YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ నుంచి ఏసీఏకు విముక్తి

వైసీపీ నుంచి ఏసీఏకు విముక్తి

విశాఖపట్టణం, జూలై 3,
పూర్తిగా వైసీపీ నేతలతో, విజయసాయి రెడ్డి అల్లుళ్ళు, అనుచరులతో నిండిపోయిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) వారి కంబంధ హస్తాల్లో నుంచి బయటపడనుంది. వైసీపీ ఉత్తరాంధ్రా ఇన్చార్జి హోదాలో విజయసాయి రెడ్డి వందల కోట్ల ఆస్తులు, డిపాజిట్లు ఉన్న ఏసీఏపై కన్ను వేసి అక్రమ మార్గాల్లో చేతుల్లోకి తీసుకొని పాత కార్యవర్గాన్ని బలవంతంగా పంపించేసి తన మనుషులతో నింపేశారు. ఢిల్లీ మద్యం కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే తన పెద్ద అల్లుడు పి.శరత్‌చంద్రారెడ్డితో నామినేషన్ వేయించి అధ్యక్షుడిని చేశారు. ఆ నామినేషన్ పత్రాలను పట్టుకువచ్చి ఆయన తమ్ముడు, విజయసాయి సొంత అల్లుడు పి.రోహిత్ రెడ్డి ఆయనకు కూడా తెలియకుండానే అప్పటికప్పుడు నామినేషన్ వేసి ఉపాధ్యక్షుడు అయిపోయారు. ఇక విశాఖలో విజయసాయి బినామీగా పేరుపడ్డ ఎస్ఆర్ గోపీనాధ్ రెడ్డి కార్యదర్శిగా ఎన్నికయ్యారు.ఎన్నికల్లో రాష్ర్టంలో కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో కోట్లలో అక్రమాలకు పాల్పడ్డ ఈ కార్యవర్గానికి భయం పట్టుకొంది. ఇప్పటికే తీవ్ర ఆరోపణలు రావడం, ఫిర్యాదులు వెళ్లడంతో భవిష్యత్‌లో కేసులు, అరెస్టులు లేకుండా స్వచ్చందంగా తప్పుకొనేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్నట్లు తెలిసింది. ఈ కార్యవర్గం కడప స్టేడియం, పులివెందుల గ్రౌండ్ పేరిట కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేసింది. ‘ఆడుదాం ఆంధ్రా’లో కూడా ఏసీఏ దూరి అక్రమాలకు పాల్పడింది. చివరకు విశాఖలో ఉన్న స్టేడియంను మూసేసి దానిని తమ గుప్పెట్లో పెట్టుకొని భోగాపురం వద్ద కొత్త స్టేడియం కట్టాలనే ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చింది.విశాఖలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలపై ఇప్పటికే దృష్టి సారించిన మంత్రి లోకేశ్ ఏసీఏని చక్కదిద్దే పనులను ప్రారంభించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని)కి ఏసీఏ వ్యవహారాలను చక్కదిద్ది కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే బాధ్యతలను అప్పగించారు. ఈ కార్యవర్గం అక్రమాలపై పూర్తి ఆధారాలు లోకేశ్ వద్ద వుండడంతో ఆయన ఈ కార్యవర్గాన్ని తప్పించే పనికి శ్రీకారం చుట్టారని తెలిసింది. వారంతట వారు వెళ్లిపోతారా? లేక అరెస్టులు, కేసులకు సిద్ధమౌతారో కనుక్కోమని చెప్పడంతో వారంతా రాజీనామాలకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ వ్యవహారాన్ని సున్నితంగా అమలు చేసే బాధ్యతను కేశినేని చిన్ని స్వీకరించారు. అందులో భాగంగానే ఆదివారం విశాఖ స్టేడియంలో జరిగిన ఆంధ్రా ప్రీమియర్ లీగ్ మూడవ సీజన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిన్నితో పాటు క్రీడల శాఖామంత్రి రాంప్రసాదరెడ్డి హాజరయ్యారు.విశాఖ క్రికెట్ స్టేడియం హక్కుదారైన విశాఖ జిల్లా క్రికెట్ అసోసియేషన్‌కు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ రూ.24 కోట్ల బకాయి పడింది. ఈ రెండు సంఘాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణ వల్ల వచ్చే ఆదాయంలో 40 శాతం వీడీసీఏకి ఏసీఏ చెల్లించాలి. ఒప్పందం కుదిరిన తరువాత రెండు పర్యాయాలు మాత్రమే చెల్లించిన ఏసీఏ గత పది సంవత్సరాలుగా వాటా ఇవ్వడం మానేసింది. విజయసాయి కార్యవర్గం కూడా హామీ ఇచ్చి మాట తప్పడంతో ఇప్పుడు రాబోయే కొత్త కార్యవర్గం బకాయి తీరుస్తుందని వీడీసీఏ కార్యవర్గం ఎదురుచూస్తోంది.

Related Posts