YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చిన్నమ్మకు కలిసి రాని కాలం

చిన్నమ్మకు కలిసి రాని కాలం

విజయవాడ, జూన్ 28,
కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్నికలకు ముందుగానే కూటమి ఏర్పడటంతో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో పదవుల పంపిణీ జరిగిపోయింది. కేంద్ర, రాష్ట్ర కేబినెట్ లో అన్ని పార్టీలకూ అవకాశం కల్పించారు కేంద్ర ప్రభుత్వంలో జనసేనకు అవకాశమివ్వకపోయినా కూటమిలోని టీడీపీకి మాత్రం రెండు పదవులు లభించాయి. తెలంగాణలో ఎనిమిది స్థానాలను గెలవడంతో ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. ఏపీలో మూడు పార్లమెంటు స్థానాలు దక్కడంతో ఒకే ఒక్కరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆరుగురు గెలిచినా ఒక్కరికే రాష్ట్ర కేబినెట్ లో చోటు దక్కింది. ఈ లెక్కలన్నీ ఏం చెబుతున్నాయంటే... బలాబలాలను బట్టి, సామాజికవర్గాలను ప్రధానంగా తీసుకుని కేబినెట్ లో స్థానం కల్పించారు. అయితే ఎన్నికల ముందు నుంచి కూటమి ఏర్పాటు కాకమునుపే ఈసారి దగ్గుబాటి పురంద్రీశ్వరి విజయం సాధిస్తే ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి లభిస్తుందని ప్రచారం పెద్దయెత్తున జరిగింది. ఎందుకంటే ఆమె రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి మంత్రి పదవి దక్కడంతో ఏపీలోనూ అదే ఫార్ములాను బీజేపీ కేంద్ర నాయకత్వం అనుసరిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ కేంద్ర కేబినెట్ లో పురంద్రీశ్వరికి స్థానం దక్కలేదు. అనూహ్యంగా నరసాపురం నుంచి తొలిసారి విజయం సాధించిన భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేబినెట్ పదవి లభించింది. ఇది ఎవరూ ఊహించని విషయం. ఆయన కూడా ఊహించలేదు. తొలిసారి గెలిచిన తనకు కేంద్ర మంత్రి పదవి ఎందుకు వస్తుందని ఆయన భావించి ఉండవచ్చు కానీ ఏపీ సామాజిక పరిస్థితుల దృష్ట్యా పురంద్రీశ్వరికి కేంద్ర కేబినెట్ లో స్థానం దక్కలేదని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కేంద్ర మంత్రులు పొందిన వారిలో పెమ్మసాని చంద్రశేఖర్ కమ్మ సామాజికవర్గం కావడంతో అదే సామాజికవర్గానికి మరో కేంద్ర మంత్రి పదవి ఎందుకు ఇవ్వడం అని నాయకత్వం భావించారని కూడా అంటున్నారు. మరో వైపు పురంద్రీశ్వరికి వ్యతిరేకంగా కొందరు కేంద్రనాయకత్వంపై వత్తిడి తెచ్చారని, బీజేపీ నేతల్లోనే కొందరు ఆమెకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వవద్దని చెప్పడంతో నాయకత్వం వెనక్కు తగ్గిందంటున్నారు. కొందరు సీనియర్ నేతలు ఆమెకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి పార్టీని సుదీర్ఘకాలం నుంచి నమ్ముకున్న వారిని అన్యాయం చేయవద్దని గట్టిగా కోరడంతో పార్టీ హైకమాండ్ కూడా ఆలోచించి చిన్నమ్మకు చేయి ఇచ్చినట్లు రాష్ట్ర బీజేపీలో గుసగుసలు వినపడుతున్నాయి.. పురంద్రీశ్వరికి స్పీకర్ పదవి దక్కుతుందని పెద్దయెత్తున ప్రచారం జరిగింది. మహిళ స్పీకర్ కు అవకాశం కల్పించడంలో భాగంగా పురంద్రీశ్వరిని ఎంపిక చేస్తారనుకున్నారంతా. కానీ చివరకు ఓంబిర్లా స్పీకర్ అయ్యారు. దీంతో ఇప్పట్లో చిన్నమ్మకు ఏ పదవి కేంద్ర ప్రభుత్వంలో లేనట్లేనని ఆమె సన్నిహితులు ఆవేదన చెందుతున్నారు. తర్వాత మంత్రి వర్గ విస్తరణ జరిగితే అవకాశముంటుందన్న ఆశతో ఉన్నామని వారంటున్నారు. అయితే అక్కడ ఉన్న మోదీ, అమిత్ షా లెక్కలు వేరుగా ఉంటాయి. అందుకే పురంద్రీశ్వరికి పదవి అనేది ఈ దఫా దొరకడం దుర్లభమనేని అన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. అతి గా ప్రచారం జరిగి.. చివరకు పురంద్రీశ్వరికి ఏ పదవి దక్కకపోవడంతో ఆమె అనుచరులు నిరాశకు గురయ్యారు.

Related Posts