YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

సమస్యల వలయంలో వసతి గృహాలు

సమస్యల వలయంలో వసతి గృహాలు
ప్రభుత్వ హాస్టళ్లు అంటే సాధారణంగా సమస్యలకు నెలవుగానే పేర్కొంటారు అంతా. దానికి తగ్గట్లే పలు వసతి గృహాల్లో ఇబ్బందులు తాండవిస్తున్నాయి. ప్రస్తుతం విద్యాసంవత్సరం ప్రారంభమవడంతో మహబూబాబాద్ పరిధిలోని హాస్టళ్ల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు. బడుగు విద్యార్ధులకు మెరుగైన వసతి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. పేద విద్యార్థులకు వసతి కల్పించి నాణ్యమైన విద్యను అందించడం కోసం సర్కారు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాలను, గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఏర్పాటుచేసింది. ఇక వీటి నిర్వహణ నిమిత్తం ఏటా రూ. కోట్లను ఖర్చు చేస్తోంది. నిధులు అధికంగానే వెచ్చిస్తున్నా మౌలిక వసతుల కల్పన అంతంత మాత్రంగానే ఉంటోంది. సెలవుల అనంతరం ప్రారంభమైన విద్యాలయాలు ఎప్పటి మాదిరిగానే సమస్యలతో స్వాగతం పలికాయి. వేసవిలోనే సమస్యలను పరిష్కరించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి. అయితే అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ప్రస్తుతం విద్యాసంవత్సరం మొదలైపోవడంతో పలు ప్రాంతాల్లోని వసతి గృహాలపై దృష్టి సారించారు. సమస్యలకు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలాఉంటే మహబాబూబాద్‌లోని పలు ప్రాంతాల్లోని సంక్షేమ హాస్టళ్లలో ఇబ్బందులు తిష్టవేసినట్లు విద్యార్ధి సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. అధికార యంత్రాంగం ఆయా హాస్టళ్లలోని సమస్యలు పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేస్తున్నారు. 
రెడ్యాలలో గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలకు ప్రహరీ లేదు. 28 మరుగుదొడ్లలో 14 వరకు నిరుపయోగంగా ఉన్నాయి. పిల్లలు ఆరుబయటే స్నానాలు చేస్తున్నారు. పడుకోవడానికి రెండు అంచెల పడకలు ఉన్నా వీటి వల్ల విద్యార్ధుల తలలకు ఫ్యాన్లు తగులుతున్నాయి. గతంలో ముగ్గురు గాయాలపాలైన సందర్భాలు సైతం ఉన్నాయి. దీనితోడు గదుల్లోని పై కప్పులు పెచ్చులు ఊడిపోతున్నాయి. మరోవైపు ఈ హాస్టల్‌లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కిటికీలకు జాలీలు పెట్టకపోవడంతో విద్యార్ధులు దోమలతో కుస్తీ పడుతున్నారు. పత్తిపాక గిరిజన ఆశ్రమ పాఠశాలలో వసతి గృహం లేకపోవడంతో తరగతి గదిలోనే విద్యనభ్యసిస్తూ, అందులోనే పడుకుంటున్నారు. ఇక్కడా అనేక సమస్యలు తాండవిస్తున్నాయి. కేసముద్రం మండలం ఇనుగుర్తిలో ఎస్సీ బాలుర హాస్టల్‌లో సరైన వసతులు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. వస్తువులు, పుస్తకాలను భద్రపరుచుకోవడానికి గదుల్లో ఉన్న ర్యాకులు పనికిరాకుండా పోయాయి. పిల్లలు చెట్ల కింద కూర్చొని భోజనం చేస్తున్నారు. మరుగుదొడ్ల నిర్వహణ లేకపోవడంతో  అపరిశుభ్రంగా మారాయి. దంతాలపల్లి మండల కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతి గృహంలోనూ అనేక సమస్యలు తిష్టవేశాయి. వీటన్నింటినీ త్వరితగతిన పరిష్కరించాలని విద్యార్ధులు, తల్లితండ్రులు, విద్యార్ధి సంఘం నేతలు విజ్ఞప్తిచేస్తున్నారు.  

Related Posts