YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ ఎమ్మెల్యేలు...ఫిరాయింపులా

వైసీపీ ఎమ్మెల్యేలు...ఫిరాయింపులా

నెల్లూరు, జూలై 6,
పార్టీ నుంచి వెళ్లేవాళ్లు వెళ్తారు.. ఉండేవాళ్లు ఉంటారు. నైతికత ఉన్న వాళ్లు నాతోనే ఉంటారు " అని వైసీపీ అధినేత జగన్ తనతో సమవేశం అయిన నేతలతో వ్యాఖ్యానించినట్లుగా పార్టీ వర్గాలు ప్రకటించాయి. హఠాత్తుగా జగన్ ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందన్నది హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నేతలు ఇప్పటి వరకూ పార్టీ మారుతారని ఎలాంటి సంకేతాలు రాలేదు. ఫలానా పార్టీతో చర్చలు జరుపుతున్నారని ఇంకా చెప్పుకోవడం లేదు. ఇలాంటి సమయంలో హఠాత్తుగా జగన్ పార్టీ నుంచి  ఫిరాయింపుల గురించి చెప్పడం.. పోయేవాళ్లను బుజ్జగించడం.. ఆపే ప్రయత్నం చేయడం లాంటివి చేయనని చెప్పడం ఆశ్చర్యకరమే. అంతర్గతంగా ఏదో జరుగుతోందన్న అభిప్రాయం బయట ఉన్న వారికి కలుగుతోంది. ప్రభుత్వం మారినప్పుడల్లా అధికార పార్టీలోకి వలసలు సహజంగానే జరుగుతూ ఉంటాయి. నియోజకవర్గ అభివృద్ది కోసం పార్టీ మారుతున్నామని వాదించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా తెలంగాణలో అదే జరిగింది. గతంలో వైసీపీ హయాంలో నలుగురు ఎమ్మెల్యేలు అదే సిద్ధాంతాన్ని  చెప్పారు. అంతకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు చేరారు. వారు కూడా అదే చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీలో చేరామని చెప్పారు. ఎవరూ అధికార పక్షం నుంచి విపక్షంలో చేరరు. విపక్షం నుంచి అధికార పార్టీలో చేరుతారు. ఇప్పుడు టీడీపీ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ కూటమి పార్టీల్లోకి సహజంగానే వలసలు ఉంటాయి. అయితే చేర్చుకునేంత భారీ సంఖ్యలో వైసీపీ ఎమ్మెల్యేలు గెలవలేదు. మారాలంటే ఎమ్మెల్సీలు.. ఓడిపోయిన ఇతర సీనియర్లే ఉంటారు. మరి వీరిలో ఎవరు పార్టీ మారబోతున్నారు.. ఏ పార్టీలో చేరబోతున్నారన్నది ఆసక్తికరం. తెలుగుదేశం  పార్టీ ఇప్పుడు వైసీపీ నుంచి  గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేల్లో ఎవరైనా వచ్చి చేరుతామన్నా చేర్చుకునే పరిస్థితుల్లో లేదు. కానీ ఎమ్మెల్సీల విషయంలో మాత్రం ప్రత్యేక వ్యూహం అమలు చేయాల్సి ఉంది. శాసనమండలిలో ప్రస్తుతం వైసీపీకి మెజార్టీ ఉంది. ఏ బిల్లును అడ్డుకోగల శక్తి ఉంది. అయితే ఈ అడ్డుకోవడం అనేది పూర్తి స్థాయిలో సాధ్యం కాదు. ఒకటి, రెండు ప్రయత్నాల వరకే సాధ్యం. అయినా సరే టీడీపీకి ఇబ్బందులు వస్తాయి. మండలి చైర్మన్ కూడా వైసీపీకి చెందిన నేతే. ఇప్పటికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు వస్తే అడ్డుకుంటామని వైసీపీ హైకమాండ్ సంకేతాలు ఇచ్చింది. అదే సమయంలో చాలా  కీలకమైన బిల్లులు ఆమోదించేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోందని చెబుతున్నారు. అందుకే ఎమ్మెల్సీలను టీడీపీలో చేర్చుకోవాలన్న ఆలోచలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఒకరిద్దరికి కాకుండా మూడింట రెండు వంతుల మందిని విలీనం చేసుకునే విధంగా  ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పిటకే ఈ అంశంపై సంప్రదింపులు జరుగుతున్నాయని ఈ విషయం తెలిసే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఉంటారు పోతే పోతారని వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. ఎమ్మెల్సీలు నేరుగా ఎన్నికైన వారు కాదు. వివిధ కోటాల్లో ఎన్నికయిన వాళ్లు. వచ్చే ఐదేళ్ల కాలంలో వైసీపీ తరపున ఒక్కరంటే ఒక్కరికీ కూడా ఎమ్మెల్సీ పదవులు దక్కే అవకాశం లేదు. నేరుగా ఎన్నికలు జరిగేది గ్రాడ్యూయేట్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీలకే. ఎమ్మెల్యే, గవర్నర్ కోటాల్లో వచ్చేవన్నీ టీడీపీకే వస్తాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కూడా విపక్షంలో ఉన్న పార్టీ గెలుచుకోవడం అంత తేలిక కాదు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంటేనే గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీలు గెలుచుకోగలుగుతారు. ఈ లెక్కన..  వచ్చే ఐదేళ్లలో ఒక్క ఎమ్మెల్సీ కూడా వైసీపీకి రావడం కష్టం. ఈ లోపు అందరి పదవి కాలం పూర్తవుతుంది. ఎమ్మెల్సీలు అందరూ తమకు మరో అవకాశం రావాలన్నా..రాజకీయంగా కాస్త పలుకుబడి ఉండాలన్నా అధికార పార్టీలో ఉండాలనుకుంటారు. అందుకే టీడీపీ ఆహ్వానాలపై పలువురు సానుకూలంగా స్పందించారనిచెబుతున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాల్లో కూటమికి వచ్చిన మెజారిటీలు చూస్తే ఎవరికైనా వైసీపీకి భవిష్యత్ ఉందని అనుకోరు. ప్రతి నియోజకవర్గంలోనూ యాభై వేల మెజార్టీ కనిపించింది. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఓడిపోయిన గాజు వాక  నియోజకవర్గంలో  రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ 95వేలు వచ్చింది. ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఓ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తే ఐదు వేల ఓట్లు వచ్చాయి. అలాంటి వేవ్ కనిపించింది. వైసీపీ అసలు లెక్కలే లేదన్న అభిప్రాయం ఉంది. గుంటూరు వరకూ అదే పరిస్థితి ఉంది. అందుకే ఎక్కువ మంది వైసీపీ నేతలు.. ముఖ్యంగా కాపు నేతలంతా జనసేన పార్టీ వైపు చూస్తున్నారని చర్చ జరుగుతోంది. అందులో తాజా మాజీ మంత్రులు కూడా ఉన్నారని అంటున్నారు. కొంత మంది ఇటీవల కూటమి ప్రభుత్వంపై సానుకూల ప్రకటనలు చేస్తున్నారు. వారు తమకు ఇష్టమైన పార్టీలతో అంతర్గతంగా చర్చల్లో ఉన్నారని అంటున్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఆకర్ష్ కు ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీకి భవిష్యత్ లేదని.. విజయమ్మ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారని వైఎస్ ఆత్మీయులందరూ కాంగ్రెస్ లోకి రావాలని పిలుపునిస్తున్నారు.అంతర్గతంగా ఈ విషయంపై కాంగ్రెస్ హైకమాండ్ తో కొంత మంది సంప్రదింపులు జరుపుతున్నారని కూడా అంటున్నారు.  కాంగ్రెస్ పార్టీ తరపును కడప ఎంపీ బరిలో ఉన్న వైఎస్ షర్మిలను ప్రజలు గెలిపించాలని విజయమ్మ కోరారు. మళ్లీ ఆమె జగన్ వైపు వెళ్తారని అనుకోవడం లేదు. ఈ పరిణామాలన్నింటితో పార్టీ నేతల్ని కాపాడుకోవడం అంత తేలిక కాదని జగన్ గట్టి గా నమ్ముతున్నారు. వారిని బుజ్జగించడం కన్నా..ఉంటే ఉన్నారు..పోతే పోయారు అన్నట్లుగా ఉండాలని డిసైడయ్యారని చెబుతున్నారు. అదే భావన ఆయన మాటల్లో వ్యక్తమవుతోందని అంటున్నారు.

Related Posts