న్యూఢిల్లీ, జూలై 4,
చాంపియన్స్ వచ్చేశారు.. టీ-20 వరల్డ్‌కప్‌తో ఢిల్లీలో అడుగుపెట్టిన టీమిండియాకి ఘనస్వాగతం లభించింది.. 20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన టీమ్ఇండియా 5 రోజుల తర్వాత స్వదేశం చేరుకుంది. ఈనెల 29న జరిగిన ఫైనల్ పోరులో సౌతాఫ్రికాపై అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది.. కప్ గెలిచిన తర్వాతే అక్కడి నుంచి బయలుదేరాల్సి ఉన్నా బెరిల్ తుపాను కారణంగా బార్బడోస్‌లోనే ఉండిపోయిన భారత జట్టు ఇప్పుడు ప్రత్యేక విమానంలో ఇండియా చేరుకుంది. గురువారం ఉదయం ఢిల్లీ ఎయిర్ పోర్ట్కు చేరుకున్న వరల్డ్ ఛాంపియన్లకు బీసీసీఐ అధికారులు, టీమ్ఇండియా ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జైషా, మీడియా కూడా అదే విమానంలో స్వదేశం చేరుకున్నారు. ప్లేయర్ల రాకతో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఫ్యాన్స్తో కిక్కిరిసిపోయింది. భారీగా అభిమానులు అక్కడికి చేరుకుని.. టీమిండియా క్రికెటర్లకు స్వాగతం పలికారు.. ‘భారత్ మాతా కీ జై’.. ‘ఇండియా ఇండియా’ నినాదాలతో ఫ్యాన్స్ హోరెత్తించారు. కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ కప్ ట్రోఫీని అభిమానులకు చూపిస్తూ అభివాదం చేశారు.. దాదాపు 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ సాధించిన టీమిండియా జట్టకు అభిమానులు ఘనస్వాగతం పలికారు.అనంతరం క్రికెటర్లు బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో ఐటీసీ మౌర్య హోటల్కు వెళ్లారు.