నెల్లూరు
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్... పిన్నెల్లికి మరిన్ని కేసుల్లో శిక్ష పడేలా సాక్ష్యం చెప్పి వెళ్లారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఈవీయం పగులకొట్టాడని జగన్ చెప్పిన సాక్షాన్ని పరిగణలోకి తీసుకొని పిన్నెల్లిని శిక్షించాలని ఆనం కోరారు. నెల్లూరు సంతపేటలో ఆనం, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు మంత్రులు జిల్లా అభివృద్ధిపై చర్చించారు. ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ నెల్లూరు జిల్లాకు వచ్చి చంద్రబాబుని విమర్శించడం హాస్యాస్పదమని ఈ సందర్భంగా ఆనం విమర్శించారు. భవిష్యత్ లో వైఎస్సార్సీపీ మనుగడ సాధించలేదని జగన్మోహన్ రెడ్ది చెప్పి వెళ్లారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో భయపడిన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు స్వేచ్ఛ వచ్చిందని మంత్రి నారాయణ వెల్లడించారు. నెల్లూరు, కడప జిల్లాల్లోని లే అవుట్లలో అక్రమాలు జరిగాయాన్ని చంద్రబాబు సూచించడంతో విచారణకు ఆదేశించామని చెప్పారు. ఈస్ట్ గోదావరి తోపాటు ఇతర జిల్లాల్లో టీడీఎస్ బాండల్లో జరిగిన అవినీతిపైన కమిటీ వేశామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన సోమశిల జలాశయంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు.