ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికీ, ఎప్పటికీ చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడుతూ... బడుగుల జీవితాల్లో అంబేడ్కర్, ఎన్టీఆర్ వెలుగులు నింపారని, వారి బాటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పయనిస్తున్నారని అన్నారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో తెదేపా గెలుపు ఖాయంగా కనిపిస్తోందన్నారు. నాలుగేళ్లు ఓపికగా చూశాకే ఎన్డీయే నుంచి తాము బయటకు వచ్చామని లోకేశ్ తెలిపారు. తెలుగుజాతితో పెట్టుకున్నందునే కర్ణాటకలో ప్రజలు భాజపాకు గుణపాఠం చెప్పారని.. ఆంధ్రప్రదేశ్లోనూ ఆ పార్టీకి బుద్ధిచెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. 2019లో అసలైన సినిమా రాబోతోందని లోకేశ్ వ్యాఖ్యానించారు.