తిరుపతి, జూలై 6
చిత్తూరు జిల్లాలో వైసీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ తో పాటు పాలకవర్గ సభ్యులంతా టిడిపిలో చేరేందుకు సిద్ధపడిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్, ఇతర కార్పొరేటర్లు టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధమైంది. వారంతా మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు సిద్ధపడటం విశేషం. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా చిత్తూరులో మెజారిటీ కార్పొరేషన్ లో అప్పటి అధికార వైసిపి ఏకగ్రీవాలు చేసుకుంది. ఏకపక్ష విజయాలను సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు సీన్ మారింది. టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో.. చిత్తూరు కార్పొరేషన్ కార్యవర్గమంతా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధపడటం విశేషం.చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి తో సహా పలువురు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. స్థానిక టిడిపి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో చాలామంది కార్పొరేటర్లు టిడిపిలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో వైసిపి పాలకవర్గం పదవి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమితో చిత్తూరు జిల్లాలో ఆ పార్టీ కకావికలమవుతోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ప్రతినిధులు పక్క చూపులు చూస్తున్నారు. ఫ్యాన్ పార్టీలో కొనసాగితే పొలిటికల్ ఫ్యూచర్ ఉండదని భావిస్తున్న చాలామంది ప్రతినిధులు పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నారు. అయితే అధికార టిడిపి నుంచి అంతగా సానుకూలత రావడం లేదు. అయితే చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు నుంచే వైసీపీకి షాక్ ఇవ్వమని భావిస్తున్నారు. తొలుత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని వ్యూహం పన్నారు. ఇప్పుడు చిత్తూరు నగరపాలక సంస్థను సైతం హస్తగతం చేసుకోవాలని భావిస్తున్నారు.మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 2021లో చిత్తూరు నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 50 డివిజన్లోకు గాను అప్పట్లో వైసిపి 37 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. అయితే అప్పట్లో ప్రత్యర్థులుగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలను భయపెట్టి ఏకగ్రీవం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో అధికారం చేతులు మారడంతో.. కార్పొరేషన్ ప్రతినిధులు ఆందోళనతో ఉన్నారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే వద్దకు క్యూ కడుతున్నారు. అయితే హై కమాండ్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. వచ్చిన వెంటనే చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ తో పాటు మెజారిటీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయంగా తేలుతోంది. అదే జరిగితే వైసిపికి కోలుకోలేని దెబ్బ.