అమరావతి
పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఎదురైన సవాళ్లన్నీ పరిష్కరించదగ్గవేనని విదేశీ నిపుణులు ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. మొత్తం మీద సానుకూల వ్యాఖ్యలు చేసినప్పటికీ సమగ్ర అధ్యయనం తర్వాతే తుది నిర్ణయాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ‘ఆయా అంశాలపై తలో అనుమానం ప్రస్తావిస్తున్నారు. ప్రాథమికంగా మా దృష్టికి వచ్చిన అంశాల ఆధారంగా అభిప్రాయాలు చెబుతున్నాం. ఇవి తుది నిర్ణయాలు కావు. మేం కొంత సమాచారం కోరాం. అవన్నీ మాకు ఇచ్చామని మీరు చెబుతున్నారు. ఆ నివేదికలను మేం అధ్యయనం చేయలేదు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో క్షేత్రస్థాయి పరిస్థితులను మాత్రమే చూశాం. ఇందుకు సంబంధించి చేసిన పరీక్షల అధ్యయన నివేదికలను లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తాం. బుధవారం ప్రాథమికంగా కొన్ని అభిప్రాయాలు వెల్లడిస్తాం’ అని విదేశీ నిపుణులు తేల్చిచెప్పారు.
నేడు నిపుణుల ప్రజంటేషన్ : ఇంత వరకు పోలవరంలో అధికారులు ఇచ్చిన ప్రజంటేషన్‌ను నిపుణులు పరిశీలించారు. మంగళవారం రాత్రి, బుధవారం విదేశీ నిపుణులు అందుబాటులో ఉన్న పోలవరం నివేదికలన్నీ అధ్యయనం చేసి ఒక ప్రజంటేషన్ సిద్ధం చేయబోతున్నారు. బుధవారం కేంద్ర జలసంఘం ఛైర్మన్‌తో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో దాన్ని సమర్పించి, వివరాలు తెలియజేయనున్నారు. తుది నిర్ణయాలు తీసుకునేందుకు ప్రస్తుతం చేసిన పరీక్షలు సరిపోతాయా, ఇంకా ఏమైనా అధ్యయనం చేయాల్సి ఉందా అన్నది తేల్చిచెప్పాలని కేంద్ర జలసంఘం డైరెక్టర్ ఇప్పటికే విదేశీ నిపుణులను కోరారు. నవంబరు వరకు గోదావరిలో వరద కాలమని, ఆ తర్వాత ప్రాజెక్టులో పనులు త్వరితగతిన చేయాలనుకుంటున్నామని, అందువల్ల అప్పటికి పరిష్కారాలు సిద్ధం చేస్తే పనులు వేగంగా ముందుకు తీసుకువెళ్లే ఆస్కారం ఉంటుందని కేంద్ర జలసంఘం ప్రతినిధులు కోరారు. బుధవారం తమ ప్రజంటేషన్‌లో ఈ అంశాలన్నీ ప్రస్తావిస్తామని- సత్వరమే ఎలా ముందుకెళ్లాలో తెలియజేస్తామని, తుది నివేదిక ఆ తర్వాత సమర్పిస్తామని విదేశీ నిపుణులు వెల్లడించారు.
డయాఫ్రం వాల్‌పై భిన్న చర్చలు : పోలవరం సవాళ్లపై మంగళవారం పూర్తిస్థాయిలో చర్చలు జరిగాయి. ప్రాజెక్టులో వివిధ కట్టడాలు నిర్మించిన కంపెనీల ప్రతినిధులు, వారి నిపుణులు సంబంధిత నిర్మాణాలపై ప్రజంటేషన్ ఇచ్చారు. వాటిలో తలెత్తిన సమస్యలపై ఏం చేస్తున్నామో చెప్పారు. ఇదే పద్ధతిలో వెళ్లాలా, ఇంకేమైనా మార్పులు చేయాలా అని నిపుణులను అడిగారు.
ప్రస్తుతమున్న డయాఫ్రం వాల్‌ను మరమ్మతు చేయవచ్చని డయాఫ్రం వాల్ సాంకేతికతపై అనుభవమున్న విదేశీ నిపుణుడు అభిప్రాయపడ్డారు. కెల్లర్, బావర్ కంపెనీ ప్రతినిధులు దాంతో విభేదించారు. కొత్త కట్టడం అవసరమని పేర్కొన్నారు. డ్యాం భద్రతా అంశాన్ని పరిశీలించే విదేశీ నిపుణుడు సైతం భద్రత అంశాలు లోతుగా పరిశీలించాలి కదా అని వ్యాఖ్యానించారు. ఎగువ కాఫర్ డ్యాం భద్రంగానే ఉందన్న నిపుణులు.. సీపేజీ సమస్య పరిష్కారానికి మార్గాలు సూచిస్తామని చెప్పారు. కొన్ని పర్మిబిలిటీ పరీక్షలకు సిఫార్సు చేశారు. ఆ ఫలితాలు చూసిన తర్వాత ఎలా ముందడుగు వేయాలో తెలియజేస్తామన్నారు. జెట్ గ్రౌటింగ్, వైబ్రో కాంపాక్షన్ పనులు, స్టోన్ కాలమ్స్ తదితర అంశాలపైనా చర్చ జరిగింది. ఎగువ కాఫర్ డ్యాం బాగానే ఉందని విదేశీ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రధాన డ్యాం ప్రాంతంలో అగాధాలున్న చోట ఇసుక సాంద్రత పెంచే పనులు చేపట్టినా ఒక స్థాయి దాటి దిగువకు వెళ్లడం లేదని అధికారులు తెలియజేశారు. సమావేశంలో విదేశీ నిపుణులు డేవిడ్ బి పాల్, రిచర్డ్ డొన్నెల్లీ, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, సీస్ హించ్‌బెర్గర్, రాష్ట్ర జలవనరులశాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, చీఫ్ ఇంజినీర్ నరసింహమూర్తి, పోలవరం అథారిటీ కార్యదర్శి రఘురామ్, సీఈ వెంకట సుబ్బయ్య, కేంద్ర జలసంఘం డిప్యూటీ డైరెక్టర్ అశ్వనీకుమార్ వర్మ, నిపుణులు విజయ్ శరణ్, గౌరవ్ తివారీ, అన్నెపు ప్రవీణ్, మనీష్ గుప్తా (సీఎస్‌ఎంఆర్‌ఎస్), బావర్, కెల్లర్, అఫ్రి, మేఘా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.