YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టాలి : కేసీఆర్

ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టాలి : కేసీఆర్
సమస్త సంపదల కంటే ఆరోగ్య సంపదే అత్యంత ప్రాదాన్యమైనదనీ, భవిష్యత్ తరాలకు ఆరోగ్యంగా పెరిగే వాతావరణాన్ని సమకూర్చడమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదనీ, అందులో భాగమే ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న తెలంగాణాకు హరితహారం కార్యక్రమమనీ,  ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ ప్రాధాన్యతను గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి, ఆ సందర్భంగా పర్యావరణ ప్రేమికులకు, పచ్చదనాన్ని ప్రోత్సహించే వారందరికీ శుభాకాంక్షలు తెలియచేసారు. పర్యావరణ పరంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా గుర్తు చేసుకున్నారు సీఎం.పర్యావరణ పరంగా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పుల ప్రభావం మనపైన కూడా ఉంటుందని, వాటి విషయంలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం కేసీఆర్. వీలైనంతగా కాలుష్య కారకాలను వాడకపోవడమ్పైన అందరూ దృష్టి పెట్టాలన్నారు. ఐక్యరాజ్యసమితి ఈ యేడు పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్లిక్ వినియోగం, పొంచి ఉన్న ముప్పును ప్రధానంగా ప్రచారం చేస్తోందని, నిత్య జీవితంలో ప్లాస్టిక్ ఎంతగా అవసరం ఉన్నా, దాని వల్ల తలెత్తే దుష్పరిణామాల విషయంలో ఏమరుపాటు వద్దని సీ.ఎం అన్నారు. 
 
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తొలి నాళ్లలోనే పచ్చదనం, పరిశుభ్రత ప్రాధాన్యతలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందనీ, అందుకే తెలంగాణకు హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టిందనీ, ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలందరికీ కాలుష్య రహిత వాతావరణం, స్వచ్ఛమైన నీరు, ఆహారం అందించే కర్తవ్యంతో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని ఆకు పచ్చగా మార్చాలన్న లక్ష్యంతోనే తెలంగాణకు హరితహారం ప్రారంభమైందని,  మూడేళ్ల ఫలితాలు స్పష్ఠంగా కనిసిస్తున్నాయని, మొక్కల పెంపకం, వాటి రక్షణకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి పెంచినప్పుడే ఫలితాలు మరింత ఆశాజనకంగా ఉంటాయనీ ఆయన అన్నారు. ప్రస్తతం ఉన్న వాటికి తోడు, రానున్న తరాలకు అవసరమయ్యే విధంగా మనం చెట్లు పెంచుతున్నామనే ఆలోచన ప్రతీ ఒక్కరిలో రావాలన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే హరితహారం విజయవంతం అవుతుందని, రానున్న జూలైలో మొదలయ్యే నాలుగో విడత హరితహారంలో అందరూ పాల్గొనటంతో పాటు, నాటిన ప్రతీ మొక్కా బతికేలా రక్షణ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. 
పచ్చని పర్యావరణం కోసం హరితహారంలో భాగంగా అర్బన్ ఫారెస్ట్ పార్కులు, రహదారి వనాలు (ఎవెన్యూ ప్లాంటేషన్) ఏర్పాటు చేస్తున్నామని, కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు దశల వారీగా ఎలక్ట్రికల్ వాహనాలును ప్రవేశ పెట్టబోతున్నామని, ఇప్పటికే పౌర విద్యుత్ ( సోలార్ పవర్ )లో గణనీయమైన ప్రగతి సాధించామని సీఎం అన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అటవీ పునరుజ్జీవన చర్యలు కూడా సత్ఫలితాలు ఇస్తున్నాయని సీఎం గుర్తు చేసుకున్నారు.

Related Posts