విజయవాడ, జూన్ 28,
ఏపీలో మరో ఎన్నిక జరగనుంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి రామచంద్రయ్య, ఇక్బాల్ టిడిపిలో చేరారు. దీంతో వారిపై అనర్హత వేటు పడింది. ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. వచ్చే నెలలో ఎన్నిక నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు పై దృష్టి పెట్టారు చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో కూటమి 166 స్థానాల్లో విజయం సాధించడంతో.. ఇక ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలన్నీ కూటమి సొంతం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఏపీలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీలకు సంబంధించి ఉప ఎన్నికలకు ఈసీ ఏర్పాటు చేస్తోంది. మరోవైపు అభ్యర్థుల ఎంపిక సైతం ఒక కులిక్కి వచ్చినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో చాలామంది నేతలకు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్సీల భర్తీ ప్రక్రియ పై కసరత్తు కొనసాగుతోంది. సూత్రప్రాయంగా అభ్యర్థుల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ తో చర్చించి ఆయన ఆమోదం సైతం చంద్రబాబు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పవన్ కోసం సీటు త్యాగం చేసిన టిడిపి ఇన్చార్జ్ వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు అప్పట్లో హామీ ఇచ్చారు. అందుకే ఈసారి తొలి ఛాన్స్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీనికి పవన్ సైతం ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. పవన్ కు పిఠాపురంలో భారీ మెజారిటీ దక్కడం వెనుక వర్మ కృషి ఉంది. అందుకే వర్మ విషయంలో పవన్ సైతం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వర్మ అభ్యర్థిత్వం దాదాపు ఖరారు అయినట్టే.అయితే రెండు ఎమ్మెల్సీ పదవి పై తీవ్ర కసరత్తు జరిగింది. ముందుగా వంగవీటి రాధాకృష్ణ పేరు వినిపించింది. అయితే ఆయనకు తర్వాత చాన్స్ ఇద్దామని.. ఈసారి రాయలసీమ ముస్లిం నేతకు అవకాశం ఇస్తే బాగుంటుందని చంద్రబాబుతో పాటు పవన్ అభిప్రాయపడినట్లు సమాచారం. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరే క్రమంలో పదవి కోల్పోయిన ఇక్బాల్ కే మరోసారి అవకాశం ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచనగా సమాచారం. ఇక్బాల్ అభ్యర్థిత్వంపై బిజెపి నేతల నుంచి సైతం అభిప్రాయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక్బాల్ అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గానికి చెందిన నేత. ఎన్నికల్లో వైసీపీ టికెట్ ను ఆశించారు. కానీ హై కమాండ్ నమ్మించి మోసం చేసింది. దీంతో ఆయన టిడిపిలోకి ఫిరాయించారు. ఆయనపై అనర్హత వేటు వేసింది వైసిపి. పదవి కోల్పోయిన ఇక్బాల్ కు మరో ఛాన్స్ ఇస్తే.. మైనారిటీలకు ఒక రకమైన సంకేతం వెళ్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.