విజయవాడ, జూలై 2,
వైసీపీ అధినేత జగన్ నెక్ట్స్ ప్లాన్ ఏంటి? ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని టీడీపీ చెప్పడంతో ఆయన అసెంబ్లీకి వస్తారా? నేతలకు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? ఇవే ప్రశ్నలు ఫ్యాన్ పార్టీ కార్యకర్తలను వెంటాడుతున్నాయి.ఏపీ మాజీ సీఎం జగన్ మంగళవారం బెంగుళూరు నుంచి నేరుగా విజయవాడకు వచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి తాడేపల్లికి చేరుకోనున్నారు. అధినేత రావడడంతో గన్నవరం ఎయిర్ పోర్టులో భారీగా స్వాగతం పలికారు. జూన్ 22న తాడేపల్లి నుంచి పులివెందులకు వెళ్లారు జగన్. మూడురోజులు ప్రజలు, నాయకులతో సమావేశమయ్యారు. 24న సతీసమేతంగా బెంగళూరుకు వెళ్లారు.టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలను క్షుణ్నంగా గమనించారు జగన్. అధికారులను మార్చివేయడం, వైసీపీకి తొత్తుగా వ్యవహరించిన అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా దూరంగా పెట్టారు. ఈ క్రమంలో జగన్‌కు ఆయన వేగులు ఈ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంకో వైపు ప్రస్తుతం జగన్‌కు ఉన్న సెక్యూరిటీని కుదించాలనే ఆలోచన చేస్తోంది టీడీపీ సర్కార్. ఎక్కడికి వెళ్లినా భద్రత కోసం చట్టం తెచ్చుకున్నారాయన. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆ చట్టానికి మార్పులు చేయాలని భావిస్తోంది టీడీపీ ప్రభుత్వం.ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ నేతలు జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ముఖ్యనేతలతో టచ్‌లోకి వెళ్లారు. మంతనాలు కూడా సాగించారు. దీనిపై జగన్ వద్ద రిపోర్టు ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం తాడేపల్లి వచ్చాక నేతలతో మీటింగ్ పెట్టాలని ఆలోచన చేస్తున్నారట జగన్. రానివారు పార్టీకి దూరం అవుతారనే భావిస్తున్నారట.జగన్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పటీ, మరో ఆరునెలలు వాయిదా వేసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఇప్పుడే రావడంతో అప్పుడే ప్రజల్లోకి వెళ్లడం కరెక్టు కాదని అంటున్నారు. ఏడాది తర్వాత వెళ్తే.. టీడీపీ స్కీమ్‌ల వ్యవహారాన్ని బయటపెట్టవచ్చని అంటున్నారు. ఈ లెక్కన ఓపెన్‌గా టీడీపీ ప్రభుత్వంపై స్టేట్‌మెంట్ చేయకుండా x ద్వారా రియాక్ట్ అయితే బెటరన్నది ఆ పార్టీ అంతర్గత సమాచారం.