YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆదివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

ఆదివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

హైదరాబాద్ జూన్ 29,
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌లో డీఎస్ కీలక పాత్ర పోషించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఏపీ సీఎం చంద్రబాబు  సైతం డీఎస్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. డీఎస్ సుదీర్ఘ కాలం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని.. ఎప్పుడూ హుందాగా రాజకీయాలు చేసేవారని గుర్తు చేసుకున్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం పని చేశారని పేర్కొన్నారు. డీఎస్ పార్థీవ దేహానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు, పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన పార్థీవదేహానికి నివాళులర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డీఎస్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. డీఎస్ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజా సేవకే అంకితమయ్యారని.. 2004- 2009 వరకూ అసెంబ్లీలో ఆయన ప్రోత్సాహం మరువలేనిదని అన్నారు. డీఎస్ మృతి పట్ల మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో డీఎస్ ట్రబుల్ షూటర్‌గా పేరొందారని.. ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు డీఎస్ పార్థీవ దేహానికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రిగా, ఎంపీగా డీఎస్ సుదీర్ఘ కాలం సేవలందించారని పేర్కొన్నారు.డీఎస్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. డీఎస్ పార్థీవ దేహాన్ని ఆస్పత్రి నుంచి బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన స్వగృహానికి తరలించి.. మధ్యాహ్నం 2 గంటల వరకూ ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డీఎస్ కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు డీఎస్ భౌతిక కాయాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం నిజామాబాద్ తరలిస్తారు. ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Related Posts