కూడా పార్టీ మారిపోతారు. మాములుగా అయితే బీఆర్ఎస్ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. కాంగ్రెస్ పై ప్రజలకు కోపం వస్తే తమకే ఓట్లేస్తారని అనుకుంటారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రత్యామ్నాయంగా బీజేపీ పూర్తి స్థాయిలో ఎదిగి ఎదురుగా నిలుచుంది. అందరికీ అన్ని అవకాశాలు ఇచ్చారు.. మాకు ఒక్క చాన్స్ ఇవ్వమని అడుగుతోంది. ఇలాంటి సమయంలో ఓటర్లు ఆ పార్టీ వైపు మొగ్గుతున్నారని పార్లమెంట్ ఎన్నికలతో బయటపడింది. అదే ఇప్పుడు బీఆర్ఎస్‌కు అసలు సమస్య. తమ పార్టీకి పెట్టని కోట లాంటి తెలంగాణ సెంటిమెంట్ కరిగిపోయింది. ఇప్పుడు ఓటర్లను ఆకట్టుకునే మరో తెలంగాణ సెంటిమెంట్ లాంటి ఆయుధం దొరికితే కానీ బీఆర్ఎస్ ఉనికి పోరాటంలో సక్సెస్ కాదు. మరి అలాంటి ఆయుధం సృష్టించుకోకుండా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో వ్యవసాయం చేసుకుంటున్నారు. అందుకే బీఆర్ఎస్ నేతల్లో మరింత ఆందోళన పెరుగుతోంది.

Related Posts