కాకినాడ, జూలై 6,
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారంలోకి రాకముందు.. వచ్చిన తర్వాత చూస్తే పూర్తిగా మారిపోయినట్లే కనిపిస్తుంది. గత నెల 12వ తేదీన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కల్యాణ్ తీరును గమనించిన వాళ్లు ఎవరైనా ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నప్పటికీ, అంతకు ముందు కూడా ఆయన పూర్తిగా సంయమనం పాటిస్తున్నారనే అనుకోవాలి. ఎందుకంటే ఎక్కడా పవన్ కల్యాణ‌్ ఎక్కువ మాట్లాడటం లేదు. పవన్ కల్యాణ్ ను దగ్గర నుంచి చూసిన వారికి ఎన్నికలకు ముందు, తర్వాత ఇంత మార్పేమిటి అంటూ ఆశ్చర్యపోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ‌్ ఊగిపోయేవారు. ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడే వారు. చెప్పులు చూపించారు. కొన్ని వాడకూడని పదాలను కూడా వాడారు. ఆయన జనంలో ఎక్కువగా ఇమడలేనట్లుగా కనిపించారు. ఆవేశంతో ఊగిపోతూ చేసిన ఆయన ప్రసంగాలపై అప్పట్లో కొందరు రాజకీయ విశ్లేషకులు సయితం విమర్శలు చేశారు. ఎందుకంటే రాజకీయ నేతలకు అంత ఆవేశం పనికి రాదని, సహనంతో పాటు కొంత కంట్రోల్ లో ఉండాలని అనేక మంది అభిప్రాయపడ్డారు కూడా. ఒక దశలో అధికారంలోకి రాకముందే ఇలా ఉంటే, ఇక పవర్ లోకి వస్తే ఏం చేస్తారోనన్న కామెంట్స్ కూడా అనేక మంది నుంచి వినిపించాయి. తాను డిప్యూటీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఎక్కడా ఆయన దర్పం ప్రదర్శించడం లేదు. అనవసర ఖర్చులు చేయడం లేదు. ప్రజలతో మమేకం అవుతున్నారు. తన వద్దకు వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించడానికి ఆయన తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మిస్సింగ్ అయిన ఒక యువతిని తొమ్మిది రోజుల్లో తెప్పించారంటే పవన్ కల్యాణ్ ఏ మేరకు తాను పనిలోకి దిగారో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు. అధికారులపై ఎవరూ దుర్భాషలాడవద్దని చెప్పడం కూడా ఆయన పరిణితికి అద్దంపడుతుంది. అధికారులంటే మనం చెప్పింది చేసినట్లు చేసేవాళ్లని, అధికారులను దూషిస్తే పార్టీ పరంగా చర్యలను కూడా తీసుకుంటానని జనసేన ఎమ్మెల్యేలను, పార్టీ నేతలకు కూడా పిఠాపుం వేదికగా వార్నింగ్ ఇచ్చారంటే ఆయనలో వచ్చిన మార్పునకు ఇంతకంటే మరే ఉదాహరణ అవసరం లేదు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నప్పటికీ వాటిని ఒక స్థాయి వరకే పరిమితం చేసుకున్నారు. అంతే తప్ప గతంలోలా ఆవేశపడి పోవడం లేదు. తాను చేయదలచుకున్నది, చేసేది మాత్రమే ప్రజలకు చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితి సహకరిస్తే తాను మంత్రిగా మరింత బాగా పనిచేస్తానని ప్రజలకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తనకు కేటాయించిన శాఖలపై క్రమంగా అవగాహన పెంచుకుంటున్న పవన్ కల్యాణ్ పూర్తిగా గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. సినిమాలకు కూడా మూడు నెలల పాటు దూరంగా ఉంటానని, ఇప్పటి వరకూ అంగీకరించిన సినిమాలకు మూడు నెలల తర్వాత మాత్రమే డేట్స్ కొన్ని రోజులు కేటాయిస్తానని చెప్పుకొచ్చారంటే ఆయన పూర్తిగా బలపడే ప్రయత్నంలో ఉన్నారు. పార్టీకి సుదీర్ఘ భవిష్యత్ ను అందించడానికి ఆయన వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో సక్సెస్ అయిన పవన్ స్ట్రాటజీ ఈ వ్యూహం కూడా వర్క్ అవుట్ అవుతుందని జనసేన నేతలు ఆశిస్తున్నారు.