- నాన్నా.. నరరూప నారాక్షసుడా..!
చిన్నారులు చేసే చిన్నచిన్న తప్పులకు తల్లిదండ్రులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు మందలించడం సహజం. కానీ ఆ మందలింపు హద్దు దాటి పిల్లలను హింసించేలా మారితేనే ప్రమాదకరం. సరిగ్గా అలాంటి ఘటనే బెంగళూరులోని కెంగెరిలో జరిగింది. ట్యూషన్‌కు వెళ్లకుండా హోం వర్క్ విషయంలో అబద్ధం చెప్పాడని కన్న కొడుకన్న కనికరం లేకుండా ఓ తండ్రి అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు. మళ్లీ అబద్ధం చెప్తావా అని అరుస్తూ పదేళ్ల తన కొడుకును బెల్టుతో కొట్టాడు. ఆ పిల్లాడు ఏడుస్తున్నా కనీసం జాలి చూపకుండా చేత్తో అంత ఎత్తు నుంచి లేపి మంచంపై ఎత్తేశాడు. ఒక వస్తువును పై నుంచి వేసినట్లు ఒకటికి నాలుగు సార్లు విసిరేశాడు. మానవ మృగంలా అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. మంచంపై నుంచి కిందకేసి కాళ్లతో తొక్కుతూ పైశాచికంగా అతను వ్యవహరించిన తీరు చూస్తే.. నాన్నా.. నరరూప రాక్షసుడా అన్న సందేహం కలగక మానదు. ఇక్కడ మరో అత్యంత శోచనీయ విషయమేంటంటే.. ఆ పిల్లాడి పట్ల అంత దారుణంగా వ్యవహరిస్తుంటే.. కన్న తల్లి ఆ సన్నివేశాన్నంతా మొబైల్‌లో చిత్రీకరించింది. పిల్లాడికి దెబ్బ తగిలితేనే.. అయ్యో పాపం అని తల్లి మనసు విలవిలలాడిపోతోంది. అలాంటిది కళ్ల ముందు అంత జరుగుతున్నా.. కనీసం తన భర్తను ఆపడానికి కూడా ఆమె ప్రయత్నించలేదు. పైగా అదేదో సినిమా షూటింగ్‌లా ఆ పిల్లాడి తల్లి వీడియో తీసింది.
ఆ పిల్లాడి తండ్రి ఐటీ కన్సల్టెన్సీలో ఉద్యోగి అని తెలిసింది. ఈ ఘటన జరిగి ఇప్పటికి మూడు నెలలైంది. నవంబర్ 17, 2017న ఈ ఘటన జరిగింది. అయితే ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. దీనికి కారణం లేకపోలేదు. బాలుడి తండ్రి అతని ఫోన్ పాడవడంతో కొద్దిరోజుల క్రితం రిపేర్‌కు ఇచ్చాడు. రిపేర్‌కిచ్చే సమయంలో ఆ వీడియో మొబైల్‌లోనే సేవ్ అయి ఉంది. డిలీట్ చేయలేదు. ఆ ఫోన్‌ను రిపేర్ చేసిన టెక్నీషియన్ అందులో ఉన్న వీడియో చూసి షాకయ్యాడు. ఆ వీడియోను బయటపెట్టడంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది. నిందితుడి పేరు మహేంద్ర, పిల్లాడి తల్లి పేరు శిల్పగా తెలిసింది. ఎందుకు ఇదంతా చేశారని వారిని అడిగితే... మళ్లీ అబద్ధం చెబితే ఆ వీడియో చూపించడానికి అని వారు చెప్పిన కారణం పోలీసులనే అవాక్కయ్యేలా చేసింది. పోలీసులు కేసును సుమోటోగా నమోదు చేసి.. పిల్లాడి తండ్రిని అరెస్ట్ చేశారు.