తెలుగుజాతి విశిష్టతను, కీర్తిని వారసత్వాన్ని అందిపుచ్చుకొనే క్రమంలో ప్రవాసాంధ్రుల పిల్లలు తప్పనిసరిగా తెలుగునేర్చుకోవడం అత్యవసరమని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. అమెరికా వచ్చి స్థిరపడ్డ ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు తెలుగు నేర్పించాలని, తద్వారా తెలుగుజాతి వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో వున్న మంత్రి గంటా కాలిఫోర్నియా రాష్ట్రంలోని మిల్పిల్ థస్ కమ్యూనిటి సెంటర్ లో జరిగిన పాఠశాల సంస్థ వసంతతోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తమ పిల్లలు అమెరికా వచ్చి స్థిరపడినందుకు అక్కడ వున్న పెద్దవాళ్లు సంతోషపడుతున్నారని, అదే తమ మనవళ్లు, మనవరాళ్లు తెలుగు మాట్లాడటం రాకపోవడంతో బాధపడుతున్నారని అన్నారు. తెలుగును పిల్లలకు నేర్పి వారి తాత, అమ్మమ్మలతో మాట్లాడేలా .. తెలుగుజాతి సంస్కృతిని వారికి పరిచయం చేయాలన్నారు. తెలుగును నేర్పించడంలో పాఠశాల సంస్థ చేస్తున్న కృషిని మంత్రి గంటా ఈ సందర్భంగా అభినందించారు. తెలుగు నేర్పే బాధ్యతను పాఠశాల సంస్థ భుజానికెత్తుకోవడం సంతోషంచదగ్గ అంశామని తెలిపారు. పాఠశాల వసంతోత్సవ కార్యక్రమం స్పూర్తి వంతంగా వుందని, ఎపీలోనూ ఇలాంటి కార్యక్రమం నిర్వహించే ఆలోచన చేస్తామన్నారు. ఎపి ప్రభుత్వ సహకారంతో పాఠశాల సంస్థ 4 సంవత్సరాల తెలుగు కోర్సును నిర్వహిస్తుండటం, తొలి బ్యాచ్ పూర్తి కావడం అభినందించదగ్గ అంశామని, మున్ముందు పాఠశాల సంస్థకు తమ పూర్తి సహకారం వుంటుందని మంత్రి గంటా తెలిపారు. అనంతరం గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లను పిల్లలకు మంత్రి గంటా అందజేశారు. కార్యక్రమంలో ఎంపి సీఎం రమేష్, ఎపి ఉన్నత విద్యామండలి సలహాదారు డాక్టర్ ఈదర వెంకట్, అమెరికాలో ప్రభుత్వ ప్రతినిధి కోమటి జయరాం తదితరులు పాల్గొన్నారు.