విజయవాడ, జూలై 5,
ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిని ప్రాధాన్యత ప్రాజెక్టుగా తీసుకున్నారు. అధికారంలోకి రాగానే రాజధానిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రాజధాని ప్రాంతంలో పర్యటించారు. తాజాగా శ్వేత పత్రం సైతం విడుదల చేశారు. ఇప్పటివరకు రాజధానిలో చేపట్టిన నిర్మాణాలు, ఖర్చులు, వాటి స్థితిగతుల గురించి వివరించారు. ఎన్ని కష్టాలు వచ్చినా అమరావతిపై బలంగా ముందుకు వెళ్తామని సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో ఆర్థిక అవసరాల కోసం అమరావతిలో కేటాయించిన భూముల వివరాలను సైతం స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. విద్యుత్ వెలుగులు వచ్చాయి. అమరావతికి దగ్గరగానే చంద్రబాబు ఈ రాష్ట్రానికి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతి రాజధాని శరవేగంగా నిర్మాణం జరుపుకుంటుందని సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు అందుకు తగ్గట్టుగా కార్యాచరణ ప్రారంభించారు.2014లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సీఎం అయ్యారు. అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా ప్రకటించారు. దాదాపు 53,748 ఎకరాల భూమిని రైతుల నుంచి సమీకరించారు. అయితే ఇలా సేకరించిన భూమిలో 8,274 ఎకరాలను ఆర్థిక అవసరాల కోసం వినియోగించనున్నట్లు ప్రభుత్వం శ్వేత పత్రంలో పేర్కొంది. పూలింగ్ సమయంలో ఇక్కడ భూమి నుంచి వచ్చే ఆదాయం ద్వారా రాజధాని నిర్మించుకోవచ్చు ని 2019కి ముందే చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధానికి సేకరించిన భూముల్లో కనీసం 8 వేల ఎకరాలు మిగులుగా ఉంటుందని నాడు పేర్కొన్నారు. ప్రస్తుతం విడుదల చేసిన శ్వేత పత్రంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మొత్తం సేకరించిన భూమిలో రోడ్లు ఇతర సదుపాయాల కోసం 27,885 ఎకరాలు, రైతులకు ప్లాట్లు తిరిగి ఇచ్చేందుకు 11826 ఎకరాలు, ఇతర అవసరాల కోసం 14,037 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. అయితే ఇతర అవసరాలు ఏమిటనేది శ్వేత పత్రంలో ప్రస్తావించలేదు.అయితే పక్కా ప్రణాళికలో భాగంగానే అమరావతిలో మిగులు భూమిని 8274 ఎకరాలను ఉంచినట్లు తెలుస్తోంది. నిధుల రూపంలో మార్చుకునేందుకు ఈ భూమిని అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది.టిడిపి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా గుర్తించింది.ప్రపంచ నగరాల్లో ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలని భావించింది.అప్పట్లో అమరావతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. కానీ గత ఐదు సంవత్సరాలుగా వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో అమరావతి ర్యాంకింగ్ గణనీయంగా పడిపోయింది. దీంతో ఈ మిగులు భూమి విషయంలో ఎలా ఉపయోగించుకుంటారన్నది ప్రశ్నార్ధకంగా మిగిలింది. ర్యాంకింగ్ లేకపోతే పెట్టుబడి సమస్యలు ముందుకు రావు. బ్యాంకులు రుణాలు ఇవ్వవు కూడా. అందుకే చంద్రబాబు ఈ మిగులు భూముల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. గతంలో సింగపూర్ సంస్థలు ముందుకు వచ్చాయి. ఇప్పుడు ఇతర దేశాల సంస్థలకు సైతం ఆహ్వానాలు పంపారు. అవి ఎంతవరకు మొగ్గు చూపాయన్నది ప్రశ్నార్ధకంగా మారింది.