YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాంగ్రెస్ వేదికపై విజయమ్మ...

 కాంగ్రెస్ వేదికపై విజయమ్మ...

విజయవాడ, జూలై 6,
ఏపీలో కీలక రాజకీయ పరిణామం. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలపై ఉత్కంఠ కొనసాగుతోంది. తండ్రి పేరుతో జగన్ పార్టీ పెట్టారు. అధికారంలోకి రాగలిగారు. గత ఐదేళ్లలో వైయస్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అధికారిక కార్యక్రమం గా ప్రకటించి మరి వేడుకలు జరిపారు. కానీ ఈ ఏడాది అధికారానికి వైసీపీ దూరం కావడంతో… కేవలం ఇడుపులపాయలో నివాళులు అర్పించేందుకు మాత్రమే జగన్ ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అట్టహాసంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించేందుకు షర్మిల సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకులతో పాటు కీలక నేతలంతా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే వారితో విజయమ్మ వేదిక పంచుకోనుండడం హాట్ టాపిక్ గా మారింది. కడప ఎంపీగా ఉంటూ కాంగ్రెస్ నాయకత్వాన్ని విభేదించారు జగన్. నాడు జగన్ కు అండగా నిలిచి కాంగ్రెస్ అధినాయకత్వంతో విభేదించారు విజయమ్మ. షర్మిల సైతం కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారింది. ఆ కుటుంబం స్వరంలో మార్పు వచ్చింది. భవిష్యత్తును వెతుక్కుంటూ షర్మిల కాంగ్రెస్ పంచన చేరారు. విజయమ్మ సైతం ఆమెను ఆశీర్వదించక తప్పలేదు. ఇప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున నిర్వహిస్తుండడంతో విజయమ్మ తప్పనిసరిగా హాజరు కావాలి. గతంలో కాంగ్రెస్ తన కుటుంబానికి తీవ్ర అన్యాయం చేసిందని పలుమార్లు విజయమ్మ విమర్శలు చేశారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ నేతలతో వేదిక పంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. కేవలం షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉండడంతో విజయమ్మకు ఈ అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఈ ఎన్నికల్లో వైసిపి దారుణ పరాజయం పాలయ్యింది.  అదే సమయంలో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. అటు కర్ణాటకతో పాటు తెలంగాణలో సైతం అధికారంలో ఉంది. సరిగ్గా ఈ సమయంలో ఏపీలో సైతం బలపడడానికి అవకాశం కలిగింది. అందుకే వైయస్ జయంతి వేడుకలను బలప్రదర్శనగా భావిస్తున్నారు  షర్మిల. విజయవాడలో అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, సిద్ధరామయ్య, ఖర్గే సహా పెద్దలందరినీ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంతో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటడానికి చూస్తున్నారు. అయితే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అగ్రనేతలు హాజరవుతారా? లేదా? అన్నది చూడాలి.

Related Posts