ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలుగుదేశం పార్టీ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని వారిని అప్యాయంగా పలకరించి మాట్లాడారు. స్నేహితుడు చంద్రబాబు నాయకత్వంలో అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ టీడీపీ, బీజేపీలు కలిసికట్టుగా పనిచేస్తున్నట్లు మోదీ తెలిపారు. దేశ ప్రగతితోపాటు ఏపీ అభివృద్ధికి సాధ్యమైన మేరకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పష్టం చేశారు. కేంద్రమంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, బైరెడ్డి శబరి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు నరేంద్ర మోదీని కలిసిన వారిలో ఉన్నారు.
మరోవైపు ఈరోజు లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. సభాపతిగా ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని రాజ్‌నాథ్ సింగ్‌తో పలువురు ఎన్డీయే ఎంపీలు బలపరిచారు. దీనికి టీడీపీ ఎంపీలు మద్దతు తెలిపారు.