విజయవాడ, జూన్ 29,
వైసిపి ముఖ్య నేతలపై రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసిందా? గత ఐదేళ్లలో వైసిపి నేతలపై నమోదైన కేసుల స్టేటస్ రిపోర్టు కోరిందా? ముఖ్య కేసులను రీఓపెన్ చేస్తోందా? అదే జరిగితే వైసిపి ముఖ్య నేతల చుట్టూ ఉచ్చు బిగియనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఈ పాత కేసుల్లో సజ్జలతో సహా వైసిపి కీలక నేతలు ఉన్నారు. దీంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ సర్కార్ హయాంలో రాజకీయంగా అనేక కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల వివరాలు పైన కొత్త ప్రభుత్వం ఆరా తీస్తోంది.ఉండవల్లి లోని చంద్రబాబు ఇంటిపై మాజీ మంత్రి జోగి రమేష్ దండయాత్ర చేసిన సంగతి తెలిసిందే. అప్పటి సీఎం జగన్ పై చంద్రబాబు కామెంట్స్ చేశారని ఆరోపిస్తూ భారీ వాహన శ్రేణితో ఉండవల్లి లోని చంద్రబాబు నివాసం పై జోగి రమేష్ దండయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టిడిపి నేతలు ప్రతిఘటించారు కూడా. అయితే అప్పట్లో చిన్నపాటి కేసు మాత్రమే నమోదయింది. ఇప్పుడు అదే కేసులో జోగి రమేష్ తో పాటుగా వైసిపి ముఖ్య నేతలపై విచారణ జరిగే అవకాశం ఉంది.టిడిపి కేంద్ర కార్యాలయం పై వైసీపీ శ్రేణులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పార్టీ కార్యాలయంలో అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం అయింది. అప్పట్లో సంచలనంగా మారింది. దేవినేని అవినాష్, అప్పి రెడ్డి కను సన్నల్లో ఈ దాడి జరిగినట్లు అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. ఆ సమయంలోనే సీఎంగా ఉన్న జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు బీపీ వస్తే ఇలాంటి ఘటనలే జరుగుతాయని తేలిగ్గా మాట్లాడారు. డిజిపి సైతం చిన్నపాటి ఘటనగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ కేసు విషయంలో సైతం పోలీసులు పట్టు బిగించే అవకాశం ఉంది. దేవినేని అవినాష్ తో పాటు అప్పిరెడ్డి పై ఉక్కు పాదం మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు విజయవాడలో టిడిపి నేత పట్టాభి ఇంటిపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసు సైతం మళ్లీ తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.గత ఐదు సంవత్సరాలుగా జరిగిన ప్రతి పరిణామాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. తనను చంపమని ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న సభ్యుల రామకృష్ణారెడ్డి ప్రోత్సహించారంటూ ఉద్యోగ సంఘ నేత సూర్యనారాయణ చేసిన ఆరోపణల పై సైతం పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా కేంద్రంగా చోటు చేసుకున్న రాజకీయ దాడులపై విచారణ ప్రారంభం కానుంది. కరోనా సమయంలో వివాదాస్పదంగా మారిన డాక్టర్ సుధాకర్ మరణం, అధికారులపై దాడులు వంటి వాటిపై పోలీస్ విచారణ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా పరిణామాలతో వైసీపీలో ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది.