విజయవాడ, జూలై 4,
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆయనపై నమోదైన సీబీఐ, ఈడీ కేసుల విచారణలను రోజువారీగా చెపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జగన్‌పై నమోదైన సీబీఐ, ఈడీ కేసులను రోజువారీ విచారణ చేపట్టి తేల్చేసేలా హైదరాబాద్ సీబీఐ కోర్టుకు ఆదేశాలివ్వాలంటూ హరిరామజోగయ్య తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిల్ దాఖలు చేశారు.. సీబీఐ, ఈడీ కేసులు లేని నేతను ఎన్నుకోవాలని ప్రజలు అనుకుంటున్నారని.. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసుల్లో నిందితుడైన జగన్ వరుస పిటిషన్లు వేసి విచారణలో జాప్యం చేస్తున్నారన్నారు. ఈ పిటిషన్ ను ఎన్నికలకు ముందే దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. జగన్ కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది. జగన్ కేసుల విచారణ వేగంగా సాగడం లేదని ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎందుకు ఆలస్యమవుతోందని సుప్రీంకోర్టు సీబీఐని ప్రశ్నించింది. నిందితులు వరుసగా వివిధ రకాల పిటిషన్లు వేయడం వల్లనే ఆలస్యం అవుతుందని సీబీఐ తెలిపింది. లోయర్ కోర్టులో వాయిదాలతో తమకు సంబంధం లేదని సీబీఐ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇంతకాలం నుంచి ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ అన్నా పరిష్కరించారా అని సుప్రీంకోర్టు ధర్మాసనం అప్పట్లో ప్రశ్నించింది. జగన్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని పేర్కొంటూ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ, ఈడీలు మొత్తం 20 చార్జిషీట్‌లు దాఖలు చేశాయి. ఈ కేసులపై సీబీఐ కోర్టులో గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది. ఆయా చార్జిషీట్ల నుంచి తమను తప్పించాలని కోరుతూ జగన్, విజయసాయిరెడ్డి సహా ఇతర నిందితులు దాఖలు చేసిన 130 డిశ్చార్జి పిటిషన్‌లపై తీర్పు వెల్లడి కాలేదు. తీర్పు చెప్పాల్సిన రోజున జడ్జి బదిలీ అయ్యారు. ఈ కారణంగా మళ్లీ మొదటి నుంచి కేసులను తాజా సీబీఐ కోర్టు జడ్జి వింటున్నారు. తీర్పు వెలువరించాల్సిన సమయంలో బదిలీ కావడంతో ఆయన కేసులను తిరిగి ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. కొత్త జడ్జి మళ్లీ ఈ కేసులను మొదటి నుంచి వినాల్సిన అవసరం ఏర్పడింది. కేవలం డిశ్చారి పిటిషన్‌లకే దశాబ్దకాలం పడితే.. ప్రధాన కేసులు ఎప్పుడు విచారణకు వస్తాయి? ఎప్పుడు శిక్షలు పడతాయి? అన్న అనుమానాలు పిటిషనర్లు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రోజువారీ విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించడంతో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ వేగంగా సాగే అవకాశం ఉంది. ఆ తర్వాత చార్జిషీట్లపై ట్రయల్ ప్రారంభమవుతుందని న్యాయవర్గాలు చెబుతున్నాయి.
ప్రతి వారం హైదరాబాద్ టూర్
వైఎస్ జగన్ న్యాయస్థానంలో కేసుల విచారణ సమయంలో పిలిచినప్పుడు హాజరు కావాల్సిందేనని చెబుతున్నారు. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి కాకపోవడంతో న్యాయస్థానం నుంచి ఎలాంటి మినహాయింపులు లభించవని న్యాయనిపుణులు చెబుతున్నారు. అవసరమైతే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించినా ఆయన హైదరాబాద్ సీబీఐ కోర్టుకు హాజరు కాక తప్పదని సీనియర్ న్యాయవాది ఒకరు చెప్పారు. అయితే జగన్ కూడా తన హాజరు నుంచి మినహాయింపును కోరే అవకాశముందని, అందుకు న్యాయస్థానం అనుమతిస్తుందా? లేదా? అన్నదే ఇప్పుడు చూడాల్సి ఉంటుందన్నారు.. ఇప్పుడు జగన్ కు రాజకీయంగా కూడా పెద్దగా సాయం అందే అవకాశాలు లేవన్నది సుస్పష్టం. జాతీయ, రాష్ట్ర రాజకీయాలను చూస్తుంటే జగన్ తప్పనిసిరిగా న్యాయస్థానం ఎదుటకు హాజరు కావాల్సి ఉంటుందని అన్నారు. అయితే జగన్ పై నమోదయిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఏ ఒక్కటి నిలబడే అవకాశం లేదని కూడా న్యాయనిపుణులు చెబుతున్నారు. అయితే న్యాయస్థానానికి మాత్రం ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడం, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో జగన్ కు రానున్న కాలమంతా చాలా కష్టాలను తెచ్చిపెడుతుందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. అయితే అన్నింటికీ తమ పార్టీ అధినేత సిద్ధంగా ఉన్నారంటున్నారు వైసీపీ నేతలు మరి ఏం జరుగుతుంది? ఎంత కాలం సాగుతుందన్నది మాత్రం వెయిట్ చేయాల్సిందే.