YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఓరుగల్లులో జోరుగా బడిబాట

ఓరుగల్లులో జోరుగా బడిబాట
విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో తెలంగాణలో బడి బాట కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించేందుకు అధికారయంత్రాంగం చర్యలు తీసుకుంది. వరంగల్ విద్యావిభాగం సైతం ఈ ప్రోగ్రాంను చిత్తశుద్ధితో నిర్వహించి.. బడి ఈడు పిల్లలు చదువుకునేలా కృషి చేస్తోంది. ఈ మేరకు జూన్ 8 వరకు బడిబాట నిర్వహించి పిల్లలను బడులకు రప్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇదిలాఉంటే పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా పెద్దల్లోనూ అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది. ఈ క్రమంలో ఆవాస ప్రాంతాల్లో పాఠశాలలను అలంకరించడం, ర్యాలీలు నిర్వహించడంతో పాటూ తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేయనుంది. అంతేకాక స్వచ్ఛంద సంస్థలు, పూర్వ విద్యార్థులతో సమావేశాలు పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ కార్యక్రమం సాగుతోంది. ఇకమీదట మరింత ఉధృతంగా నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఇదిలాఉంటే  ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ప్రణాళికను అన్ని పాఠశాలలకు పంపారు. బయోమెట్రిక్ హాజరు విధానం అమలుపైనా దృష్టి పెట్టారు. పాఠశాలల్లో బయోమెట్రిక్‌ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జిల్లాలను ఎంపిక చేసిందని ఇంకా ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదని వివరించారు. ఉత్తర్వులు త్వరలోనే వెలువడే అవకాశం ఉందని తెలిపారు. బయోమెట్రిక్ విధానం అమల్లోకి వస్తే విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది వేలి ముద్రల ఆధారంగా హాజరు నమోదవుతుందని పేర్కొన్నారు.
పిల్లలు బడిబాట పడుతుండడంతో పాఠ్యపుస్తకాల కొరత రాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే అన్ని మండలాలకు పాఠ్యపుస్తకాలు సరఫరా చేసినట్లు డీఈఓ తెలిపారు. మండలాల నుంచి అన్ని పాఠశాలలకు పుస్తకాలను తీసుకెళ్లి విద్యార్ధులకు అందిస్తారని చెప్పారు. ఒకవేళ విద్యార్థుల సంఖ్య పెరిగినా సమస్య లేదని అదనంగా పుస్తకాలు అందుబాటులో ఉంచాలమని వెల్లడించారు. తక్కువైతే మళ్లీ తెప్పిస్తామని స్పష్టంచేశారు. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు సరిపడా యూనిఫాం దుస్తులు సైతం వచ్చినట్లు డీఈఓ వివరించారు. ఈసారి కొత్తగా ప్రభుత్వం 9, 10 తరగతుల వారికీ ఉచితంగా అందిస్తోందని వారికి జూన్‌లో వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు జిల్లాలోని పలు పాఠశాలల్లో కొత్తగా గదులు, ఇతర నిర్మాణాలు చేపడుతున్నారు. పాత భవనాలు కూల్చి వేసిన ప్రాంతాల్లో కొత్తవి నిర్మిస్తున్నారు. జూన్‌  చివరికల్లా అన్ని నిర్మాణాలు పూర్తవుతాయని ఈజీఎస్‌ ద్వారా వంట గదులను కడుతున్నారని చెప్పారు.

Related Posts