YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గుంటూరు టూ విజయవాడ వయా కేరళ పవన్ ఓఎస్డీగా కృష్ణతేజ

గుంటూరు టూ విజయవాడ వయా కేరళ పవన్ ఓఎస్డీగా కృష్ణతేజ

విజయవాడ, జూన్ 29,
సివిల్స్‌ ర్యాంకు సాధించడం మామూలు విషయం కాదు. పక్కా ప్రణాళిక, సబ్జెక్టుపై పట్టు… పరీక్ష రాయడంలో నేర్పరితనం.. ఇంటర్వ్యూలో తెలివిగా సమాధానం చెప్పడం.. ఇలా అన్నీ కలిసి వస్తేనే సివిల్స్‌ ర్యాంకు సాధ్యమవుతుంది. ఇందుకోసం ఏటా వేలాది మంది కోచింగ్‌ తీసుకుంటున్నారు. 24 గంటల్లో 20 గంటలు పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. తెలుగు ఐఏఎస్‌ మైలవరపు కృష్ణ తేజ కూడా ఇలాగే సివిల్స్‌ కోసం పట్టు విడవని విక్రమార్కుడిలా ప్రయత్నించాడు. నాలుగో ప్రయత్నంలో 66వ ర్యాంకు సాధించాడు. కేరళ రాష్ట్ర క్యాడర్‌కు ఎంపికై అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్‌కు డిప్యుటేషన్‌పై రానున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం కె.పవన్‌ కళ్యాణ్‌కు ఓఎస్‌డీగా పనిచేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట కృష్ణతేజ సొంత ఊరు. వైశ్య సామాజికవర్గానికి కృష్ణతేజ తల్లిదండ్రులు చిలకలూరిపేట వారే. తండ్రి మైలవరపు శివానందకుమార్‌ వ్యాపారం చేస్తారు. తల్లి భువనేశ్వరి గృహిణి. తేజ తాత రామానందం. చిలకలూరిపేటలో రామానందం అనేక సేవా కార్యక్రమాలు చేసి పలువురి ప్రశంసలు పొందారు. ఆ కుటంబ వారసునిగా కృష్ణ తేజకు కూడా సేవా కార్యక్రమాలంటే చాలా ఇష్టం. చదువులోనూ ఎప్పుడూ ముందుండే వారు. ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరారు. ప్రధానమైన పట్టణాల్లో పనిచేశారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉద్యోగం జీతం డబ్బుల కోసమేనని, సేవలు చేసేందుకు పనికి రాదని గుర్తించారు.సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి సివిల్స్‌ కోచింగ్‌ తీసుకునేందుకు 2011లో ఢిల్లీ వేళ్లారు కృష్ణతేజ. కోచింగ్‌ తీసుకన్నప్పటికీ మూడు ప్రయత్నాల్లో సివిల్స్‌లో విఫలమయ్యాడు. చిన్నతనం నుంచి చదువులో ముందు ఉండే కృష్ణతేజ సివిల్స్‌లో ఎందుకు విఫలం అవుతున్నాడో అంతు చిక్కలేదు. ఈ క్రమంలో తన మిత్రులను కలిసి తనలోని లోపాల గురించి అడిగి తెలుసుకున్నాడు. వారు కూడా అంతా బాగానే ఉంది అని చెప్పారు. దీంతో ఇక సివిల్స్‌ తన వల్ల కాదనుకున్నాడు. ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తన మిత్రులకు చెప్పాడు. ఈ విషయం కృష్ణతేజ శత్రువులకు కూడా తెలిసింది.
లోపాలు ఎత్తి చూపిన శత్రువులు..
కృష్ణతేజ డ్రాప్‌ అవుతున్నట్లు తెలుసుకున్న ఆయన శత్రువులు మరుసటి రోజు ఆయన వద్దకు వచ్చారు. కంగ్రాట్స్‌ చెప్పారు. ఎంతో సంతోషంగా కనిపించారు. దీంతో కృష్ణతేజలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అయినా దిగమించుకుని ఎందుకు శుభాకాంక్షలు చెబుతున్నారని శత్రువులను అడిగాడు. వారు కీలకమైన మూడు విషయాలు తెలిపారు. అవే కృష్ణ తేజను విజయంవైపు నడిపించాయి.
బ్యాడ్‌ హ్యాండ్‌ రైటింగ్‌..
శత్రువులు చెప్పిన కృష్ణ తేజ మైనస్‌ పాయింట్లలో మొదటిది ఇది. సివిల్స్‌ ర్యాంకులో హ్యాండ్‌ రైటింగ్‌ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కృష్ణతేజ బాగా చదివినా దానిని ప్రజెంట్‌ చేయడంలో రైటింగ్‌ లోపం ఉన్నట్లు తెలిపారు.
ఇక కృష్ణతేజలో ఉన్న మరో లోపం.. డిస్క్రిప్షన్‌ రాయడంలో లోపం. ప్రశ్నకు సమాధానం రాయడంలో పాయింట్‌ వైజ్‌గా రాస్తాడు. కానీ సివిల్స్‌లో స్టోరీలా సాగిపోవాలి. పేరాగ్రాఫ్‌ వైజ్‌గా ఉండాలి.
ఇక కృష్ణతేజలో మూడో మైనస్‌ సూటిగా సమాధానం చెప్పడం. ఇంటర్వ్యూలో ఆయన చెప్పే సమాధానం సూటిగా ఉండడం కూడా సమస్యగా అవుతుందని తెలిపారు.
ఆ మూడు మార్చుకుని…
తన శత్రువులు చెప్పిన లోపాలు తనలో ఉన్న మాట వాస్తవమే అని గమనించిన కృష్ణతేజ.. వాటిని సవరించుకుని మరో ప్రయత్నం చేయాలనుకున్నాడు. ఇందుకోసం 365 రోజులు కష్టపడ్డాడు. చివరకు 2015లో సివిల్స్‌లో 66వ ర్యాంకు సాధించాడు. శిక్షణ అనంతరం ప్రభుత్వం కేరళ క్యాడర్‌కు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌పై అభిమానం ఉన్నా కేరళ వెళ్లక తప్పలేదు. 2017లో కేరళ క్యాడర్‌లో అలెప్పీ జిల్లా సబ్‌ కలెక్టర్‌ గా నియమితులయ్యారు. చాలా తక్కువ సర్వీస్‌ లోనే దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు.2018లో వచ్చిన కేరళ వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ఆ వరదల భారిన పడిన జిల్లాల్లో అలెప్పీ ఒకటి. వరదల సమయంలో అలెప్పీ జిల్లాకు సబ్‌ కలెక్టర్‌గా ఉన్న కృష్ణ తేజకు అదే ఫస్ట్‌ పోస్టింగ్‌. కేరళ కుట్టునాడు ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాతయనే ముందస్తు సమాచారం కృష్ణ తేజకు అందింది. వెంటనే ఆపరేషన్‌ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. లోతట్టు ప్రాంతాలకు చెందిన 2.5 లక్షల మందిని 48 గంటల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. పై అధికారులకు ఏం జరిగిందో తెలిసేలోపే స్థానిక యువతతో కలిసి 48 గంటల్లో రెండున్నర లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆపరేషన్‌ కుట్టునాడు సూపర్‌ సక్సెస్‌. ఇక స్వయంగా ఈ రెసూ‍్క్య ఆపరేషన్‌లో పాల్గొన్న కృష్ణ తేజ లోతట్టు ప్రాంత ప్రజలను కాపాడగలిగారు. ఐఏఎస్‌ అధికారిగా ఆయన సాధించిన మొదటి విజయం. దీంతో నాడు పవన్‌ కళ్యాన్‌ దృష్టిలో పడ్డారు.వరదలు తగ్గాక బాధితలకు ఏదైనా చేయాలనుకున్నాడు. ‘ఐయామ్‌ ఫర్‌ అలెప్పీ’ పేరుతో ఓ ఫేస్‌ బుక్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఇది ఎంతో మంది కేరళ వాసులను ఆకర్షించింది. అలెప్పీకి తమ వంతు సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారటంతో వేరే రాష్ట్రాల నుంచి అలెప్పీ కోసం సాయాన్ని అందించేందుకు ఎంతో మంది ముందుకు వచ్చారు. పడవలు కోల్పోయిన వారికి జోవనోపాధి కోసం పడవలు, నిత్యావసర సరుకులు, స్కూళ్లను తిరిగి కట్టడం, ఇళ్లు కోల్పోయిన బాధితులకు సొంత ఇంటిని కట్టించి ఇవ్వటం ఐయామ్‌ ఫర్‌ అలెప్పీ ఓ ఫేస్‌ బుక్‌ సాధించిన విప్లవం అంతా ఇంతా కాదు. యునిసెఫ్‌ లాంటి సంస్థల దృష్టిని ఆకర్షించి వాళ్లే పేజ్‌ను మెయింటైన్‌ చేశారు.కేరళ అంటేనే పర్యాటకం. అలాంటి పర్యాటక శాఖకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ గా నియమితులైన కృష్ణతేజ ఆ శాఖలోనూ తనదైన మార్క్‌ చూపించారు. ‘మిషన్‌ ఫేస్‌ లిఫ్ట్‌’ పేరుతో పర్యాటకులను ఆకర్షించేలా పాడుబడిపోయిన టూరిజం హోటళ్లను మోడ్రనైజ్‌ చేయించారు. రిసార్టులను అభివృద్ధి చేయటంతోపాటు మాయా పేరుతో ఓ చాట్‌ బోట్‌ చేయించి కేరళ టూరిజం కోసం వచ్చే పర్యాటకులను గైడ్‌ చేసేలా సాంకేతికతను రూపొందించటంలో సక్సెస్‌ అయ్యారు. క్యారవాన్‌ కేరళ పేరుతో ఓ చిన్న క్యారవాన్‌ను అద్దె తీసుకుని కేరళలో నచ్చిన ప్రాంతానికి మీ కుటుంబంతో సహా తిరిగిరండి అంటూ ఆయన తీసుకువచ్చిన మరో ఆలోచన కేరళ టూరిజంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది.

Related Posts