YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గొర్రెల డొంక కదులుతోంది..

గొర్రెల  డొంక కదులుతోంది..

హైదరాబాద్, జూన్ 27,
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెల పథకం కుంభకోణానికి సంబంధించి ఏసీబీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఓఎస్టీగా వ్యవహరించిన కళ్యాణ్ కుమార్ ఈ స్కాంలో కీలకంగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసును మరింత లోతుగుగా దర్యాప్తు చేపట్టిన అధికారులకు విస్తుపోయే వాస్తవాలు తెలుసుకున్నట్టు సమాచారం.బీఆర్ఎస్ హయాంలో పశుసంవర్థక శాఖ మంత్రిగా చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌కు ఓఎస్టీగా పనిచేశాడు గుండమరాజు కళ్యాణ్ కుమార్. ఇతను మీడియేటర్ల ద్వారా తన సన్నిహితుల బ్యాంకు ఖాతాలకు లంచం సొమ్మును బదిలీ చేయించుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. తెలంగాణ వ్యాప్తంగా షీప్ రియరింగ్ డిస్ట్రిబ్యూషన్ పథకాన్ని పర్యవేక్షించిన కళ్యాణ్ కుమార్‌తో పాటు మరికొందరు అనధికారికంగా ఒక్కో యూనిట్‌కు రూ.2 వేల చొప్పున లబ్ది పొందినట్లు దర్యాప్తులో తేలింది. సంబంధిత సొమ్మును మీడియేటర్ల నుంచి తన సన్నిహితుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించుకున్న విషయాన్ని ఏసీబీ వెలిబుచ్చింది. నగదు బదిలీ అయిన రోజు జరిగిన ఫోన్ సంభాషణలను రికార్డు చేయడం ద్వారా కీలక ఆధారాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. గొర్రెల పథకంలో రామరాజు అనే వ్యక్తి దాదాపు 380 యూనిట్లను సరఫరా చేసినట్లు రికార్డుల్లో ఉంది. ఈ క్రమంలోనే రామరాజు వద్ద పని చేసిన వినయ్‌కి చెందిన బ్యాంకు ఖాతాను ఏసీబీ అధికారులు పరిశీలించారు. గతేడాది నవంబర్ 4న మధ్యాహ్నం 1.47 గంటల సమయంలో వినయ్‌కు రామరాజు ఫోన్ చేసినట్లు తేలింది. రెండు ఫోన్‌ నెంబర్లను సమకూర్చి వాటికి నగదు బదిలీ చేయాలని వినయ్‌కు సూచించినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే వినయ్ బ్యాంక్‌ ఖాతా ద్వారా పశుసంవర్ధక శాఖలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి ఫోన్ నెంబర్ ఆన్‌లైన్‌లో 50 వేలు బదిలీ చేసినట్లు గుర్తించారు. అలాగే, కళ్యాణ్‌ సన్నిహితుడి భార్య ఖాతాకు 2 లక్షలు బదిలీ చేసినట్లు వెల్లడైంది. నగదు బదిలీ జరిగిన రోజు సదరు సన్నిహితుడు ఉదయం 10.59 గంటలకు కళ్యాణ్ కుమార్‌కు ఫోన్‌ చేసినట్లు తేలింది. కళ్యాణ్ రెగ్యులర్‌గా మహిళా ఉద్యోగితో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుసుకున్నారు అధికారులు.వినయ్, రామరాజు నుంచి మహిళా ఉద్యోగికి ఎలాంటి ఫోన్ కాల్స్ లేవు. గొర్రెలను సమకూర్చడంలో కీలకంగా వ్యవహరించిన రామరాజు నుంచి కళ్యాణ్‌కు అనధికారికంగా నగదు సమకూరినట్లు అధికారులు గుర్తించారు. రామరాజు తన ఉద్యోగి వినయ్ ద్వారా కళ్యాణ్‌కు సన్నిహితంగా ఉన్న మహిళా ఉద్యోగి ఖాతాకు నగదు బదిలీ చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. అదే రోజు మహిళా ఉద్యోగికి కళ్యాణ్ కుమార్ రెండుసార్లు ఫోన్ చేయగా, ఆమె మరో రెండు సార్లు ఫోన్ చేసినట్లు గుర్తించారు. అలాగే, కళ్యాణ్ కూమార్ సీఆర్జీఏ విశ్లేషించగా మహిళా ఉద్యోగి నుంచి 1894 ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ఉన్నట్లు, కళ్యాణ్ నుంచి మహిళా ఉద్యోగికి 1311 ఔట్‌ గోయింగ్ కాల్స్ ఉన్నట్లు వెల్లడైంది.రామరాజు డ్రైవర్ నుంచి 161 సీఆర్పీసీ కింద ఏసీబీ వాంగ్మూలం సేకరించింది. ఈ క్రమంలో రామరాజు తరచూ కళ్యాణ్ కుమార్‌ను కలిసేవాడని తేలింది. అలాంటి సమయాల్లో రామరాజు నగదు రూపంలో కళ్యాణ్‌కు డబ్బు ముట్టజెప్పేవాడని గుర్తించారు. రామరాజుతోపాటు ఇదే కేసులో ప్రధాన నిందితుడు మొహిదుద్దీన్ లాంటి మరికొందరు దళారులు బృందంగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల యూనిట్లను సరఫరా చేసినట్లు గుర్తించారు. ఇలాంటి వారితోనే కళ్యాణ్‌ దందా నడిపించినట్లు అధికారులు గుర్తించారు. ఈ బృందం క్షేత్ర, జిల్లా, రాష్ట్రస్థాయిలో అధికారులతోపాటు కీలక ప్రజాప్రతినిధులకు స్థాయిలవారీగా లంచాలు ముట్టజెప్పినట్లు వెల్లడైంది. ఒక్కో యూనిట్‌కు 2 వేల రూపాయల చొప్పున కళ్యాణ్‌ సహా మరికొందరు లబ్ది పొందినట్లు తేలింది.

Related Posts