YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

2029 మిత్రులెవరు..శత్రువులెవరు...

2029 మిత్రులెవరు..శత్రువులెవరు...

విజయవాడ, జూన్ 28,
2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మేలి మలుపును తిప్పాయి. సూపర్ సీనియర్ అయిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ఉండవచ్చు కానీ రాజకీయాల్ని మలుపు తిప్పింది. ఇప్పుడు ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది యువనేతలే. కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు.. రాజకీయంగా ఎదురుదెబ్బలు తిన్నా ముందడుగు వేసిన వారు అనేక మంది యువనేతలు ఈ సారి అటు లోక్ సభలో.. ఇటు అసెంబ్లీలో అడుగు పెట్టారు. ముందు ముందు  1980 బ్యాచ్ పొలిటీషియన్లు అంతా సైడ్ కానున్నారు. యువత ముందుకు రానున్నారు. అది ఎమ్మెల్యే , ఎంపీల స్థాయిలోనే కాదు.. రాష్ట్రాన్ని నడిపేందుకు కూడా యువనేతలే పోటీ పడనున్నారు. అలాంటి వారిలో ముగ్గురు ఇప్పుడు మన ముందు ఉన్నారు. టీడీపీ యువనేత నారా లోకేష్, జనసేన చీఫ్ వపన్ కల్యాణ్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. రాజకీయాల్లో మిత్రుత్వం, శత్రుత్వం శాశ్వతం కాదు.  అందరికీ అత్యున్నత స్థానానికి చేరాలని ఉంటుంది. అందుకే ఇప్పుడు ఉన్న  మిత్రుత్వాల్ని, శత్రుత్వాన్ని పక్కన పెడితే.. భవిష్యత్ రాజకీయం ఎలా ఉంటుందని ఊహిస్తే.. ఊహకంతనంగా  టఫ్‌గా ఉండబోతోందని అంచనా వేయవచ్చు. చంద్రబాబునాయుడు వయసు 74 ఏళ్లు, వచ్చే ఎన్నికల నాటికి 80 చేరుతుంది. ఎంత ఫిట్‌గా ఉన్నా.. వయసు మాత్రం మీద పడినట్లే. ఆయన రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నా సరే తెలుగుదేశం పార్టీని నడిపించే ప్రత్యామ్నాయ నాయకుడ్ని తెరపైకి తేవాల్సిందే. ఇప్పటికే నారా లోకేష్ పార్టీపై పట్టు సాధించారు. ఎన్నో ట్రోలింగ్స్ ను ఎదుర్కొని యువగళం పాదయాత్ర ద్వారా పార్టీ విజయంలో తన వంతు పాత్ర నిర్వహించారు. ఇప్పటికీ నారా లోకేష్ వయసు కేవలం 41 సంవత్సరాలు మాత్రమే. ఆయన రాజకీయంగా తనను తాను ఫ్రూవ్ చేసుకునేందుకు రెడీగా ఉన్నారు. పరిపాలనా పరంగా.. పార్టీని క్రమబద్దంగా నడిపించే విషయంలోనూ .. కష్టపడే అంశంలోనూ ఆయన నాయకత్వ లక్షణాలు నిరూపించుకున్నారు. ఓడిపోయిన మంగళగిరిలో.. తన సొంత సామాజికవర్గం లేనప్పటికీ 90వేలకుపైగా  మెజార్టీతో గెలవడం అంటే... చిన్న విషయం కాదు. ఐదేళ్ల పాటు క్రమబ్దదంగా పని చేశారు. అలాంటి ప్రణాళికలు ఆయన వద్ద చాలా ఉన్నాయి. అయితే ఇప్పటికిప్పుడు తాను వారసుడ్ని అయిపోవాలని లోకేష్ కూడా అనుకోవడం లేదు. గెలుపులో క్రెడిట్ కోసం కూడా ఆశపడలేదు. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని తన ఇమేజ్ ను అంతకంతకూ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో టాప్ స్పాట్ అంటే సీఎం పీఠానికి గట్టిగా పోటీ పడే నాయకుల్లో లోకేష్ ముందు వరుసలో ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
రాజకీయాల్లోకి అందరూ వచ్చేది అత్యున్నత స్థానం చేరుకోవడానికే. పవన్ కల్యాణ్ మొదటి అడుగుల్లో తడబడి ఉండవచ్చు కానీ.. రాజకీయం ఎలా చేయాలో అర్థం చేసుకున్న తర్వాత ఆయన మొదటి అడుగు విజయవంతంగా వేశారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు.  కానీ రాబోయే రోజుల్లో తాను..తన పార్టీని ఆ స్థాయిలోనే ఉంచారని అనుకోరు. ఖచ్చితంగా ఎదగాలని అనుకుంటారు. ఆయన పార్టీ ఎదిగితే తమ పార్టీని తగ్గించుకోవాలని టీడీపీ అనుకోదు. అది  వేరే రాజకీయం. ఇప్పటికిప్పుడు పవన్ ముందున్న లక్ష్యం.. తనను తాను మంచి పాలకుడిగా ప్రజల ముందు నిరూపించుకోవడం. తన చేతికి ముఖ్యమంత్రి పీఠం వచ్చినా సమర్థంగా పని చేస్తానని.. తనపై ఉన్న అంచనాలకు తగ్గట్లుగా పనితీరు కనబరుస్తానని అందరికీ చూపించగలగడం లక్ష్యం. అదే పనిలో ఉన్నారు. అలాగే  పార్టీని బలోపేతం చేసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకూ పవన్ కు పార్టీ ఉంది. లీడర్లు కానీ క్యాడర్ కానీ లేరు. అభిమానుల బలాన్ని.. పొత్తుల ద్వారా పూర్తి స్థాయిలో ప్రయోజనకరంగా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇక ముందు పార్టీని .. క్యాడర్ ను..లీడర్లను డెలవప్ చేసుకోవాల్సి ఉంది. వచ్చే పదేళ్ల పాటు టీడీపీతో అనుబంధం కొనసాగాలని ఆయన ఎన్నికలకు ముందే చెప్పారు. అంటే ఆయన వచ్చే ఎన్నికల నాటికి కూడా టీడీపీతోనే కూటమితోనే ఉండాలనుకుంటున్నారు. రాజకీయంగా ఏం జరుగుతుందో చెప్పలేము కానీ..ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకోవాలన్న కోరిక ఆయనలోనూ బలంగా ఉంటుంది. వచ్చే ఐదేళ్లు లేదా పదేళ్ల తర్వాత చూస్తే.. ఆ సీటు కోసం పోటీ పడేవాళ్లలో పవన్ కల్యాణ్ అగ్రభాగంలో కనిపిస్తూనే ఉంటారు. అది సొంతంగా అయినా... లేకపోతే పొత్తుల ద్వారా అయినా సరే. యాభై ఐదేళ్ల  పవన్ కల్యాణ్ బలమైన ప్రజెన్స్ లేని రాజకీయాలను వచ్చే ఇరవై ఏళ్ల పాటు ఊహించలేం. జగన్మోహన్ రెడ్డి తానే 2029లో సీఎం అని అనుకుంటున్నారు. ఆయనకు సీట్ల పరంగా ఎన్ని తక్కువ సీట్లు వచ్చినా ఓటింగ్ మాత్రం నలభై శాతం వచ్చింది. విపక్ష పార్టీలన్నీ కలిసి పోటీ చేయడం వల్ల కన్సాలిడేషన్ జరిగింది. అధికారంలో ఉన్న పార్టీకి పథకాలు.. ఇతర వర్గాల మద్దతు ఉంది. ఈ కారణంగా ఆయన బలమైన నేతగానే ఉన్నారు. అయితే ఇప్పటికే ఐదేళ్లు సీఎంగా చేశారు. ఆయన పనితీరుకు మైనస్ మార్కులు పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి బలంగా ముందుకు వస్తానని అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి లోకేష్, పవన్ కల్యాణ్‌ల కన్నా ఎక్కువ సవాళ్లు ఉన్నాయి. ముందుగా పార్టీని కాపాడుకోవాలి. కేసుల నుంచి బయటపడాలి.. అంతకు మించి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ముప్పును తప్పించకోగలగాలి. ఇటీవలి ఎన్నికల్లో రాయలసీమలో ఓటింగ్ సరళి చూస్తే.. దళిత ముస్లిం ఓట్లు భారీగా కాంగ్రెస్ కు  పడ్డాయి. ఈ కారణంగా కడపసిటీ వంటి చోట్ల వైసీపీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. తనకు ఉన్న అక్రమాస్తుల కేసులను తప్పించుకోవడం అంత సులువు కాదు. పదేళ్లకుపైగా ట్రయల్‌కు రావడం లేదని కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యే పరిస్థితి ఉంది. వాటి సంగతి త్వరగా తేల్చే సే అవకాశాలు ఉన్నాయి. గత ఐదేళ్ల పాలనలో మద్యం , ఇసుక, గనులు వంటి వాటి విషయాల్లో కొత్త విచారణలు జరగబోతున్నాయి. మరో వైపు పార్టీ నేతల్ని కాపాడుకోవాల్సి ఉంది. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ఉత్తారంధ్ర నుుంచి గుంటూరు వరకూ ఆ పార్టీల అభ్యర్థులకు వచ్చిన మెజార్టీలు చూస్తే.. వైసీపీ కోలుకోవం కష్టమన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదే టీడీపీ, జనసేన వేర్వేరుగాపోటీ చేస్తే ఆ రెండు పార్టీల మధ్యనే  పోరాటం జరుగుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే జగన్ ముందు వచ్చే ఐదేళ్లు ఎన్నో సవాళ్లు ఉంటాయి. వాటన్నింటినీ ఎదుర్కొంటూ నిలబగలిగితే... అత్యున్నత పీఠాన్ని దక్కించుకునే రేసులో ఆయన కూడా ఉంటారు. తనకు వయసు అయిపోలేదని సత్తువ ఉందని ఆయన క్యాడర్ కు చెబుతున్నారు. జగన్ వయసు 51 ఏళ్లే. ప్రస్తుతం చంద్రబాబు సీఎంగా ఉన్నారు. పవన్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. లోకేష్ కీలక శాఖల మంత్రిగా ఉన్నారు. కానీ ఆయన పవన్ కంటే ఎక్కువ పవర్స్  కలిగి ఉంటారని  చెప్పాల్సిన పని లేదు. పవన్ కల్యాణ్ తన శాఖలకే పరిమితమవుతారు..కానీ లోకేష్ దాదాపు అన్ని శాఖల బాధ్యతలను అనధికారికంగా చూస్తారు. చంద్రబాబు పూర్తిగా పెట్టుబుడులు..అమరావతి, పోలవరం వంటి వాటి మీద దృష్టి పెట్టవచ్చు. అయితే రాబోయే కాలంలో రాజకీయంలో తన పాత్రేమిటి అని పవన్ విశ్లేషించుకుంటే సీఎం పీఠానికి తనను తాను పోటీదారునిగా మార్చుకునేందుకు వీలైనంత వేగంగా పావులు కదిపే అవకాశం ఉంది. అతి వచ్చే ఎన్నికల నాటికి జరుగుతుందా.. ఆ తర్వాత జరుగుతుందా అన్నది చెప్పలేము. చంద్రబాబు రిటైరయ్యే పరిస్థితి వస్తే.. వచ్చే ఐదేళ్లకో పదేళ్లకో ఖచ్చితంగా సీఎం రేస్ ఉంటుంది. లోకేష్ సీఎం అయితే  పవన్ లైట్ తీసుకోరు. తానే సీఎం కావాలనుకుంటారు.  వీరికి  పోటీగా జగన్మోహన్ రెడ్డి ఉండనే ఉంటారు. అందుకే భవిష్యత్‌లో జరగబోయే రాజకీయాల్లో ఎవరు మిత్రులు.. ఎవరు ప్రత్యర్థులు  అన్నది అంచనా వేయడం ఇప్పుడు కష్టం. కానీ ఏపీ రాజకీయాల్లో మాత్రం బలమైన యువనేతల ముద్ర స్పష్టంగా కనిపించబోతోందని  అనుుకోవచ్చు.

Related Posts